TSPSC News: టీఎస్పీఎస్సీకి బోర్డు సభ్యుడు రాజీనామా - నిరుద్యోగులకు లేఖ
TSPSC News: కొత్త కమిషన్ ఆధ్వర్యంలోనే నియామకాలు జరగాలన్న నిరుద్యోగుల ఆకాంక్షలను తాను గౌరవిస్తున్నానని స్పష్టం చేశారు.

Telangana News: టీఎస్‌పీఎస్సీ బోర్డు సభ్యుడు సత్యనారాయణ రాజీనామా చేశారు. మాజీ ఎమ్మెల్సీ, జర్నలిస్ట్ అయిన ఆర్. సత్యనారాయణ రాజీనామా చేసిన తర్వాత నిరుద్యోగులకు ఓ లేఖ రాశారు. తాను తన పదవిలో ఉండగా ఎలాంటి తప్పు చేయలేదని లేఖలో పేర్కొన్నారు. అయినా తాను పదవి నుంచి తప్పుకుంటున్నానని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో తాను బాధ్యతగా నిర్వర్తించే వాతావరణం లేదని పేర్కొన్నారు. కొత్త కమిషన్ ఆధ్వర్యంలోనే నియామకాలు జరగాలన్న నిరుద్యోగుల ఆకాంక్షలను తాను గౌరవిస్తున్నానని స్పష్టం చేశారు. ఇప్పుడే కాకుండా తన విద్యార్థి జీవిత కాలం నుంచి కూడా తాను నిరుద్యోగుల పక్షమేనని సత్యనారాయణ స్పష్టం చేశారు. ఇక ముందు కూడా నిరుద్యోగులతోనే ఉంటానని అన్నారు. అందరి ఆశలు, ఆకాంక్షలు వీలైనంత త్వరగా నెరవేరాలని కోరుకుంటున్నట్లు విద్యార్థులను ఉద్దేశించి లేఖలో పేర్కొన్నారు.
టీఎస్పీఎస్సీ నిర్వహించిన పరీక్షా పేపర్లు లీకవ్వడం లాంటి ఘటనలు జరిగినప్పుడు నిరుద్యోగులు ఎంత మానసిక వేదనకు గురయ్యారో ఆవేదన చెందారో ఒక జర్నలిస్టుగా, ఒక మానవతావాదిగా నేను అర్థం చేసుకోగలనని అన్నారు. ఈ ఘటనలు వెలుగులోకి వచ్చినప్పుడు కమిషన్ బాధ్యులుగా తాము కూడా తీవ్ర మానసిక క్షోభను అనుభవించామని చెప్పారు. ఎన్నో నిద్రలేని రాత్రులు తాము గడిపామని.. తీవ్ర అనారోగ్యాలకు గురయ్యామని చెప్పుకొచ్చారు.
పదవులు పట్టుకు వేలాడాలని లేదు
‘‘కమిషన్ సభ్యులుగా కొనసాగాలని ఈ పదవులు పట్టుకుని వేలాడాలని మాకు ఏమాత్రం లేదు. పదవులు మాకు ముఖ్యం కాదు. తెలంగాణ నిరుద్యోగుల ప్రయోజనాలే ముఖ్యం. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నేను ఆరేళ్ల ఎమ్మెల్సీ పదవిని ఏడాదిలోపే తృణప్రాయంగా వదులుకున్నాను. స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటలు చేశాం. మా సహచర సభ్యులు కూడా రాష్ట్ర సాధన కోసం ఎన్నో ఉద్యమాలు చేశారు. ఈ తరహా చరిత్ర కలిగిన మాకు తెలంగాణ నిరుద్యోగుల ప్రయోజనాలే ముఖ్యం తప్ప పదవులు కాదు.
2021 మే నెల 19వ తేదీన మేం కమిషన్ సభ్యులుగా నియామకమైన నాటినుంచి ఇప్పటివరకు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా నిష్పక్షపాతంగా మా బాధ్యతలను నిర్వర్తించాము. 17,269 ఉద్యోగాలకు సంబంధించి 26 నోటిఫికేషన్లు జారీ చేశాం. 13,821 ఉద్యోగాలకు సంబంధించి 20 పరీక్షలు నిర్వహించాం. ఇవన్నీ వివిధ దశల్లో ఉన్నాయి. ఈలోగా కొందరు స్వార్థపరుల కారణంగా అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకున్నాయి. వీటివల్ల నిరుద్యోగులకు అన్యాయం జరిగింది. వారంతా ఎంతో మానసిక ఆందోళనకు గురయ్యారు. మేము కూడా తీవ్రమైన మానసిక ఆందోళనకు, ఉద్రిక్తతకు, ఆవేదనకు, క్షోభకు గురయ్యాం. ఈ పరిస్థితులను తమకు అనుకూలంగా మలచుకునేందుకు కొందరు స్వార్థపరులు ప్రయత్నించారు.
టీఎస్పీఎస్సీకి రాజకీయ మార్పులతో సంబంధం లేదు. ప్రభుత్వాలు మారినా కమిషన్ కొనసాగుతుంది. కమిషన్ ఒకసారి నియామకం అయ్యాక నియమిత కాలం పదవిలో కొనసాగవచ్చు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మేం మా బాధ్యతను నిర్వర్తించే వాతావరణం లేదు. ఈ నేపథ్యంలో నేను టీఎస్పీఎస్సీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను.
మిత్రులారా! నేను ఎల్లప్పుడూ మీ పక్షమే. ఎక్కడవున్నా ఉద్యోగార్తులకు మేలు జరగాలనే కోరుకుంటాను. మీ పక్షానే నిలిచి చేదోడు వాదోడు అవుతాను. మీకు మంచి జరగాలని ఆకాంక్షిస్తాను’’ అని సత్యనారాయణ తన లేఖలో రాశారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

