Breaking News Live: ఖబడ్దార్ కేసీఆర్.. నీ దొర పోకడలు సాగనివ్వను, మత్తుతో సీఎం మెదడు మొద్దుబారిందా?: షర్మిల
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 12న జరిగే తాజా వార్తలు ఎప్పటికప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఈ పేజీ అప్ డేట్ అవుతుంటుంది. బ్రేకింగ్ న్యూస్ కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి.
LIVE
Background
గుంటూరు జిల్లా బాపట్లలో కారు ప్రమాదం జరిగింది. కాలువలోకి కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, ముగ్గురికి గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో కారులో ఎనిమిది మంది ఉన్నట్లు తెలుస్తోంది.
తుంగతుర్తి అభ్యర్థిగా ఏపూరి సోమన్న.. షర్మిల ప్రకటన
కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన ఆరు నెలలకే ఆయన పాలన నచ్చక బయటికొచ్చిన ప్రజా గాయకుడు ఏపూరి సోమన్నను తుంగతుర్తి అభ్యర్థిగా వైఎస్ షర్మిల ప్రకటించారు. తుంగతుర్తి ప్రజల కోసం సోమన్న పని చేస్తాడని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ హామీ ఇస్తుందని షర్మిల చెప్పారు. రాజన్న బిడ్డ షర్మిలను ఆశీర్వదించాలని షర్మిల ప్రజలను కోరారు.
ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నాం
‘‘దళితులకు కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటు పొడిచింది. మొన్న మందక్రిష్ణ మాదిగ ఇంటికి వెళ్లా. ఇప్పటిదాకా ఎస్సీ వర్గీకరణ జరగలేదని.. మీ నాన్న ఉంటే జరిగిపోయేది అని ఆయన అన్నారు. దానికోసం పోరాటం చేస్తున్న మందక్రిష్ణ అన్నకు నా ధన్యవాదాలు. మాకు మద్దతు పలికినందుకు ధన్యవాదాలు చెబుతున్నా. వైఎస్ బిడ్డగా మేం పార్టీ పెట్టి 100 రోజులు కూడా కాలేదు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉందని మాటిస్తున్నా. దళిత ఉప కులాలందరికీ రిజర్వేషన్ ప్రయోజనాలు అందించడమే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ లక్ష్యం’’ అని షర్మిల హామీ ఇచ్చారు.
ఎన్నికల కోసమే దళిత బంధు అని కేసీఆర్ నిస్సిగ్గుగా చెప్పాడు: షర్మిల
‘‘హుజూరాబాద్‌లో ఉప ఎన్నికలు వచ్చాయి కనుక దళిత బంధు పేరుతో అక్కడి దళితులకు రాష్ట్రంలో అందరు దళితులకు కేసీఆర్ పంచాయితీ పెట్టాడు. హుజూరాబాద్‌లో ఉప ఎన్నికలు ఉన్నాయని దళిత బంధు పెడుతున్నానని నిస్సిగ్గుగా చెప్పాడంటే.. ఈయనకు ప్రేమ ఉన్నది దళితుల మీదనా? ఎన్నికల మీదనా? అక్కడ తేలిపోతుంది. ఒక్కో దళిత కుటుంబానికి కేసీఆర్ రూ.60 లక్షలు బాకీ ఉన్నాడు. ఎలాగంటే.. మూడెకరాల భూమి, దానిపై వచ్చే పంట మొత్తం కలిపితే రూ.60 లక్షలు అవుతుంది. మీలో ఎవరికైనా దళిత బంధు కింద రూ.10 లక్షల సాయం అందిందా? రూ.10 లక్షలు ఇస్తే తీసుకోండి. అలాగే మిగతా డబ్బులు కూడా ముక్కు పిండి వసూలు చేస్కోండి. డబ్బులకు బదులు ఒక ఉద్యోగం ఇస్తే ఓ కుటుంబం స్థిరపడుతుంది. కళ్లముందే 1.9 లక్షల ఉద్యోగాలు ఉన్నాయి. అందులో 35 వేల మంది దళితులకు ఉద్యోగాలు వస్తాయి. అదే జరిగితే రాబోయే తరాలు ఎంతో బాగుంటాయి.’’ అని షర్మిల ప్రసంగించారు.
ఖబడ్దార్ కేసీఆర్... నీ దొర పోకడలు ఇక సాగనివ్వను
‘‘డబ్బులేని వారు చదువుకోవాలని వైఎస్ ఫీజు రీఎంబర్స్‌మెంట్ ప్రవేశపెట్టారు. ఇప్పుడు పేదింటి బిడ్డలు చదువుకోవద్దని ఫీజు రీఎంబర్స్‌మెంట్ ఆపేశాడు కేసీఆర్. మెస్ బిల్లులు ఇవ్వట్లేదు. ఖబడ్దార్ కేసీఆర్... నీ దొర పోకడలు ఇక సాగనివ్వను. మీ పాలనకు చావు డప్పు కొట్టే రోజు త్వరలోనే ఉంది.’’ అని షర్మిల తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు.
కేసీఆర్.. మత్తుతో మెదడు మొద్దుబారిందా?: షర్మిల
‘‘కేసీఆర్ సీఎం కాకముందు దళితులపై సంవత్సరానికి 270 దాడులు జరిగితే, కేసీఆర్ సీఎం అయ్యాక దళితులపై జరిగిన దాడులు 800 రెట్లు పెరిగాయి. నేరెళ్ల ఘటనలో ఏం జరిగిందో మీరంతా చూశారు. భువనగిరిలో దళిత మహిళను పోలీసులు హత్య చేశారు. ఆసిఫాబాద్‌లో దళిత మహిళను అత్యాచారం చేసి చేతి వేళ్లు నరికేశారు. అయినా కేసీఆర్ నోరు మెదపడం లేదు. ఎందుకు కేసీఆర్ నోరు మెదపట్లేదు? గుండె రాయిగా మారిందా? మత్తుతో మెదడు మొద్దుబారిపోయిందా?’’ అని షర్మిల నిలదీశారు.