Kethireddy Pedda Reddy: తాడిపత్రి వైసీపీ అభ్యర్థి నేనే, కేతిరెడ్డి వ్యాఖ్యలు - జేసీ ప్రభాకర్ రెడ్డికి ఛాలెంజ్!
Tadipatri MLA: తాడిపత్రి అభివృద్ధికి ఎవరు కృషి చేశారో చర్చకు సిద్ధమా అని కేతిరెడ్డి పెద్దారెడ్డి జేసీ ప్రభాకర్ రెడ్డికి సవాలు విసిరారు.
Tadipatri MLA Kethireddy Pedda Reddy: తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తాడిపత్రి వైసీపీ అభ్యర్థి తానే అని స్వయంగా ప్రకటించుకున్నారు. టీడీపీ నుంచి ఎవరు పోటీ చేస్తున్నారో జేసీ ప్రభాకర్ రెడ్డి తేల్చుకోవాలని సవాలు విసిరారు. టిక్కెట్ల కేటాయింపు విషయంలో సీఎం జగన్ దే తుది నిర్ణయం అని, అధిష్ఠానం ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని శిరసావహిస్తానని అన్నారు. సీఎం జగన్ తనను కుప్పం నుంచి పోటీ చేయాలని ఆదేశిస్తే చంద్రబాబు మీద అయినా పోటీ చేయడానికి రెడీ అని అన్నారు. ఈ మేరకు స్థానిక టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డికి బహిరంగ సవాల్ విసిరారు.
తాడిపత్రి అభివృద్ధికి ఎవరు కృషి చేశారో చర్చకు సిద్ధమా అని కేతిరెడ్డి పెద్దారెడ్డి జేసీ ప్రభాకర్ రెడ్డికి సవాలు విసిరారు. తాను ఎమ్మెల్యే అయిన తర్వాతే తాడిపత్రి నియోజకవర్గం ప్రశాంతంగా ఉందని అన్నారు. తన హయాంలో అభివృద్ధి జరగలేదని నిరూపిస్తే తాను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని అన్నారు. నిరూపించలేకపోతే నువ్వూ.. నీ కుటుంబం రాజకీయాల నుంచి తప్పుకుంటుందా? అని కేతిరెడ్డి పెద్దారెడ్డి.. జేసీ ప్రభాకర్ రెడ్డికి సవాలు చేశారు.
జేసీ ప్రభాకర్ రెడ్డి రాజకీయ ఉనికి కోసం పాకులాడుతున్నారు. తాడిపత్రి అభివృద్ధికి జేసీ ప్రభాకర్ రెడ్డి అడుగడుగునా అడ్డు పడుతున్నారు. అమృత్ స్కీం కింద తాడిపత్రి మునిసిపాలిటీ కి 52 కోట్ల రూపాయలు రాకుండా అడ్డుకుంటున్నారు. సొంత పొలాలకు మాత్రమే నీరు విడుదల చేసుకునే నైజం జేసీ ప్రభాకర్ రెడ్డిదే. టీడీపీ పాలనలో సాగునీరు అడిగితే... రైతుల మోటార్లు లాక్కెళ్లిన చరిత్ర జేసీ కుటుంబానిది. సాగునీటి కోసం మిడుతూరు హైవేపై జేసీ ప్రభాకర్ ఆందోళన చేయడం హాస్యాస్పదం. ప్రజలను పక్కదారి పట్టించేందుకే జేసీ ప్రభాకర్ రెడ్డి ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నారు’’ అని ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వ్యాఖ్యలు చేశారు.