Telangana Governor Speech: 'ఇది ప్రజా ప్రభుత్వం.. మాది ప్రజల పాలన' - మెగా డీఎస్సీ, ఉద్యోగాల భర్తీ, రైతు రుణమాఫీపై అసెంబ్లీలో గవర్నర్ కీలక ప్రకటన
Tamilisai Comments: మార్పు కోసం తెలంగాణ ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారని, ఇది ప్రజల ప్రభుత్వమని తెలంగాణ గవర్నర్ తమిళిసై అన్నారు. ఈ సందర్భంగా కొత్త ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు.
Governor Tamilisai Speech in Assembly: తెలంగాణ కొత్త ప్రభుత్వానికి గవర్నర్ తమిళిసై (Governor Tamilisai) అభినందనలు తెలిపారు. అసెంబ్లీలో ఉభయ సభలను ఉద్దేశించి ఆమె శుక్రవారం ప్రసంగించారు. ఈ సందర్భంగా మంత్రులు, ఎమ్మెల్యేలను అభినందించారు. ఇది ప్రజా ప్రభుత్వం అని, మా పాలన దేశానికే ఆదర్శం కాబోతుందని చెప్పారు. ప్రజలకు ఇచ్చిన హామీలను కొత్త ప్రభుత్వం నెరవేర్చాలని ఆకాంక్షించారు. 'తమ జీవితాల్లో మార్పు రావాలని తెలంగాణ (Telangana) ప్రజలు కోరుకున్నారు. మార్పు కోసం స్పష్టమైన తీర్పు ఇచ్చారు. అణచివేత, అప్రజాస్వామిక పోకడలను ప్రజలు సహించరు. ప్రజల ఫిర్యాదులు స్వీకరించేందుకు ప్రజావాణి చేపట్టాం. వారి ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చే దిశగా కృషి చేస్తాం.' అని గవర్నర్ పేర్కొన్నారు. ప్రజాకవి కాళోజి కవితతో ప్రసంగాన్ని ప్రారంభించిన గవర్నర్, దాశరథి సూక్తులతో ముగించారు.
'సామాన్యుడి ప్రభుత్వం'
తెలంగాణ ప్రజలు తమ జీవితాల్లో మార్పు రావాలని కోరుకున్నారని, ఇది సామాన్యుడి ప్రభుత్వమని గర్వంగా చెప్పే పరిస్థితి ఉన్నట్లు గవర్నర్ తెలిపారు. ప్రజల ఫిర్యాదులు స్వీకరించేందుకే ప్రజావాణి చేపట్టామని, ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చే దిశగా కృషి చేస్తామని చెప్పారు. 4 కోట్ల ప్రజల ఆకాంక్షలతో ఏర్పడిన రాష్ట్రం తెలంగాణ అని, మా పాలన దేశానికే ఆదర్శం కాబోతుందని అన్నారు. అమరవీరుల ఆకాంక్షలను పరిగణనలోకి తీసుకుని పాలన సాగిస్తామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా స్వరాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన వారికి సభా వేదికగా నివాళులర్పిస్తున్నట్లు వెల్లడించారు.
100 రోజుల్లో 6 గ్యారెంటీలు
ప్రజా సంక్షేమం కోసమే 6 గ్యారెంటీలను ప్రకటించామని, తొలి అడుగులోనే సంక్షేమానికి ఈ ప్రభుత్వం నాంది పలికిందని గవర్నర్ కొనియాడారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టేందుకు సర్కారు కట్టుబడి ఉందని, ప్రతి ఆడబిడ్డను మహాలక్ష్మి చేయాలనేదే మా ప్రభుత్వ ఆలోచన అని తెలిపారు. 'బాధ్యతలు స్వీకరించిన 48 గంటల్లోనే 2 గ్యారెంటీలు అమలు చేశాం. వచ్చే వంద రోజుల్లో 6 గ్యారెంటీల అమలుకు కార్యాచరణ రూపొందిస్తాం. మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీని నెరవేర్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది.' అని గవర్నర్ వివరించారు.
రుణమాఫీపై కీలక ప్రకటన
రైతులకు రూ.2 లక్షల రుణమాఫీపై త్వరలోనే కార్యాచరణ ప్రకటిస్తామని గవర్నర్ తమిళిసై అసెంబ్లీలో ప్రకటించారు. వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ ఇచ్చేందుకు మా ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. 'ధరణి' పోర్టల్ స్థానంలో అత్యంత పారదర్శకమైన భూమాత పోర్టల్ తీసుకొస్తామని స్పష్టం చేశారు. ప్రతి పంటకు మద్దతు ధర ఇస్తామని, అసైన్డ్, పోడు భూములకు త్వరలోనే పట్టాల పంపిణీ ప్రారంభిస్తామని పేర్కొన్నారు. కాళేశ్వరం, మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల్లో అవినీతిపై విచారణ జరిపించనున్నట్లు వెల్లడించారు. ప్రజల ఆరోగ్య భద్రత దృష్ట్యా, రాజీవ్ ఆరోగ్య శ్రీని తీర్చిదిద్దామని, ఆరోగ్య శ్రీ పరిధిని రూ.10 లక్షలకు పెంచినట్లు వివరించారు. రాష్ట్రంలో కొత్త ఇల్లు నిర్మించుకునే పేదలకు రూ.5 లక్షలు, ఎస్సీ, ఎస్టీలకు రూ.6 లక్షలు ఆర్థిక సాయం అందించనున్నట్లు గవర్నర్ అసెంబ్లీలో ప్రకటించారు. అలాగే, అమరవీరుల కుటుంబాలకు 250 గజాల ఇంటి స్థలం, గౌరవ భృతి అందిస్తామని స్పష్టం చేశారు. ఉద్యోగాల భర్తీపైనా కీలక ప్రకటన చేశారు.
6 నెలల్లో మెగా డీఎస్సీ
వచ్చే 6 నెలల్లో మెగా డీఎస్సీ నిర్వహించి ఉద్యోగాల ఖాళీలు భర్తీ చేస్తామని గవర్నర్ తన ప్రసంగంలో తెలిపారు. గత ప్రభుత్వంలో నిరుద్యోగ యువత జీవితాలతో ఆడుకున్న టీఎస్పీఎస్సీ వ్యవస్థ ప్రక్షాళనకు ఇప్పటికే కార్యచరణ ప్రారంభించామన్నారు. ఏడాది లోపు రెండు లక్షల ఉద్యోగ ఖాళీలను భర్తీకి చర్యలు తీసుకుంటామని పునరుద్ఘాటించారు. వాళా తీసిన తెలంగాణ ఆర్థిక వ్యవస్థను గాడి పెడుతూనే సంక్షేమ పథకాలను, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తామన్నారు. ఆర్థిక వ్యవహారాల నిర్వహణలో ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయో ఎక్కడ దుబారా జరిగిందో కనిపెట్టే పనిలో యంత్రాంగం ఉందని వివరించారు. ప్రజలపై భారం మోపకుండానే సంక్షేమ పాలన అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ ప్రభుత్వం మాటల కంటే చేతల్లో ఎక్కువ చూపిస్తుందని భవిష్యత్‌లో ఆ మార్పు ప్రజలే గమనిస్తారని కూడా గవర్నర్ స్పష్టం చేశారు.