Chintamaneni Arrest : చింతమనేని అరెస్టుతో రాజకీయ దుమారం ! పోలీసులపై టీడీపీ తీవ్ర విమర్శలు..!
శుభకార్యానికి వెళ్లి వస్తూండగా చింతమనేనిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఏజెన్సీ ప్రాంతాల్లో అనుమానాస్పదంగా కనిపించడంతో అరెస్ట్ చేశామని విశాఖ రూరల్ ఎస్పీ ప్రకటించారు. పోలీసుల తీరుపై టీడీపీ భగ్గుమంది.
తెలుగుదేశం పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను పోలీసులు విశాఖ జిల్లాలో అరెస్ట్ చేయడం రాజకీయ వివాదంగా మారుతోంది. ఆయనపై మావోయిస్టు, గంజాయి అక్రమ రవాణా అనుమానాలతో అదుపులోకి తీసుకున్నట్లుగా విశాఖ ఎస్పీ ప్రకటన చేయడం మరింత దుమారం రేపుతోంది. పెట్రో ధరల పెంపుపై ఆయన ఆధ్వర్యంలో జరిగిన ఆందోళనపై పోలీసులు కేసులు పెట్టారని ఆ కేసులో అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. కానీ ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు.
ఆదివారం సాయంత్రం చింతమనేని అరెస్ట్..!
ఆదివారం సాయంత్రం చింతమనేని ప్రభాకర్ నర్సీపట్నం దగ్గర అరెస్ట్ చేసినట్లుగా మీడియాకు సమాచారం వచ్చింది. పోలీసులు ఈ విషయాన్ని ధృవీకరించలేదు. ఆయన అనుచరులే మీడియాకు ఈ సమాచారం ఇచ్చారు. కానీ పోలీసులు మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు. మీడియాలో విస్తృతంగా ప్రచారం జరగడంతో పోలీసులు చింతమనేని అరెస్ట్ చేసినట్లుగా తెలిపారు. ఏలూరులో పోలీసుల విధులకు ఆటంకం కలిగించినట్లుగా ఆయనపై కేసు నమోదైందని అందుకే ప్రత్యేక బృందాలు వచ్చి అదుపులోకి తీసుకున్నాయని మీడియాకు అనధికారిక సమాచారం ఇచ్చారు.
విశాఖ రూరల్ ఎస్పీ ప్రకటనతో మరింత దుమారం..!
చింతమనేనిపై మావోయిస్టు, గంజాయి స్మగ్లింగ్ ముద్ర వేసేలా విశాఖ రూరల్ ఎస్పీ పత్రికా ప్రకటన చేయడం టీడీపీ నేతలను మరింత ఆగ్రహానికి గురి చేసింది. మావోయిస్టు ప్రభావిత మారుమూల ఏజెన్సీ ప్రాంతాలు, గ్రామాల్లో గంజాయి అక్రమ రవాణా, చట్ట వ్యతిరేక కార్యక్రమాలు, మావోయిస్టు సానుభూతి పరుల కదలికలపై దృష్టి పెట్టామని .. దారకొండ ఏజెన్సీ ప్రాంతానికి పదికి పైగా వాహనాల్లో కొంతమంది వచ్చి ఇక్కడ అలజడి సృష్టించి వెళ్తున్నట్లుగా సమాచారం వచ్చిందని ఆయన ప్రకటించారు. ఆ సమాచారం ఆధారంగా ఓ వాహనంలో అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తిని మా సిబ్బంది గుర్తించారు. ఆ అనుమానాస్పద వ్యక్తిని మాజీ ఎంఎల్‌ఏ చింతమనేని ప్రభాకర్ గా గుర్తించామని రూరల్ ఎస్పీ తెలిపారు. అధికారులు అడుగుతున్న ప్రశ్నలకు పొంతన లేని సమాధానాలు చెప్పి.. పోలీసులను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నాకని అదుపులోకి తీసుకున్నామని చెప్పుకొచ్చారు.
పోలీసుల తీరుపై భగ్గమన్న టీడీపీ నేతలు..! డీజీపీకిచంద్రబాబు లేఖ..!
విశాఖ రూరల్ ఎస్పీ ప్రకటనపై టీడీపీ నేతలు తీవ్రంగా మండిపడ్డారు. కార్యకర్త ఇంట్లో వివాహనికి వెళ్లి .. తిరిగి వస్తూంటే కాపు కాసి అరెస్ట్ చేసి ఇప్పుడు మావోయిస్టు, గంజాయి పేరుతో పత్రికా ప్రకటన ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు డీజీపీకి లేఖ రాశారు. టీడీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టి వేధించడం.. ప్రశ్నించే వారిని అణగదొక్కే వ్యవహారాలు ప్రజాస్వామ్యానికే పెను ప్రమాదం అన్నారు. చింతమనేనిని తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
వైఎస్ఆర్‌సీపీ కండువా కప్పుకున్న పోలీసుల నిర్వాకమే..!
రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ ఎంతగా దిగజారిపోయిందో చెప్పడానికి మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గారి అరెస్ట్ ఉదంతం తాజా ఉదాహరణ అని లోకేష్ మండిపడ్డారు. ఎందుకు అరెస్ట్ చేసారో చెప్పలేని దుస్థితిలో ఉన్నారంటే అధికార పార్టీకి కొంత మంది పోలీసులు ఎంతగా ఊడిగం చేస్తున్నారో అర్ధమవుతుంది. చింతమనేనిని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు, గంజాయి అక్రమ రవాణా జరిగే ప్రాంతాల్లో అనుమానాస్పదంగా తిరిగినందుకు అరెస్ట్ చేసామని పోలీసులు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. వైకాపా కండువా కప్పుకొని అత్యుత్సాహంతో రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తున్న కొంతమంది పోలీసులు తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు.
రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ ఎంతగా దిగజారిపోయిందో చెప్పడానికి మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గారి అరెస్ట్ ఉదంతం తాజా ఉదాహరణ. ఎందుకు అరెస్ట్ చేసారో చెప్పలేని దుస్థితిలో ఉన్నారంటే అధికార పార్టీకి కొంత మంది పోలీసులు ఎంతగా ఊడిగం చేస్తున్నారో అర్ధమవుతుంది.(1/3) pic.twitter.com/lDv6bxIxII
— Lokesh Nara (@naralokesh) August 30, 2021
ఏలూరుకు చింతమనేని తరలింపు..!
ఏలూరు నుంచి వచ్చిన ప్రత్యేక బృందాలు చింతమనేనిని అరెస్ట్ చేశాయని ప్రచారం జరిగింది. కానీ విశాఖ పోలీసులే అదుపులోకి తీసుకున్నారని రూరల్ ఎస్పీ చెప్పారు. ఆయనను ఏలూరు తీసుకెళ్లడానికి ప్రత్యేక బృందాలు వచ్చాయని పంపించేస్తున్నామని కూడా ప్రకటించారు. చింతమనేనిపై ఏ కేసు ఉందో ఆయనను ఏలూరు తరలించే వరకూ స్పష్టత వచ్చే అవకాశం లేదు. సోమవారం కృష్ణాష్టమి సెలవు అయినందున ఆయనను మేజిస్ట్రేట్ ఎదుట హాజరు పరిచి జైలుకు తరలించే అవకాశం ఉంది.