News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Breaking News Live: జగిత్యాల, పెద్దపల్లి, ఆదిలాబాద్ జిల్లాలో స్వల్ప భూప్రకంపనలు

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దేశ వ్యాప్తంగా అక్టోబరు 31న జరిగే తాజా వార్తలు ఎప్పటికప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతూ ఉంటుంది. తాజా సమాచారం కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి.

FOLLOW US: 
దంతేవాడలో ఎన్ కౌంటర్... ముగ్గురు మావోలు మృతి

చత్తీస్ ఘడ్ దంతేవాడలో పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు మహిళా మావోయిస్టులు మృతి చెందారు.  

పెద్దపల్లి జిల్లాలో స్వల్ప భూకంపం.. పరుగులు తీసిన జనం

పెద్దపల్లి జిల్లాలో భూమి స్వల్పంగా కంపించడంతో జనం పరుగులు తీశారు. ఆదివారం రాత్రి ఆరు గంటల 49 నిమిషాల సమయంలో మూడు సెకన్ల పాటు భూమి కంపిచడంతో పలు ప్రాంతాల్లో జనం బయటకు పరుగులు తీశారు. పెద్దపెల్లి జిల్లా లోని పెద్దపల్లి మండలం అప్పన్నపేట, ముత్తారం మండలంలోని  హరిపురం, కేశనపల్లి, దర్యాపూర్ గోదావరిఖని పట్టణంలోని మార్కండేయ కాలనీ అశోక్ నగర్ గాంధీ నగర్ తో పాటు పలు ప్రాంతాలు స్వల్పంగా భూమి కంపించింది. పాలకుర్తి మండలంలోని ఈసాల తక్కలపల్లి, పాలకుర్తి, కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని వెన్నంపల్లి గ్రామాల్లో మూడు సెకన్ల పాటు భూమి కంపించింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని లక్షెటిపేట, బెల్లంపల్లి, మందమర్రి, అసిఫాబాద్, వేమనపల్లి, బెజ్జూరు ప్రాంతాల్లో 5 సెకండ్ల పాటు భూమి కంపించింది.

రేపట్నుంచి ఇంద్రకీలాద్రి  ఘాట్‌రోడ్‌ ప్రవేశం నిలిపివేత 

విజయవాడ ఇంద్రకీలాద్రిపై రేపటి నుంచి ఘాట్‌రోడ్‌ ప్రవేశాన్ని నిలిపివేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఘాట్‌రోడ్డుపై రాళ్లు జారిపడే ప్రాంతాల్లో పనులు జరుగుతున్నందున రానున్న మూడు రోజుల పాటు ఘాట్‌రోడ్‌ ప్రవేశాన్ని మూసివేస్తున్నట్లు వెల్లడించారు. కొండపైకి వచ్చే వాహనాలకు అర్జున వీధి నుంచి అనుమతించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. 

జగిత్యాల జిల్లాలో భూ ప్రకంపనలు

జగిత్యాల జిల్లాలో భూమి స్వల్పంగా కంపించింది. రహ్మతపురాలో సుమారు 5 సెకండ్ల పాటు భూమి కంపించింది.  ఇళ్లలో వస్తువులు కింద పడడంతో.. జనం భయంతో బయటకు పరుగులు  తీశారు. 

ఇద్దరు మంత్రుల శాఖలు పునర్వ్యవస్థీకరణ

ఏపీ ప్రభుత్వం ఇద్దరు మంత్రుల శాఖలను పునర్వ్యవస్థీకరించింది. వాణిజ్య పన్నుల శాఖ బాధ్యతలను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి అప్పగించారు. డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ఇకపై ఎక్సైజ్‌శాఖ మంత్రిగా కొనసాగనున్నారు. ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య పన్నుల శాఖ మంత్రిగా బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి కొనసాగనున్నారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌ శర్మ గెజిట్‌ జారీచేశారు. 

మోతుగూడెం జెన్ కో కాలనీలో కింగ్ కోబ్రా హల్ చల్

తూర్పుగోదావరి జిల్లా మోతుగూడెం జెన్ కో  కాలనీ లోని కింగ్ కోబ్రా హల్ చల్ చేసింది. రాజమహేంద్రవరం వన్య ప్రాణి సంరక్షణ  క్షేత్ర అధికారి ఆదేశాలతో స్నేక్ క్యాచర్ బృందం కింగ్ కోబ్రాను పట్టుకున్నారు. కోబ్రా పొడవు 11 అడుగులు ఉంది. దీని మూడేళ్ల వయసు ఉంటుందని అటవీశాఖ అధికారులు తెలిపారు. కింగ్ కోబ్రాను తులసి పాక ఘాట్ వద్ద అడవుల్లో వదిలి వేసినట్లు రేంజర్ శ్రీనివాస రెడ్డి, డీఆర్వో ఝాన్సన్ తెలిపారు.

విశాఖ చేరుకున్న జనసేనాని పవన్ కల్యాణ్

విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాటానికి మద్దతుగా జనసేన భారీ బహిరంగ సభ ఏర్పాటుచేసింది. ఈ సమభలో పాల్గొనేందుకు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ విశాఖ చేరకున్నారు. 

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్

తెలుగు రాష్ట్రాల్లో త్వరలో ఖాళీ కానున్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏపీలో 3, తెలంగాణలో 6 ఎమ్మెల్సీ స్థానాలకు గానూ నవంబరు 29న పోలింగ్ నిర్వహించనున్నారు. అదే రోజు కౌంటింగ్ నిర్వహిస్తారు. దీనికి సంబంధించి షెడ్యూల్‌ను నవంబరు 9న విడుదల చేస్తారు.

మెదక్ జిల్లాలో 20 మందికి అస్వస్థత

మెదక్‌ పట్టణంలోని కల్లు దుకాణంలో శనివారం ఉదయం కల్లు సేవించిన 20 మంది అస్వస్థతకు గురయ్యారు. వారు కళ్లు తిరిగి పడిపోవడం.. వాంతులు, విరేచనాలతో మెదక్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. రోజంతా చిక్సిత పొందిన అనంతరం ఆరోగ్య పరిస్థితి మెరుగుపడటంతో కొంత మంది ఇళ్లకు వెళ్లిపోయారు. కల్లు తాగిన వారంతా ఆస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. కల్లు దుకాణం నుంచి నమూనాలను సేకరించి నిజామాబాద్‌‌లోని ప్రయోగశాలకు పంపినట్టు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. ఆ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

కడసారి పునీత్‌ను చూసి.. కన్నీరుమున్నీరు

కర్ణాటక ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియలు జరుగుతున్నాయి. పునీత్ భౌతిక కాయాన్ని కంఠీరవ స్టూడియోలోని తల్లిదండ్రుల సమాధుల సమీపంలోనే ఖననం చేస్తున్నారు. భౌతిక కాయాన్ని సమాధిలో ఉంచగానే.. ఆయన్ను చివరిసారి చూసేందుకు సన్నిహితులు, కుటుంబ సభ్యులకు అవకాశం కల్పించారు. ఆ సమయంలో అక్కడున్న అందరూ శోక సంద్రంలో మునిగిపోయారు. పునీత్ భార్య అశ్వినీ, కుమార్తెలు, సోదరుడు సహా కుటుంబ సభ్యులు విలపిస్తుండడం ప్రతి ఒక్కర్నీ కలచివేస్తోంది.

తల్లిదండ్రుల సమాధుల వద్దే ఖననం

కంఠీరవ స్టూడియోలో తల్లిదండ్రుల సమాధుల వద్దే పునీత్ రాజ్ కుమార్‌ను ఖననం చేస్తున్నారు. ఈ సమయంలో భార్యాపిల్లలు, సోదరుడు శివ రాజ్ కుమార్ సహా ఇతర కుటుంబ సభ్యులు దు:ఖాన్ని ఆపుకోలేకపోయారు. తోటివారు వారిని ఓదార్చే ప్రయత్నం చేశారు. 

Background

కన్నడ పవర్ స్టార్‌ పునీత్‌ రాజ్‌కుమార్‌ అంత్యక్రియలు ఆదివారం తెల్లవారుజామునే ప్రారంభమయ్యాయి. బెంగళూరులోని కంఠీరవ స్టూడియోలో ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో పునీత్‌ అంతిమ సంస్కారాలు జరుగుతున్నాయి. తల్లిదండ్రులు రాజ్‌కుమార్‌, పార్వతమ్మ సమాధుల వద్దే పునీత్‌ రాజ్ కుమార్ అంత్యక్రియలు చేస్తున్నారు. అంత్యక్రియల్లో సీఎం బసవకుమార్ బొమ్మై, మాజీ సీఎం యడియూరప్ప, కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌, పలువురు కన్నడ సినీ నటులు పాల్గొన్నారు. పునీత్‌ సోదరుడైన రాఘవేంద్ర కుమారుడు వినయ్‌తో అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు.

రెండ్రోజుల నుంచి ప్రముఖులు, అభిమానుల సందర్శనార్థం..

బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ పార్థీవ శరీరాన్ని చూసి అభిమానులు, ప్రజలు కన్నీరుమున్నీరయ్యారు. టాలీవుడ్ నటులు నందమూరి బాలకృష్ణ, చిరంజీవి, వెంకటేష్, శ్రీకాంత్‌, ఆలీ‌తోపాటు ప్రభుదేవా తదితరులు పునీత్‌కు నివాళులు అర్పించారు.

పునీత్‌కు నివాళులు అర్పించిన తర్వాత హీరో శ్రీకాంత్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా పునీత్‌తో తనకు ఉన్న అనుబంధాన్ని తెలియజేశారు. ‘‘పునీత్ లేడంటే నమ్మలేకపోతున్నాం. కన్నడంలో ‘జేమ్స్’ సినిమా కోసం 40 రోజులు ఆయనతో కలిసి పనిచేశాను. ఈ సినిమా కంటే ముందు నుంచే పునీత్ తెలుసు. ఆయన అన్న శివ రాజ్‌కుమార్‌, ఆయన కుటుంబ సభ్యులు నాకు బాగా తెలుసు. ‘జేమ్స్’ సినిమా ఇంకా పూర్తి కాలేదు. అందులో నాది ప్రతినాయకుడి పాత్ర. నాకు బాడీగార్డుగా పునీత్ నటిస్తున్నాడు. ఇంకా ఒక ఫైట్ సీన్, పాట, డబ్బింగ్ మిగిలి ఉంది. డబ్బింగ్ శివ రాజ్‌కుమార్ చెప్పవచ్చేమో. వారం కిందటే పునీత్ నాతో మాట్లాడాడు. కన్నడ డబ్బింగ్ కూడా నేనే చెప్పాలని కోరాడు’’ అని శ్రీకాంత్ తెలిపారు.

పలువురు అభిమానులకు గుండెపోటు

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ హఠాన్మరణంతో అభిమానులందరూ శోకసంద్రంలో మునిగిపోయారు. అయితే బాధను తట్టుకోలేక ఒక అభిమాని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. రాహుల్ గడివద్దిరా అనే యువకుడు తన ఇంట్లో పునీత్ ఫొటోకు నివాళి అర్పించిన అనంతరం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.

పునీత్ మరణంతో ఫ్యాన్స్ కొందరు గుండెపోటుతో మృతి చెందారు. పునీత్ రాజ్‌కుమార్ మరణానంతరం చాంరాజ్ నగర్ జిల్లాకు చెందిన మునియప్ప అనే 30 సంవత్సరాల వ్యక్తి గుండెపోటుతో మృతి చెందారు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నట్లు తెలుస్తుంది. ఈ విషయాన్ని గ్రామస్తులు తెలిపారు.

బెళగావి ప్రాంతానికి చెందిన పరశురామ్ దేమణ్ణనవర్ అనే యువకుడు కూడా గుండెపోటుతో మృతి చెందాడు. పునీత్ మరణవార్త విన్నప్పటి నుంచి అతను ఏడుస్తూనే ఉన్నాడని తెలుస్తోంది. శుక్రవారం రాత్రి 11 గంటలకు ఆయన గుండెపోటుతో మరణించారు.

ఉడుపి జిల్లాకు చెందిన సతీష్(35) అనే ఆటో డ్రైవర్ బాధలో ఆటోని గట్టిగా కొట్టాడు. దీంతో చేతికి పెద్ద గాయం అయి.. రక్తం కారడం మొదలైంది. ఇతను ఇప్పుడు చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. పునీత్ రాజ్‌కుమార్‌ను తన ఫ్యాన్స్ ప్రేమగా అప్పు అని పిలుస్తారు.