Targeted Killing: కశ్మీర్‌ను వదిలి వెళ్లిపోవటం తప్ప వేరే దారి లేదు - పండిట్‌ల ఆవేదన
Targeted Killing: కశ్మీర్ లోయలో మరోసారి కశ్మీరీ పండిట్‌లపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు.
Targeted Killing Kashmiri Pandit:
వరుస దాడులు..
కశ్మీర్ లోయ మొన్నటి వరకూ కాస్త ప్రశాంతంగానే కనిపించినా...ఇప్పుడు మళ్లీ అలజడి మొదలైంది. కశ్మీరీ పండిట్లే లక్ష్యంగా దాడులు జరుగుతూనే ఉన్నాయి. దక్షిణ కశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలో జరిగిన ఘటన వీటికి కొనసాగింపు. మైనార్టీ కశ్మీరీ పండిట్స్ కమ్యూనిటీకి చెందిన ఇద్దరు సభ్యులపై ఉగ్రవాదులు దాడి చేశారు. వీరిలో ఒకరు మృతి చెందగా...మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. పొలంలో ఉండగా ఉగ్రవాదులు ఒక్కసారిగా ఈ ఇద్దరిపై కాల్పులు జరిపినట్టు పోలీసులు వెల్లడించారు. గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించిన పోలీసులు...దాడి జరిగిన ప్రాంతాన్ని అదుపులోకి తీసుకున్నారు. బాధితులు...అన్నదమ్ములు అని నిర్ధరించారు. దాదాపు వారం రోజులుగా ముష్కరులు లోయలో
ఏదో విధంగా కశ్మీరీ పండిట్‌లపై దాడులకు తెగబడుతూనే ఉన్నారు. నౌహట్టా ప్రాంతంలో ఓ పోలీసుని హతమార్చిన టెర్రరిస్ట్‌లు...ఆ తరవాత బందిపొర ప్రాంతంలో ఓ వలస కూలీని హత్య చేశారు. సోమవారం బుడ్‌గాం, శ్రీనగర్‌లో వరుస బాంబు దాడులు జరిగాయి. ఈ ఘటనలో ఓ కశ్మీరీ పండిట్ తీవ్రంగా గాయపడ్డాడు.
అందరినీ చంపేస్తారేమో: కశ్మీరీ పండిట్ల ఆందోళన
1990ల్లో కశ్మీర్ నుంచి వలస వెళ్లని పండిట్‌లు అంతా కలిసి కశ్మీరీ పండిట్ సంఘర్ష్ సమితి (KPSS)ను ఏర్పాటు చేసుకున్నారు. ఇటీవల జరుగుతున్న ఘటనలపై ఈ సభ్యులు స్పందించారు. "కశ్మీర్ లోయలోని పండిట్‌లందరినీ వెతికి మరీ చంపేస్తాం అనే సంకేతాన్ని టెర్రరిస్టులు ఇస్తున్నారు" అని ఆందోళన చెందుతున్నారు. "లోయలోని కశ్మీరీ పండిట్‌లు అందరూ ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ వరుస దాడులతో టెర్రరిస్ట్‌ల లక్ష్యమేంటో స్పష్టంగా తెలుస్తోంది" అని KPSS ఛైర్మన్ సంజయ్ టిక్కూ అన్నారు. కొందరు గ్రౌండ్ లెవెల్‌లో టెర్రరిస్టుల కోసం పని చేస్తూ కశ్మీరీ పండిట్‌ల హత్యకు సహకరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అమర్‌నాథ్ యాత్ర సమయంలోనూ అంతా ప్రశాంతంగానే ఉందని, ముస్లిమేతర..ముఖ్యంగా కశ్మీరీ పండిట్‌లు టార్గెట్‌గా మారారని చెప్పారు. పండిట్‌లకు రక్షణ కల్పించటంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. "రక్షిస్తాం అనే తీపి కబుర్లు వినటం మానేయండి. ఇప్పటికిప్పుడు కశ్మీర్ లోయను వదిలి వెళ్దాం. మన ముందు రెండే ఆప్షన్లు ఉన్నాయి. ఒకటి ఇక్కడి నుంచి వెళ్లిపోవటం, లేదా టెర్రిరిస్ట్‌ల చేతిలో దారుణంగా చనిపోవటం" అని చాలా ఘాటుగా స్పందిస్తోంది KPSS.ఈ వరుస దాడులను జమ్ము కశ్మీర్ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా సహా పలువురు నేతలు ఖండించారు. "ఇది మాటల్లో చెప్పలేని బాధ. గాయపడిన వ్యక్తి త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా. ఈ దాడులను ప్రతి ఒక్కరూ ఖండించాల్సిందే. ఇందుకు కారణమైన ఉగ్రవాదులను విడిచి పెట్టే సమస్యే లేదు" అని మనోజ్ సిన్హా ట్వీట్ చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడిని పరామర్శించారు. సాక్ష్యాధారాల ప్రకారం..అల్ బదర్, అదిల్ వని అనే ఇద్దరు ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడినట్టు తెలుస్తోంది.