Abhayahastam: అభయ హస్తం దరఖాస్తులు ఇళ్లకు ఎందుకు? అసలు జరుగుతున్న తంతు ఇది!
Telangana News: దరఖాస్తులను ఇష్టానుసారంగా ప్రైవేటు సిబ్బంది చేతుల్లో పెట్టి ఇళ్లకు తీసుకువెళ్లి అప్లోడ్ చేయాల్సిందిగా ఇస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
![Abhayahastam: అభయ హస్తం దరఖాస్తులు ఇళ్లకు ఎందుకు? అసలు జరుగుతున్న తంతు ఇది! Telangana News Abhaya hastham applications appearing outside after Balanagar flyover incident Abhayahastam: అభయ హస్తం దరఖాస్తులు ఇళ్లకు ఎందుకు? అసలు జరుగుతున్న తంతు ఇది!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/09/c914398b97e8f2bab7ce6632d9f794bd1704806663928234_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Abhaya Hastham Applications: ద్విచక్ర వాహనంపై తీసుకువెళ్తున్న అభయహస్తం దరఖాస్తులు చెల్లాచెదురుగా పడిపోయిన విషయం వైరల్ గా మారి అధికారులు సస్పెండ్ వరకు వెళ్లిన విషయం తెలిసిందే. అయినప్పటికీ దరఖాస్తులను ఇష్టానుసారంగా ప్రైవేటు సిబ్బంది చేతుల్లో పెట్టి ఇళ్లకు తీసుకువెళ్లి అప్లోడ్ చేయాల్సిందిగా ఇస్తున్నారని ఆరోపణలు కుత్బుల్లాపూర్ సర్కిల్ కార్యాలయ అధికారులపై వినిపిస్తున్నాయి. సర్కిల్ కార్యాలయ ఆవరణలో మంగళవారం పలువురు దరఖాస్తులను ద్విచక్ర వాహనంపై పెట్టుకుని తీసుకువెళ్లడం కనిపించింది. ఈ దరఖాస్తులు ఎవరు ఇచ్చారు అనే ప్రశ్నకు వారి వద్ద సమాధానం లేదు. ఎక్కడికి తీసుకు వెళుతున్నారు అని అడిగితే ఇళ్లకు తీసుకువెళ్లి అప్లోడ్ చేయమన్నారు అనే సమాధానం వారి వద్ద వినిపించింది.
ఒక్కొక్కరు ఒక్కో విధంగా..
దరఖాస్తులు బయటకు పంపిస్తున్నారు అనే విషయంపై సర్కిల్ అధికారులు ఒక్కొక్క విధంగా సమాధానం ఇచ్చారు. డిప్యూటీ కమిషనర్ నరసింహ దరఖాస్తులను ఎవరికి ఇవ్వలేదని కార్యాలయంలోనే అప్లోడ్ చేస్తున్నారని సమాధానం ఇవ్వగా.. కార్యాలయంలో స్పేస్ లేదు కాబట్టి వార్డు కార్యాలయాలు కమిటీ హాళ్లు ప్రాంతాల్లో ఎక్కడ యాక్సెస్ ఉంటే అక్కడ చేయిస్తున్నామని సమాధానమిచ్చారు. ఇంకొక అధికారి మాట్లాడుతూ అన్ని అప్లికేషన్లను కార్యాలయంలోని చేస్తున్నామని ఎక్కడికి పంపించటం లేదని తెలిపారు.
ఇంటికి తీసుకు వెళ్ళమని చెప్పారు అనే వీడియో చూపించినప్పటికీ
ఇక అభ్యాసం దరఖాస్తులను ద్విచక్ర వాహనంపై తీసుకు వెళ్తున్న వారు దరఖాస్తులను అప్లోడ్ చేయడానికి ఇళ్లకు తీసుకు వెళుతున్నాము అని చెప్పిన వీడియో అధికారులకు చూపించినప్పటికీ వారి వద్ద నుంచి తెలియదు అన్న సమాధానమే వినిపించింది. పౌరులు చేసుకున్న దరఖాస్తులు ఇవి విధంగా ఎవరు తీసుకు వెళ్లారు తెలియని పరిస్థితిలో సర్కిల్ అధికారులు ఉన్నారు అనే విధంగా అర్థం చేసుకోవచ్చు.
అభయహస్తం దరఖాస్తులపై పర్యవేక్షణ ఏది..?
కుత్బుల్లాపూర్ సర్కిల్ పరిధిలో ఉన్న నాలుగు డివిజన్లలో 74 వేల 129 అభయ హస్తం దరఖాస్తులు అధికారులు అందుకున్నారు. అందుకున్న దరఖాస్తులను రోజుకు 15 వేల చొప్పున అంతర్జాలంలో నమోదు చేసే విధంగా సిబ్బందిని పెట్టుకొని 17వ తేదీ లోపు పూర్తి చేసే విధంగా పనిచేస్తున్నారు. అయితే మొదటి రెండు రోజులు కార్యాలయంలోనే ఉండి నమోదు చేసిన సిబ్బంది మంగళవారం మాత్రం దరఖాస్తులను వాహనాలపై పెట్టుకుని తీసుకువెళ్లారు. తీసుకువెళ్లిన దరఖాస్తులు వార్డు కార్యాలయంకి వెళ్తున్నాయా..?, లేదా సిబ్బంది ఇళ్లకు వెళ్తున్నాయా..? అనే విషయంపై ఎవరికీ క్లారిటీ లేదు.
సర్కిల్ కార్యాలయ భవనంలోని సమావేశ మందిరం కూడా ఉంది. కింద ఉన్న సమావేశం మందిరం సరిపోకపోతే పైన ఉన్న సమావేశం మందిరంలో కూడా సిబ్బందికి ఏర్పాటు చేసి దరఖాస్తులను అప్లోడ్ చేయించే సౌకర్యం ఉన్నప్పటికీ ఆ దిశగా అధికారులు ఆలోచించలేదు. ఇంటర్నెట్ సరిగా లేదు అనే అంశంతోనే దరఖాస్తులను బయటికి ఇచ్చారు అని ఒకరు తెలిపారు. కారణాలు ఏమైనా అభయ హస్తం దరఖాస్తులు పర్యవేక్షణ లేకుండా ద్విచక్ర వాహనాలపై ఇళ్లకు తీసుకువెళ్లడంపై అధికారి యంత్రంపై విమర్శలు వస్తున్నాయి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)