Sukesh Chandrasekhar : రైలు ప్రమాద బాధిత కుటుంబాలకు రూ. 10 కోట్లు - విరాళం ప్రకటించిన సుఖేష్ చంద్రశేఖర్ !
ఒడిషా రైలు ప్రమాద బాధితులకు సుఖేష్ చంద్రశేఖర్ రూ.పది కోట్ల విరాళం ప్రకటించారు. ఇదంతా న్యాయంగా సంపాదించిందేనన్నారు.
Sukesh Chandrasekhar : మనీ లాండరింగ్ కేసులో జైల్లో ఉన్న సుఖేశ్ చంద్రశేఖర్ రైల్వే మంత్రిత్వశాఖకు రూ. 10 కోట్ల విరాళాన్ని ప్రకటించారు. ఒడిశాలో ఇటీవల జరిగిన రైలు ప్రమాదంలో తల్లిదండ్రులను, కుటుంబ పెద్దలను కోల్పోయి బాధల్లో ఉన్న పిల్లలు, విద్యార్థులు, యువత విద్యా అవసరాల కోసం తన స్వంత కష్టార్జితం నుంచి ఈ విరాళాన్ని ఇస్తున్నట్లు రైల్వే మంత్రికి రాసిన లేఖలో పేర్కొన్నారు.ఒడిశా ప్రమాదం గురించి తెలిసిన తర్వాత అనాథలుగా, దిక్కులేనివారిగా మిగిలిపోయిన పిల్లల భవిష్యత్తు తనను ఆందోళనకు గురిచేసిందని, వారి చదువు అవసరాలు ఆగిపోకూడదని, వారి ఫ్యూచర్‌పై ఎఫెక్టు పడొద్దన్న ఉద్దేశంతో ఈ విరాళాన్ని పంపుతున్నానని పేర్కొన్నారు. ఈ డబ్బును ఆ అవసరాలకు మాత్రమే ఖర్చు చేయాలని రైల్వే మంత్రికి రాసిన లేఖలో పేర్కొన్నారు. ఒక బాధ్యత కలిగిన ‘మంచి’ పౌరుడిగా తాను తన స్వంత ఆదాయం నుంచి ఈ విరాళాన్ని సమకూరుస్తున్నానని, ఇదంతా చట్టబద్ధంగా ఆర్జించిందనేనని లేఖలో పేర్కొన్నారు..
అసలు సుకేశ్ ఎవరు?
సుకేశ్ చంద్రశేఖర్ రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు, వ్యాపారవేత్తల నుంచి డబ్బులు వసూలు చేశాడన్న ఆరోపణలున్నాయి. ప్రముఖ ఫార్మా కంపెనీ రాన్‌బాక్సీ యజమాని శివిందర్ మోహన్ సింగ్‌కు బెయిల్ ఇప్పిస్తానని అతని భార్య అదితి సింగ్ నుంచి 200 కోట్లు వసూలు చేశాడన్న అభియోగంపై జైలులో ఉన్నాడు. సుకేశ్ చంద్రశేఖర్ రోహిణీ జైలులో ఉన్న సమయంలోనే తాను కేంద్ర ప్రభుత్వ అధికారిగా చెప్పుకొని, మనీలాండరింగ్ కేసులో శివిందర్‌కు బెయిల్ ఇప్పిస్తానని నమ్మబలికి రూ.200 కోట్లు గుంజాడన్న ఆరోపణలు ఉన్నాయి.
50 కోట్ల లంచం కేసు
2017లో, వీకే శశికళ, టీటీవీ దినకరన్ నేతృత్వంలోని ఏఐడీఎంకే వర్గానికి రెండు ఆకుల గుర్తు కోసం ఎన్నికల కమిషన్‌కు రూ.50 కోట్ల లంచం ఇవ్వడానికి ప్రయత్నించిన చంద్రశేఖర్‌ను దక్షిణ ఢిల్లీలోని ఫైవ్ స్టార్ హోటల్ లో ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్రమంలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు అతని వద్ద నుంచి లంబోర్గిని, పోర్షే కయెన్, జాగ్వార్, రేంజ్ రోవర్, బెంట్లీ, బిఎమ్‌డబ్ల్యూ, రోల్స్ రాయిస్, టయోటా ల్యాండ్ క్రూయిజర్, డుకాటి మోటార్‌సైకిల్ వంటి లగ్జరీ కార్లను స్వాధీనం చేసుకున్నారు.
మధ్యతరగతి కుటుంబం మనీ లాండరింగ్ కింగ్ గా మారిన సుఖేష్
సుఖేష్ బెంగళూరులోని ఓ మధ్యతరగతి కుటుంబంలో 1989లో జన్మించాడు. ఆయన తండ్రి ఓ చిన్న కాంట్రాక్టర్. ఆ డబ్బుతోనే కుటుంబాన్ని పోషించే వాడు. ఇక సుఖేష్ చదువు విషయానికి వస్తే.. పాఠశాల విద్యను బిషప్ కాటన్ బాయ్స్ స్కూల్, బెంగళూరులో అభ్యసించారు. కళశాల విద్యను మధురై యూనివర్సిటీలో.. కానీ మిడిల్ డ్రాప్. ఆయన పుస్తకాల కంటే.. సమాజాన్ని చాలా బాగా చదివాడు. ఎక్కడ ఏం చేస్తే..కాసులు కురుస్తాయి? ఎవర్ని పట్టుకుంటే.. ధన లక్ష్మి కనికరిస్తుందనే విషయాన్ని అవపోసన పట్టేశాడు. సుకేష్ మధ్య తరగతి కుటుంబంలో పుట్టి పెరిగినా.. లగ్జరీ లైఫ్ ను లీడ్ చేయాలనేది ఆయన కోరిక. విలాసవంతంగా జీవించాలనే లక్ష్యంతో..మంచి,చెడులను పక్కన పెట్టి .. ఈజీ మనీ కోసం పరుగులు పెట్టాడు.
జైల్లో ఉన్న లేఖలతోనే సంచలనాలు
2017 నుంచి జైల్లోనే ఉన్నా.. దేశరాజకీయాలను కుదిపేస్తన్నాడు. ఢిల్లీ అసెంబ్లీలో మొదలు పెట్టి.. తెలంగాణ భవన్ వరకూ షేక్ చేస్తున్నాడు. జైలు నుంచే వరుసగా లేఖలు విడుదల చేస్తూ..పలువురిపై సంచలన ఆరోపణలు చేశాడు. కేవలం 17 ఏళ్లకే మోసం చేశాడనే ఆరోపణలతో జైలు పాలైన సుకేష్ చంద్రశేఖర్ జీవితం ప్రయాణం చాలా ఆసక్తికరంగా ఉంది. రాజకీయ నాయకుల నుంచి బాలీవుడ్ తారల వరకు అందరినీ మోసం చేశాడు. జాక్వెలిన్ ఫెర్నాండెజ్, నోరా ఫతేహి వంటి ఎందరో నటీమణులకు సుకేష్ చంద్రశేఖర్ కోట్ల రూపాయలను సమర్పించినట్టు ఆరోపణలున్నాయి.