Bengal Three States : మూడు రాష్ట్రాలుగా బెంగాల్.. మమతపై బీజేపీ కొత్త అస్త్రం..!
ఉత్తర బెంగాల్, జంగల్ మహల్ ప్రత్యేక రాష్ట్ర వాదానికి మద్దతు ఇస్తామని బీజేపీ బెంగాల్ చీఫ్ దిలీప్ ఘోష్ ప్రకటించారు. బీజేపీ బెంగాల్‌ను విభజించాలనుకుంటోందని ఇతర పార్టీల నేతలు విమర్శలు ప్రారంభించారు.
బెంగాల్‌లో విభజన బీజాలు పడుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ప్రధాన ప్రతిపక్షంగా, బలమైన రాజకీయ పార్టీగా ఎదిగిన భారతీయ జనతా పార్టీ బెంగాల్ విభజనకు మద్దతుగా స్వరం మార్చుకుంటోంది. ఇప్పటి వరకూ డార్జిలింగ్ ప్రాంతాన్ని కలిపి గూర్ఖాల్యాండ్‌గా ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ఉండేది. ఆ ఉద్యమాన్ని మమతా బెనర్జీ కంట్రోల్ చేస్తూ వస్తున్నారు. అయితే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఉత్తర బెంగాల్, జంగల్ మహల్ రాష్ట్రాల ఏర్పాటుకు మద్దతు ప్రకటించి సరికొత్త రాజకీయ వ్యూహాన్ని అమలు చేయడం ప్రారంభించింది. దీంతో బెంగాల్ రాజకీయ పార్టీల ఎజెండా మారిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మూడు రాష్ట్రాల కోసం స్వరం పెంచుతున్న బీజేపీ నేతలు..!
రెండు రోజుల క్రితం బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్.. విభజనకు మద్దతుగా మాట్లాడారు. " బెంగాల్ నుండి ఉత్తర బెంగాల్, జంగల్ మహల్‌లు విడిపోవాలనుకుంటే... అందుకు బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీనే కారణం. ఉత్తర బెంగాల్‌లో అభివృద్ధి లేదు.. ఉద్యోగాలు, విద్య, వైద్యం కోసం అక్కడి ప్రజలు పొరుగు రాష్ట్రాలకు వెళ్తున్నారు. సరైన స్కూళ్లు, కాలేజీలు, ఆస్పత్రులు, పరిశ్రమలు, ఆదాయాన్నిచ్చే అవకాశాలు ఎందుకు కల్పించలేదు..ఇదే పరిస్థితి జంగల్ మహల్‌లో కూడా ఉంది" అని వ్యాఖ్యానించారు. నిజానికి దిలీప్ ఘోస్ అభిప్రాయం బెంగాల్ ఒక్కటిగా ఉండాలనే. అయితే అది మూడు నెలల కిందటి వరకు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోగానే.. బీజేపీకి చెందిన అలీపుర్‌దాస్ ఎంపి రాష్ట్రాన్ని విభజించాలని డిమాండ్ చేశారు. కానీ అప్పట్లో ఘోష్.. అది ఎంపీ వ్యక్తిగత అభిప్రాయంగా ప్రకటించారు. బెంగాల్ ఒక్కటిగా ఉండేందుకు బిజెపి కట్టుబడి ఉందని ప్రకటించారు.
బీజేపీ బలంగా ఉన్న ప్రాంతాలు ఉత్తర బెంగాల్, జంగల్ మహల్ ..!
తృణమూల్ నుంచి బీజేపీలో చేరి ఆ పార్టీ తరపున శాసనసభాపక్షనేతగా ఎన్నికైన సువేందు అధికారి దీదీని ఎదుర్కోవాలంటే "ప్రాంత" రాజకీయాలే బెటరనుకున్నారేమో కానీ ఇటీవల ఆయన విభజన ప్రకటనలు చేస్తున్నారు. నైరుతి ప్రజలంతా రాష్ట్రం విడిపోయేందుకు మద్దతుగా ఉన్నారని అన్నారు. దానికి తగ్గట్లుగా దిలీప్ ఘోష్ కూడా స్వరం మార్చారు. బీజేపీ ఆ రెండు ప్రాంతాలను రాష్ట్రాలుగా చేయాలనే విభజన వాదం లేవనెత్తడానికి కారణం ఉంది. ఆ రెండు ప్రాంతాల్లోనే బీజేపీ బలంగా ఉంది. ఉత్తర బెంగాల్ ఎనిమిది జిల్లాల సముదాయం. హిమాలయాల వరకు ఉంటుంది. నైరుతి ప్రాంతం ఐదు జిల్లాలతో ఒడిశా, జార్ఖండ్ సరిహద్దులుగా ఉంటాయి. ఈ రెండు ప్రాంతాలలో 109 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. మిత్రపక్షాలతో కలిసి బీజేపీ వీటిలో 53 స్థానాలు గెల్చుకుంది. ఇతర 183 స్థానాలకు గానూ కేవలం 24 స్థానాలకు మాత్రమే బీజేపీ గెలిచింది. అందుకే తమకు మద్దతు ఉన్న ప్రాంతాలను ప్రత్యేక రాష్ట్రాలను చేయాలనే డిమాండ్ లెవనెత్తినట్లుగా భావిస్తున్నారు.
బీజేపీ తీరుపై ఇతర బెంగాలీ పార్టీల విమర్శలు..!
మమతా బెనర్జీని ఓడించటం కష్టమనుకునే బీజేపీ నేతలు విభజన రాజకీయాలు చేస్తున్నారని తృణమూల్ నేతలు విమర్శలు ప్రారంభించారు. బీజేపీ తీరుపై నిరసనలు కూడా టీఎంసీ క్యాడర్ ప్రారంభించిది. ఠాగూర్ స్థాపించిన విశ్వ భారతి యూనివర్శిటీ క్యాంపస్‌లో ర్యాలీ కూడా నిర్వహించారు. విభజన వ్యతిరేక ప్రతిజ్ఞలు చేశారు. కమ్యూనిస్టులు కూడా విభజన ప్రతిపాదనను ఖండిస్తున్నారు. ఉత్తర, దక్షిణ బెంగాల్ ప్రజలను మానసికంగా విభజించాలనుకుంటున్నారని మండిపడుతున్నారు. బెంగాల్‌లో ఇప్పుడిప్పుడే విత్తుకున్న రాష్ట్ర విభజన రాజకీయం అంత తేలిగ్గా చల్లారే పరిస్థితి ఉండదని..రాజకీయవర్గాలు భావిస్తున్నాయి.