తెలంగాణలో మాజీ ఐఏఎస్, ఐపీఎస్ మధ్య వివాదం, టీఎస్పీఏ డీడీ నవీన్ కుమార్ ను విచారించిన పోలీసులు
తెలంగాణలో మాజీ ఐఏఎస్, ఐపీఎస్ మధ్య వివాదం సంచలనం రేపుతోంది. ఇంటి వ్యవహారంలో మాజీ ఐఏఎస్, ప్రస్తుత ఐపీఎస్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Former IAS, IPS War In Telangana : తెలంగాణలో మాజీ ఐఏఎస్ (IAS), ఐపీఎస్ (IPS) మధ్య వివాదం సంచలనం రేపుతోంది. ఇంటి వ్యవహారంలో మాజీ ఐఏఎస్, ప్రస్తుత ఐపీఎస్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సదరు సీనియర్ ఐపీఎస్ అధికారి నవీన్ కుమార్(Naveen Kumar)ని సీసీఎస్ పోలీసులు సుదీర్ఘంగా విచారించారు. కీలక వివరాలు రాబట్టినట్లు తెలుస్తోంది. భన్వర్ లాల్ ( Bhanwar Lal) ఇంటి వ్యవహారంలో తాను ఎలాంటి తప్పు చేయలేదని నవీన్ కుమార్ క్లారిటీ ఇచ్చారు. ఈ కేసు కోర్టులో ఉందని, సీసీఎస్ పోలీసులు అడిగిన సమాచారాన్ని ఇచ్చానని వెల్లడించారు. లీగల్ గానే ముందుకు వెళ్తానని స్పష్టం చేశారు.
ఫోర్జరీ సంతకాలు, నకిలీ డాక్యుమెట్లతో తన ఇంటిని కాజేసేందుకు ప్రయత్నించారంటూ...మాజీ ఐఏఎస్ అధికారి భన్వర్ లాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. భన్వర్ లాల్ భార్యత మనిలాల్ ఫిర్యాదుతో జూబ్లీహిల్స్ కు చెందిన ఓర్సు సాంబశివరావు, ఆయన భార్య రూపా డింపుల్ పై సెప్టెంబరు 17న సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. అనేక వివరాలు సేకరించిన తర్వాత ఈ నెల 22న ఓర్సు సాంబశివరావు, రూపా డింపుల్ ను అరెస్టు చేశారు. ఇదే కేసులో సీనియర్ ఐపీఎస్ అధికారి, తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీ జాయింట్ డైరెక్టర్ నవీన్ కూమార్ ను సీసీఎస్ పోలీసులు సుదీర్ఘంగా విచారించారు. 8 గంటల పాటు ప్రశ్నించి, వివరాలు సేకరించారు.
తెలంగాణ ఎన్నికల సంఘం అధికారిగా పని చేసిన భన్వర్ లాల్ కు జూబ్లీహిల్స్ లో ఓ భవనం ఉంది. ఓర్సు సాంబశివరావు అనే వ్యక్తితో 2014లో తన ఇంటికి సంబంధించి అగ్రిమెంట్ చేసుకున్నారు. ఐదేళ్ల పాటు రెంటల్ అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు. భన్వర్ లాల్, ఓర్సు సాంబశివరావు మధ్య రెంటల్ అగ్రిమెంట్ 2019లో ముగిసిపోయింది. అగ్రిమెంట్ ముగిసినా తన ఇంటిని అప్పగించలేదంటూ భన్వర్ లాల్ కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫోర్జరీ సంతకాలు, నకిలీ పత్రాలతో తన ఇంటిని కాజేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఫిర్యాదు పేర్కొన్నారు. వారికి సీనియర్ ఐపీఎస్ అధికారి నవీన్ కుమార్ సహకరించాలని పోలీసులకు తెలిపారు. భన్వర్ లాల్ కుటుంబసభ్యుల ఫిర్యాదుతో సీసీఎస్ పోలీసులు విచారణ చేపట్టారు. డాక్యుమెంట్లు, ఫోర్జరీ సంతకాలు పరిశీలించి...తప్పుడు పత్రాలుగా తేల్చారు. ఈ నెల 22న ఓర్సు సాంబశివరావు, రూపా డింపుల్ ను అరెస్టు చేశారు. విషయం తెలుసుకున్న ఐపీఎస్ నవీన్ కుమార్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.
మాజీ ఐఏఎస్ అధికారి భన్వర్ లాల్ ఇంటిని కాజేసేందుకు ఓర్సు సాంబశివరావు, రూపా డింపుల్ వ్యవహరించారని, వారికి సీనియర్ ఐపీఎస్ అధికారి నవీన్ కుమార్ సహాకారం అందించినట్లు సీసీఎస్ పోలీసులు అనుమానిస్తున్నారు. భన్వర్ లాల్ సంతకాన్ని ఫోర్జరీ చేశారని, తప్పుడు డాక్యుమెంట్లు తయారు చేసినట్లు ప్రాథమిక అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. తన తండ్రిని అన్యాయంగా కేసులో ఇరికించారని, ఐపీఎస్ నవీన్ కుమార్ కొడుకు సాకేత్ అన్నారు. సంబంధం లేకపోయినా అదుపులోకి తీసుకొనొ విచారించారని, భన్వర్ లాల్ ఇంటి వ్యవహారం కోర్టులో నడుస్తోందని స్పష్టం చేశారు. తన తండ్రికి పదోన్నతి వచ్చే సమయంలో కావాలనే కేసుల్లో ఇరికిస్తున్నారని, సీసీఎస్ పోలీసుల తీరుపై కంటెంప్ట్ ఆఫ్ కోర్టు వేస్తామని హెచ్చరించారు.