Mahalaxmi Scheme: రాష్ట్రంలో ఉచిత బస్సు ప్రయాణం - ప్రభుత్వ నిర్ణయంపై మహిళల హర్షం
Telangana Free Bus Service: తెలంగాణ 'మహాలక్ష్మి' పథకం కింద ఉచిత బస్ ప్రయాణంపై మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఇదే సమయంలో రద్దీ పెరుగుతుందని, సర్వీసులు పెంచాలని కోరుతున్నారు.
Telangana Women Response on Mahalaxmi Scheme: తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం శనివారం మధ్యాహ్నం నుంచి అందుబాటులోకి వచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, అధికారుల సమక్షంలో 'మహాలక్ష్మి' పేరిట మహిళలకు ఉచిత బస్ సర్వీస్ అందించే పథకాన్ని ప్రారంభించారు. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా మహిళలు వయసుతో సంబంధం లేకుండా పల్లెవెలుగు, ఆర్డినరీ, ఎక్స్ ప్రెస్ సర్వీసుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. అసెంబ్లీ ప్రాంగణంలో మహిళా మంత్రులు సీతక్క, కొండా సురేఖ పచ్చ జెండా ఊపి ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించారు. ఈ పథకానికి సంబంధించి జీరో ఛార్జీ పోస్టర్ ను సీఎం ఆవిష్కరించారు. ఈ అవకాశాన్ని మహిళలందరూ వినియోగించుకోవాలని సూచించారు. ఆయా జిల్లా కేంద్రాల్లో కలెక్టర్లు ఈ పథకాన్ని ప్రారంభించారు.
ఐడీ చూపిస్తే జీరో టికెట్
'మహాలక్ష్మి' పథకం కింద మహిళలు తొలుత వారం రోజులు ఎలాంటి ఐడీ కార్డు లేకుండానే బస్సుల్లో ఉచిత ప్రయాణం సదుపాయాన్ని పొందవచ్చు. ఆ తర్వాత ఆధార్ వంటి ధ్రువపత్రం చూపించాల్సి ఉంటుందని ప్రభుత్వం తెలిపింది. ప్రయాణ సమయంలో ధ్రువీకరణ కోసం గుర్తింపు కార్డులను కండక్టర్లకు చూపిస్తే, ఆ వెంటనే వారికి జీరో టికెట్ మంజూరు చేస్తారు. ఈ పథకం కింద ప్రయాణ పరిధి విషయంలో ఎలాంటి పరిమితులు లేవని సర్కారు స్పష్టం చేసింది. అంతర్రాష్ట్ర సర్వీసులకు తెలంగాణ పరిధిలో మాత్రమే ఉచిత ప్రయాణం వర్తిస్తుందని పేర్కొంది. కాగా, పథకం ప్రారంభం నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి మహిళా మంత్రులు, అధికారులు, ఇతర మహిళలతో కలిసి ఫ్రీ బస్ సర్వీసులో ప్రయాణించారు.
మహిళల హర్షం
ఉచిత బస్సు ప్రయాణం 'మహాలక్ష్మి' పథకంపై మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఫ్రీ బస్ సర్వీస్ తమకు ఓ వరమని విద్యార్థినులు, సాధారణ ఉద్యోగినులు అంటున్నారు. నెలకు రూ.15 వేల నుంచి రూ.20 వేలు జీతాలు వచ్చే వారికి దాదాపు రూ.2 వేలు ప్రయాణాలకే పోతుందని, అలాంటి సమయంలో ప్రభుత్వం ఈ పథకం కింద ఉచిత ప్రయాణం అమలు చేయడం సరైన నిర్ణయమని ప్రశంసిస్తున్నారు. నేడు చాలా వరకూ ఆర్టీసీ బస్సుల్లో మహిళలు, విద్యార్థినుల కోలాహలం కనిపించింది. పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్ సర్వీసుల్లో రద్దీ పెరిగింది. అయితే, బస్సుల సంఖ్య తక్కువగా ఉండడంతో ప్రయాణానికి ఇబ్బంది కలిగే అవకాశం ఉందని, బస్సు సర్వీసులను పెంచి ఇబ్బందులు లేకుండా చూడాలని మహిళామణులు కోరుతున్నారు.
Also Read: Harish Vs Seetakka : అసెంబ్లీ బయట రైతు బంధుపై రచ్చ - హరీష్‌రావుకు సీతక్క కౌంటర్