Bhatti Vikramarka: 'సంపదను సృష్టించి ప్రజలకు పంచుతాం' - 6 గ్యారెంటీలకు వారంటీ లేదన్న వారికి ప్రజలే బుద్ధి చెప్పారన్న డిప్యూటీ సీఎం భట్టి
Bhatti Vikramarka: 6 గ్యారెంటీలను కచ్చితంగా అమలు చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మరోసారి స్పష్టం చేశారు. పదవీ బాధ్యతలు చేపట్టిన అనంతరం మంత్రులు తుమ్మల, పొంగులేటితో ఖమ్మం వెళ్లారు.
![Bhatti Vikramarka: 'సంపదను సృష్టించి ప్రజలకు పంచుతాం' - 6 గ్యారెంటీలకు వారంటీ లేదన్న వారికి ప్రజలే బుద్ధి చెప్పారన్న డిప్యూటీ సీఎం భట్టి telangana news deputy cm bhatti vikramarka slams brs and inaugrates mahalaxmi scheme in khammam latest news Bhatti Vikramarka: 'సంపదను సృష్టించి ప్రజలకు పంచుతాం' - 6 గ్యారెంటీలకు వారంటీ లేదన్న వారికి ప్రజలే బుద్ధి చెప్పారన్న డిప్యూటీ సీఎం భట్టి](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/10/eda3607fffca98486c96f9f43f35eb281702201326644876_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Deputy CM Bhatti Vikramarka Comments in Khammam: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) స్పష్టం చేశారు. మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ఇచ్చిన అన్ని హామీలను అమలు చేస్తామని, కాంగ్రెస్ పార్టీ (Congress) మాట ఇస్తే కచ్చితంగా నెరవేరుస్తుందని చెప్పారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత డిప్యూటీ సీఎం హోదాలో ఆయన తొలిసారి మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageswararao), పొంగులేటి శ్రీనివాసరెడ్డితో (Ponguleti Srinivasreddy) కలిసి ఖమ్మం వచ్చారు. ఈ సందర్భంగా వారికి నాయకన్ గూడెం వద్ద పార్టీ శ్రేణులు, అభిమానులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ర్యాలీగా వెళ్లిన అనంతరం కూసుమంచిలో ఆరోగ్య శ్రీ, మహాలక్ష్మి పథకాలను ప్రారంభించారు. ఈ క్రమంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు.
'సంపదను ప్రజలకు పంచుతాం'
రాష్ట్రంలో సంపదను సృష్టించి, ప్రజలకు పంచుతామని భట్టి విక్రమార్క తెలిపారు. మహాలక్ష్మి పథకం కింద మహిళలు రూపాయి కూడా ఖర్చు లేకుండా రాష్ట్రవ్యాప్తంగా ఉచితంగా బస్సుల్లో ప్రయాణించవచ్చని చెప్పారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు స్వేచ్ఛగా బతకొచ్చని, ఎలాంటి నిర్బంధాలు ఉండవని స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లాలో 10కి 9 స్థానాల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపించారని, ఇది బీఆర్ఎస్ కు చెంపపెట్టని అన్నారు. ఇక ప్రజలు ప్రభుత్వ కార్యాలయాలు చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని, అధికారులే ప్రజల ఇంటికి వచ్చి పనులు చేస్తారని వెల్లడించారు. 'ఇచ్చిన ప్రతి హామీ అమలుకు కాంగ్రెస్ కట్టుబడి ఉంది. బాధ్యతలు చేపట్టిన 2 రోజుల్లోనే 2 గ్యారెంటీలను ప్రారంభించాం. రాష్ట్రంలో పరిశ్రమలు, ఐటీ, సేవా రంగాన్ని ప్రోత్సహిస్తాం. మొదటి వంద రోజుల్లోనే 6 గ్యారెంటీలను అమలు చేస్తాం. కాంగ్రెస్ గ్యారెంటీలకు వారంటీ లేదన్న బీఆర్ఎస్ నేతల విమర్శలకు చెంపదెబ్బ తగిలేలా ప్రజలు ఎన్నికల్లో తీర్పు ఇచ్చారు.' అని భట్టి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ప్రతి రంగాన్ని ప్రోత్సహిస్తామని, ఇందిరమ్మ రాజ్యంలో అందరికీ ఇళ్లు, పించన్లు లభిస్తాయన్నారు. ఖమ్మం జిల్లాకు గోదావరి జలాలు తెచ్చి జిల్లా ప్రజల కాళ్లు కడుగుతామని పునరుద్ఘాటించారు. కాంగ్రెస్ పార్టీ తరఫున జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని, గత ప్రభుత్వం వారికి ఇళ్ల స్థలాలు అమలు చేయకుండా ఇబ్బందులకు గురి చేసిందని అన్నారు. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగిస్తామని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు.
'ప్రతి హామీని నెరవేరుస్తాం'
ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. ఇంతటి ఘన విజయాన్ని అందించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో ధనిక రాష్ట్రం అప్పుల రాష్ట్రంగా మారిందని మండిపడ్డారు. తాము బాధ్యతలు స్వీకరించి 2 రోజులే అయ్యిందని, అప్పుడే బీఆర్ఎస్ నేతలు హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఖమ్మం ప్రజల కాళ్లు కడిగి ఆ నీళ్లు నెత్తిన పోసుకున్నా, ఆ రుణం తీర్చుకోలేనని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల అన్నారు. తన రాజకీయ జీవితం 40 ఏళ్లని ఇప్పుడు, ప్రజలు మళ్లీ ఐదేళ్లు అవకాశం కల్పించారని చెప్పారు. ప్రశాంతమైన ఖమ్మం నగరాన్ని ప్రజలు చూస్తారని స్పష్టం చేశారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)