Afghanistan Taliban Crisis: అఫ్గాన్ లో తాలిబన్ల దూకుడు.. అమెరికాకు హెచ్చరిక
తమ పౌరుల తరలింపు ప్రక్రియలో అమెరికా జాప్యం చేస్తే తీవ్ర పర్యవసానాలు ఎదుర్కోవలసి వస్తుందని తాలిబన్లు హెచ్చరించారు. ఆగస్టు 31 వారికి 'రెడ్ లైన్' అని స్పష్టం చేశారు.
అఫ్గానిస్థాన్ లో తాలిబన్లు దూకుడు పెంచారు. అమెరికా తన బలగాలు, పౌరులను ముందుగా అనుకున్నట్లే ఆగస్టు 31 లోపు తరలించుకోవాలని తాలిబన్లు పేర్కొన్నారు. ఒకవేళ గడువు ముగిసిన తర్వాత అమెరికా బలగాలు ఇంకా అఫ్గానిస్థాన్ లోనే ఉంటే పర్యవసానాలు తప్పవని హెచ్చరించారు. ఆగస్టు 31 వారికి రెడ్ లైన్ అని స్పష్టం చేశారు.
బైడెన్ వ్యాఖ్యలతో..
అయితే ఇటీవల బైడెన్ గడువు పెంపుపై వ్యాఖ్యలు చేయడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. తమ బలగాలు, మిత్ర దేశాల పౌరుల తరలింపు ప్రక్రియలో భాగంగా ఆగస్టు 31 గడువు పెంచే అవకాశాలను పరిశీలిస్తున్నామని అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఇటీవల పేర్కొన్నారు. కాబుల్ నుంచి వాయుమార్గంలో భారీగా ప్రజలను తరలించడం ఎంతో క్లిష్టమైన ప్రక్రియ అని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. ప్రాణనష్టం లేకుండా ఇది సాధ్యం కాకపోవచ్చని అభిప్రాయపడ్డారు.
తాము చేపట్టిన ఈ తరలింపు ఆపరేషన్ పూర్తయ్యేవరకూ అఫ్గానిస్థాన్ ను విడిచివెళ్లే ప్రసక్తే లేదన్నారు. అవసరమైతే ఈ గడువును పొడిగించే అవకాశాలను పరిశీలిస్తున్నామన్నారు. ఇప్పటివరకు 28వేల మందిని తరలించగా ఇంకా సగం మంది ఉన్నట్లు సమాచారం.
జీ7 కూటమి..
మరోవైపు అఫ్గానిస్థాన్ తాజా పరిస్థితులపై చర్చించేందుకు జీ7 కూటమి సిద్ధమైంది. ఇప్పటికే ఈ అంశంపై చర్చించాలని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కూటమి సభ్యులను కోరారు. అఫ్గానిస్థాన్ లో తాలిబన్ల అరాచకాలు మితిమీరుతున్న వేళ జీ7 కూటమి ఎలా స్పందిస్తుందనే దానిపై ప్రపంచం మొత్తం ఉత్కంఠగా ఉంది.
తాలిబన్లకు మరో భయం..
మరోవైపు అఫ్గానిస్థాన్ లో తాలిబన్లకు మరో భయం పట్టుకుంది. పంజ్ షీర్ ప్రాంతాన్ని ఆక్రమించేందుకు యత్నించిన తాలిబన్లలో 300 మందిని స్థానిక సైన్యం మట్టుబెట్టినట్లు తెలుస్తోంది. పంజ్‌షీర్ సైన్యం ప్రకటించినట్లుగా 300 మంది తాలిబన్లు మృతి చెందారని, వందల మంది తాలిబన్లు గాయపడినట్లు అంతర్జాతీయ మీడియా సంస్థలు తెలిపాయి. బాగ్లాన్, అంద్రాబ్ ప్రాంతాలు తిరిగి కైవసం చేసుకున్నట్లు పంజ్ షీర్ సైన్యం తెలిపింది. మరికొందరు తాలిబన్లు భారీ ఆయుధాలతో పంజ్‌షీర్ వైపు కదులుతున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. పలువురు తాలిబన్ కమాండర్లు తమ ఆధీనంలో ఉన్నట్లు పంజ్ షీర్ సైన్యం చెబుతోంది. అయితే పంజ్ షీర్ ను కైవసం చేసుకునేందుకు తాలిబన్లు ప్రయత్నిస్తున్నారు.