(Source: ECI/ABP News/ABP Majha)
Sunil Kanugolu : సునీల్ కనుగోలుకు కాంగ్రెస్ మరో టాస్క్ - అక్కడా సక్సెస్ అయితే సంచలనమే
Congress : సునీల్ కనుగోలు వ్యూహాలు కాంగ్రెస్‌కు కలసి వస్తున్నాయి. అందుకే ఆయనకు తాజాగా మహారాష్ట్ర వ్యూహాల బాధ్యతను కూడా ఇచ్చారు.
Sunil Kanugolu Maharashtra Poll Strategy In Charge : జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ లోక్ సభ ఎన్నికల్లో పుంజుకోవడంతో భవిష్యత్‌పై ఎంతో నమ్మకంతో ఉంది. వచ్చే కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధిస్తే.. ఇక తర్వాత 2029 లోక్ సభ ఎన్నికల్లో విజయం ఖాయమని అనుకుంటోంది. అందుకే వ్యూహాత్మకంగా అడుగులు ముందుకేస్తోంది. త్వరలో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. పార్లమెంట్ ఎన్నికల్లో అక్కడ కాంగ్రెస్ కూటమికి మంచి ఫలితాలు రావడంతో అసెంబ్లీ ఎన్నికల్లో ఇంకా గట్టిగా పోరాడాలని నిర్ణయించుకున్నారు. వ్యూహాకర్త సునీల్ కనుగోలు సేవలను మహారాష్ట్రకూ తీసుకోవాలని నిర్ణయించారు.
ఇటీవలి కాంగ్రెస్ విజయాల్లో కీలక పాత్ర పోషించిన కనుగోలు
సునీల్ కనుగోలు తెలంగాణ, మహారాష్ట్రలో కాంగ్రెస్ అద్భుత విజయం వెనుక కీలక పాత్ర పోషించారు. ఇన్నోవేటివ్ ప్రచార కార్యక్రమాలతో పాటు ప్రజల్లో ఉన్న పాజిటివిటీని ఓట్ల వరకూ వచ్చేలా చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఆయన కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కోర్ కమిటీలో సభ్యుడిగా కూడా ఉన్నారు. ఆయన ప్లాన్లు చాలా వరకూ సక్సెస్ కావడతో.. పార్లమెంట్ ఎన్నికల్లో గతం కన్నా కాంగ్రెస్ మెరుగైన ఫలితాలు సాధించింది. లో ప్రోఫైల్ లో ఉండే సునీల్ కనుగోలు ఎప్పుడూ తెర ముందుకు రారు. మీడియాతో కూడా ఇంత వరకూ మాట్లాడలేదు. కాంగ్రెస్ సోషల్ మీడియాను ..యాక్టివ్ చేయడంలో.. ప్రజల్ని ఆకట్టుకోవడంలో తనదైన ముద్ర వేసిన ఆయన.. తాను మాత్రం సోషల్ మీడియా ఉపయోగించరు.
మహారాష్ట్రలో కాంగ్రెస్ కూటమికి సానుకూల పరిస్థితులు
మహారాష్ట్రలో భిన్నమైన రాజకీయ పరిస్థితులు ఉన్నాయి. 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. మహా వికాస్ అఘాడీగా పేరు పెట్టుకున్నాయి. కానీ ప్రభుత్వాన్ని నడపలేకపోయారు. ఎన్సీపీ, శివసేన పార్టీలు చీలిపోయాయి. అత్యధిక మంది ఎమ్మెల్యేలు చీలిక గ్రూపుల్లో ఉండటంతో వాటినే ప్రధాన పార్టీగా గుర్తించారు. పార్టీ పేరు, గుర్తులు కూడా వారికే ఇచ్చారు. శరద్ పవార్, ఉద్దవ్ ధాకరే కొత్త పేర్లతో రాజకీయం చేస్తున్నారు. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ తో కలిసి ఆ చీలిక కూటమి నేతలు మంచి ఫలితాలు సాధించారు.
కొత్త వ్యూహాలో భారీ విజయం అందించే బాధ్యతలు తీసుకున్న కనుగోలు
ఇప్పుడు కర్ణాటకలో పరిస్థితులు కాంగ్రెస్ కూటమికి అనుకూలంగా ఉన్నాయన్న ప్రచారం జరుగుతోంది. ప్రధాన పార్టీల్ని చీల్చి కొత్త పార్టీలు ఏర్పాటు చేయడం .. రాజకీయ గందరగోళం.. సీఎం షిండే పనితీరుపై పూర్తి స్థాయిలో ఇంకా సానూకూలత ప్రజల్లో ఏర్పడకపోవడంతో.. మళ్లీ కాంగ్రెస్ కూటమికి మంచి రోజులు వస్తాయన్న ప్రచారం జరుగుతోంది. ఈ పరిస్థితిని అనుకూలంగా మల్చుకునే మెరగైన ఫలితాలు సాధించేలా సునీల్ కనుగోలు కొత్త వ్యూహాలు సిద్ధం చేయనున్నారు.