Tirumala News: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ - నిన్న హుండీ ఆదాయం ఎంతంటే?
Tirumala News: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్సులోని 11 కంపార్ట్మెంట్లల్లో భక్తులు వేచి ఉండగా.. సర్వదర్శనం భక్తులకు 18 గంటల సమయం పడుతోంది.
Tirumala News: వేసవి సెలవులు, వారంతరం కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉంది. శ్రీనివాసుడి దర్శనార్ధం వివిధ ప్రాంతాల నుంచి తిరుమల ఏడు కొండలకు భారీగా భక్తులు చేరుకుంటున్నారు. గురువారం రోజున 65,910 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. స్వామి వారికి 27,838 మంది తలనీలాలు సమర్పించగా, 2.89 కోట్ల రూపాయలు భక్తులు హుండీ ద్వారా కానుకలుగా సమర్పించారు. సర్వదర్శనం భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్సు లో 11 కంపార్ట్మెంట్లల్లో భక్తులు వేచి ఉండగా టైం స్లాట్ టోకెన్లు లేని సర్వదర్శనం భక్తులకు 18 గంటల సమయం పడుతుంది. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి మూడు గంటల సమయం పడుతుంది.
ఆకాశ జలాలతో అభిషేక సేవ నిర్వహణ - అన్న ప్రసాదం, లడ్డూ, వడల నైవేద్యం
శ్రీవారి ఆలయంలో వైఖానస ఆగమ శాస్త్రం ప్రకారం శ్రీ వేంకటేశ్వరుడికి కైంకర్యాలు నిర్వహిస్తున్నారు అర్చకులు. శుక్రవారం ప్రత్యూషకాల ఆరాధనతో ఆలయ ద్వారమును తెరిచిన అర్చకులు.. బంగారు వాకిలి వద్ద శ్రీ వేంకటేశ్వర సుప్రభాత స్త్రోతంతో స్వామి వారిని మేలు కొలిపారు. అనంతరం ఆకాశ జలాలతో శ్రీ వేంకటేశ్వరుడికి అభిషేక సేవను ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆ తర్వాత తోమాల, అర్చన సేవలు నిర్వహించిన అర్చకులు.. ప్రాతఃకాల ఆరాధనలో భాగంగా స్నపన మండపంలో శ్రీ కొలువు శ్రీనివాస మూర్తిని వారి సమక్షంలో దర్భార్ నిర్వహించారు. శ్రీవారికి పంచాంగ శ్రవణం చేశారు. ప్రాతఃకాల ఆరాధనలో భాగంగా మొదటి ఘంటా నివేదనలో "బెల్లం పూర్ణం బోండాలు, పోలీల" శుక్రవారం ప్రత్యేకంగా నివేదిస్తారు. వీటితో పాటుగా అన్న ప్రసాదం, లడ్డూ, వడలు స్వామి వారికి నైవేద్యంగా సమర్పించారు.
ఆర్జిత బ్రహ్మోత్సవం, ఆర్జిత వసంతోత్సవం సేవలు..
సన్నిధిలో శ్రీ వైష్ణవ సాంప్రదాయం ప్రకారం సాత్తుమొర నిర్వహించిన అనంతరం సర్కారు హారతి అందించి ప్రోటోకాల్ పరిధిలోని భక్తులకు స్వామి వారి దర్శన భాగ్యం కల్పించింది టీటీడీ. అనంతరం స్వామి వారికి రెండోవ గంట నివేదన, బలి జరిపి సర్వదర్శనం భక్తులకు స్వామి వారి దర్శనానికి అనుమతించారు. శ్రీవారి ఉత్సవ మూర్తులు అయినా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారిని విమాన ప్రదక్షణగా సంపంగి ప్రాకారంలోనికి వేంచేపు చేసి మధ్యాహ్నం 12 గంటలకు నిత్య కళ్యాణోత్సవాన్ని నేత్ర పర్వంగా నిర్వహిస్తారు. అటు తరువాత ఆలయంలోని అద్దాల మండపంలో డోలోత్సవం సేవను నిర్వహించి, ఉత్సవ మూర్తులను ఆలయ వెలుపల ఉన్న వైభోత్సవ మండపానికి ఊరేగింపుగా తీసుకెళ్లి ఆర్జిత బ్రహ్మోత్సవం, ఆర్జిత వసంతోత్సవం సేవలు జరిపిస్తారు. సాయం కాలం సహస్ర దీపాల కొలువులో ఊంజల్ సేవ నిర్వహించిన పిదప నిత్యోత్సవం నిర్వహిస్తారు. సర్వ దర్శనం నిలుపుదల చేసిన అనంతరం శ్రీవారికి రాత్రి కైంకర్యాలు ప్రారంభిస్తారు. ఈ కైంకర్యాల్లో భాగంగా రాత్రి తోమాల, అర్చన, రాత్రి గంట, తిరువీసం, ఘంటాబలి నిర్వహిస్తారు. తిరిగి సర్వదర్శనం భక్తులను స్వాము వారి దర్శనానికి అనుమతించి, సర్వదర్శనం పూర్తి అయిన తరువాత ఆగమోక్తంగా శ్రీవారికి చివరి సేవగా ఏకాంత సేవను నిర్వహిస్తారు అర్చకులు.