Tahawwur Rana: ఉగ్ర కుట్ర సరిహద్దులు దాటింది.. దేశంలోని పలు నగరాలు టార్గెట్: NIA కోర్టు
26/11 ముంబై ఉగ్ర దాడిలో తహవ్వూర్ రాణా పాత్రను నిరూపించేందుకు తగిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని, ఉగ్రదాడి కుట్ర దేశం దాటి వ్యాపించిందని NIA కోర్టు పేర్కొంది.

26/11 ముంబై ఉగ్ర దాడిలో తహవ్వూర్ రాణా పాత్రను నిరూపించేందుకు తగిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) కోర్టు పేర్కొంది. ఈ కేసుకు సంబంధించి అరెస్టు చేసేందుకు ప్రధాన నిందితుల్లో తహవ్వుర్ రాణా ఒకడని వెల్లడించింది. ఉగ్రదాడి కుట్ర దేశం దాటి వ్యాపించిందని పేర్కొంది. దేశ రాజధాని సహా దేశంలోని అనేక నగరాలను టార్గెట్ చేశారని.. దర్యాప్తు ద్వారా గుర్తించాలని కోరినట్లు NIA కోర్టు పేర్కొంది.
అమెరికా నుంచి రాణాను తీసుకొచ్చిన తర్వాత 18 రోజుల కస్టడీని NIAకి మంజూరు చేస్తూ ఢిల్లీ కోర్టు తీర్పునిచ్చింది. దీంతో గత శుక్రవారం తెల్లవారుజామున అతన్ని NIA ప్రధాన కార్యాలయానికి తీసుకొచ్చారు. అదనపు సెషన్స్ జడ్జి (NIA) చందర్ జిత్ సింగ్ అతనికి కస్టడీ విధించారు. ఈ కేసులో లోతుగా విచారణ చేపట్టాలని, కుట్రను బహిర్గతం చేసేందుకు రాణాను నిరంతర విచారణ అవసరమని అభిప్రాయపడ్డారు.
‘ఈ కేసులో ఆరోపణలు దేశ భద్రతకు సంబంధించినవని చెప్పేందుకు తగినన్ని ఆధారాలున్నాయి. రికార్డులో సమర్పించిన విషయం ప్రకారం.. కుట్ర భారతదేశ భౌగోళిక సరిహద్దు దాటి ప్రయాణిస్తోందని. దేశ రాజధానితో సహా భారతదేశంలోని అనేక నగరాల్లోని వివిధ ప్రదేశాల్లో బహుళ ప్రాంతాల్లో పేలుళ్లకు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలోనే అసలు విషయం తెలుసుకునేందుకు, కుట్రలో ఉన్న వాస్తవాలను వెలికితీసేందుకు నిరంతర కస్టడీ విచారణ అవసరం’ అని న్యాయమూర్తి ఆ ఉత్తర్వులో పేర్కొన్నట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదించింది.
ఈ కేసులో అరెస్టైన మొదటి నిందితుడు రాణా కాబట్టి.. కోర్టు ముందు పూర్తి వాస్తవాలను సమగ్రంగా సమర్పించేందుకు ఈ విషయంలో సమగ్ర దర్యాప్తు నిర్వహించేందుకు NIAకు న్యాయమైన అవకాశం ఇవ్వాలని కోర్టు పేర్కొంది.
‘కుట్రలోని లోతైన అంశాలను వెలికితీసేందుకు సుదీర్ఘ విచారణకు వీలుగా అతడికి (రాణా) దీర్ఘకాలిక కస్టడీ అవసరమని భావించాం. ముంబై దాడుల్లో పన్నిన వ్యూహాలను ఇతర నగరాల్లో కూడా అమలు చేసేందుకు పూనుకున్నట్లు అనుమానిస్తున్నాం. ఇలాంటి కుట్రలు మరెక్కడైనా అమలవుతున్నాయా అని దర్యాప్తు అధికారులు పరిశీలించాల్సిన ఆవశ్యకత ఉంది’ అని ఈ సందర్భంగా న్యాయమూర్తికి NIA తెలియజేసింది.
కోర్టు రాణాను అడిగినప్పుడు, తన తరఫున వాదించడానికి తనకు చట్టపరమైన ప్రతినిధి ఎవరూ లేరని రాణా కోర్టుకు తెలిపారు. NIA అరెస్టుకు గల కారణాలను లిఖితపూర్వకంగా అందించినట్లు పేర్కొన్నాడు. తన తరఫున వాదించేందుకు న్యాయవాదిని కేటాయించాలని అభ్యర్థించాడు.
తన తరపున వాదించేందుకు నియమితులైన ఏ న్యాయవాది కూడా తన ద్వారా కీర్తిని సంపాదించాలని ప్రయత్నించకూడదని రాణా అభ్యర్థన చేశాడు. అతడి అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న కోర్టు.. 26/11 దాడి నిందితుల గురించి మీడియాతో మాట్లాడవద్దని ప్రత్యేక న్యాయమూర్తి లీగల్ ఎయిడ్ కౌన్సిల్ (LACS)ను ఆదేశించారు. ప్రతి 24 గంటలకు ఒకసారి రాణాకు వైద్య పరీక్షలు నిర్వహించాలని, ప్రతి రోజు తన న్యాయవాదిని కలవడానికి అనుమతి ఇవ్వాలని కూడా కోర్టు NIAని ఆదేశించింది. ‘లీగల్ సర్వీసెస్ కౌన్సెల్ వివరాలు మీడియాకు ఇప్పటికే తెలియకపోతే వాటిని బహిర్గతం చేయకూడదు’ అని న్యాయమూర్తి ఆదేశించారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

