Telangana Assembly session: రేపు తెలంగాణ అసెంబ్లీ సమావేశం-ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం
Telangana Assembly Special Session: తెలంగాణ మూడో అసెంబ్లీ మొదటి సెషన్ రేపు ప్రారంభంకానుంది. ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలు సభలో ప్రమాణస్వీకారం చేయనున్నారు.
Telangana Third Assembly Session: తెలంగాణలో కాంగ్రెస్(Congress Govt) ప్రభుత్వం కొలువుదీరింది. సీఎంగా రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy), 11 మంది ఎమ్మెల్యేలు(11 Ministers) మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. నిన్న (గురువారం) తొలి కేబినెట్ సమావేశం కూడా నిర్వహించారు. ఆరు గ్యారెంటీలపై చర్చించారు. అలాగే రేపు (శనివారం) తెలంగాణ అసెంబ్లీ సమావేశం నిర్వహించాలని కూడా నిర్ణయించారు సీఎం రేవంత్‌రెడ్డి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలు... రేపు (శనివారం) శాసనసభలో ప్రమాణస్వీకారం చేయించేందుకు ఈ సెషన్ నిర్వహించబోతున్నారు. ఎమ్మెల్యేలతో ప్రమాణస్వీకారం చేయించేందుకు ప్రొటెం స్పీకర్‌ను గవర్నర్ తమిళిసై నియమించనున్నారు. ఇవాళ (శుక్రవారం) ఈ ప్రక్రియ జరగనుంది. ప్రొటెం స్పీకర్ గర్నవర్ సమక్షంలో రాజ్‌భవన్‌లో ప్రమాణస్వీకారం చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ప్రొటెం స్పీకర్ శాసనసభలో అధ్యక్ష స్థానంలో ఉండి.. 118 మంది ఎమ్మెల్యేలతో ప్రమాణస్వీకారం చేయిస్తారు.
ప్రొటెం స్పీకర్‌గా ఎవరిని నియమిస్తారు అన్నది కూడా ఆసక్తిగా మారింది. శాసనసభలో సీనియర్లుగా ఉన్న ఎమ్మెల్యేలను ప్రోటెమ్ స్పీకర్‌గా ఎంపిక చేయడం ఎప్పటి నుంచో వస్తున్న ఆనవాయితీ. ఆ ప్రకారం చూస్తే సభలో ప్రస్తుతం సభలో అందరి కన్నా సీనియర్ మాజీ సీఎం కేసీఆర్. ఆయన తొమ్మిది సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇక... మాజీ మంత్రి హరీష్‌రావు, పోచారం శ్రీనివాసరెడ్డి ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక అక్బరుద్దీన్, తలసాని శ్రీనివాస్‌యాదవ్, దానం నాగేందర్, జూపల్లి కృష్ణారావు, ఉత్తమ్ కుమార్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్రావు ఆరుసార్లు ఎమ్మెల్యేలుగా గెలిచారు. వీరిలో ఎవరైనా ప్రోటెమ్ స్పీకర్‌గా వ్యవహరించడానికి అంగీకరిస్తే ప్రాసెస్ జరుగుతుంది. ఒకవేళ అంగీకరించకపోతే... ప్రత్యామ్నాయంగా ఇతరులను ఎంపిక చేసి ఆ ప్రక్రియను పూర్తి చేయిస్తారు.
బీఆర్‌ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు ప్రొటెం స్పీకర్‌గా ఉండేందుకు సహజంగానే ఇష్టపడరు. కనుక... కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన సీనియర్ సభ్యుల్లోనే ఒకరిని ప్రొటెం స్పీకర్‌గా ఎన్నుకునే అవకాశం ఉందని సమాచారం. ప్రోటెమ్ స్పీకర్‌గా ముందుకొచ్చే ఎమ్మెల్యే ముందుగా రాజ్‌భవన్‌లో గవర్నర్ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాతనే సభలో కొత్త ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. రేపు అసెంబ్లీ సెషన్ పెట్టాలని నిర్ణయించడంతో... ఇవాళే ప్రొటెం స్పీకర్ నియామకం జరగాల్సి ఉంది.
స్పీకర్‌గా ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ ఉండే అవకాశం ఉంది. ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం తర్వాత అసెంబ్లీ స్పీకర్ ఎన్నిక కోసం నోటిఫికేషన్ జారీ చేస్తారు. ఈనెల 10వ తేదీ (ఆదివారం) లేదా ఈనెల 11వ తేదీ (సోమవారం) స్పీకర్ ఎన్నిక జరిగే అవకాశం ఉంది. స్పీకర్‌గా వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్‌ను కాంగ్రెస్ హైకమాండ్ ఇప్పటికే ప్రకటించింది. దీంతో ఆయన ఒక్కరే ఈ పదవికి నామినేషన్ దాఖలు చేసే అవకాశం కనిపిస్తోంది. దీంతో స్పీకర్‌గా గడ్డం ప్రసాద్ ఎన్నిక ఏకగ్రీవం కానుంది. స్పీకర్‌గా గడ్డం ప్రసాద్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత... కాసేపు సభను నడిపిస్తారు.
రేపు (శనివారం) నిర్వహించబోతున్న శాసనసభ... కేవలం ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారాల వరకే పరిమితమవుతుందని సంబంధింత వర్గాల ఉంచి సమాచారం అందుతుంది. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక తదితర కీలకమైన అంశాలను చర్చించేందుకు మరోసారి సెషన్ ఉండొచ్చని సమాచారం వస్తోంది. అయితే... ఈ అసెంబ్లీ సెషన్‌ని ఎన్ని రోజులు నిర్వహించాలనే దానిపై బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని తెలంగాణ ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి.