Volcanic Eruptions : మిలియన్ల సంవత్సరాల కిందటి ఖగోళ మార్పులతో అగ్నిపర్వత విస్ఫోటనాలు
Volcanic Eruptions : మిలియన్ల సంవత్సరాల కిందటి ఖగోళ మార్పులతో అగ్నిపర్వత విస్ఫోటనాలు
మానవులు చేస్తున్న ఎన్నో రకాల కార్యకలాపాల వల్ల, భూమికి హాని కలిగించేలా చేస్తున్న తప్పిదాల వల్ల ప్రపంచ వ్యాప్తంగా వాతావరణంలో విపరీతమైన మార్పులు సంభవిస్తున్నాయి. గ్లోబల్ వార్మింగ్ కూడా బాగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే మిలియన్ల ఏళ్ల క్రితం సంభవించిన భారీ అగ్నిపర్వతాల విస్ఫోటనం వల్ల వాతావరణ మార్పులకు కారణమైనట్లు ఓ అధ్యయనం వెల్లడిస్తోంది. దాదాపు గత 260 మిలియన్ల సంవత్సరాలలో భారీ అగ్నిపర్వత విస్ఫోటనాలు, వాటి వల్ల సంభవించిన వాతావరణ మార్పుల కారణంగా ఇప్పుడు జీవుల సామూహిక వినాశనానికి దారి తీస్తోందని పరిశోధనలో వెల్లడించారు. ఎర్త్-సైన్స్ రివ్యూస్ జర్నల్‌లో దీనికి సంబంధించిన పరిశోధన గురించి ప్రచురించారు.
భారీ అగ్నిపర్వత విస్ఫోటనాల కారణంగా వాతావరణంలోకి పెద్ద మొత్తంలో కార్బన్ డై ఆక్సైడ్ విడుదల అవుతుందని, దీని వల్ల గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ విపరీతంగా పెరిగిపోయి ప్రాణాంతకమైన పరిస్థితులు ఏర్పడుతున్నట్లు ఈ అధ్యయనం తెలిపింది. భూగర్భంలోని మార్పులే అగ్ని పర్వత విస్ఫోటాలకు కారణమని భావిస్తున్నాం కానీ దీంతో పాటు సౌర కుటుంబంలోని, పాలపుంతలో భూమి పరిభ్రమించే తీరు కూడా అగ్ని పర్వతాలు బద్ధలు కావడానికి కారణమవుతున్నాయని న్యూయార్క్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ మైకేల్ ర్యాంపినో ఈ పరిశోధన ద్వారా అంచనా వేశారు. ప్రతి 26 నుంచి 33 మిలియన్ సంవత్సరాలకు వాతావరణ హెచ్చరికలు సంభవిస్తున్నాయని వీటి వల్ల అదే సమయంలో సౌర వ్యవస్థలోని భూమి కక్ష్యలో కీలకమైన మార్పులు జరుగుతున్నాయని తెలిపారు. సుమారు 16 మిలియన్ల సంవత్సరాల క్రితం చివరి భారీ అగ్నిపర్వత విస్ఫోటనాలు జరిగినట్లు వీరు పరిశోధనలో పేర్కొన్నారు. 26మిలియన్ల సంవత్సరాలలో సంభవించిన ఈ విస్ఫోటనాల కారణంగా భూమిపై లావా దాదాపు 25లక్షల చదరపు కిలోమీటర్ల మేర విస్తరించినట్లు పేర్కొన్నారు.
భూమి భౌగోళిక ప్రక్రియలు దీర్ఘకాలంగా గ్రహం అంతర్గత సంఘటనల ద్వారా నిర్ణయించబడతాయని, వాస్తవానికి సౌర వ్యవస్థ, పాలపుంతలు కూడా భౌగోళిక మార్పులను కారణమవుతాయని పరిశోధనలో తెలిపారు. శాస్త్రవేత్తలు తమ పరిశోధనలలో 20వ, 21వ శతాబ్దాలలో గమనించిన వాతావరణ మార్పులతో సంబంధం కలిగి లేవని స్పష్టంచేశారు. ఎందుకంటే ఇప్పుడు మానవ కార్యకలాపాలకు నిస్సందేహంగా ఆపాదించబడినట్లు తెలిపారు. అయితే కార్బన్ డై ఆక్సైడ్, గ్లోబల్ వార్మింగ్‌ల మధ్య సంబంధం గురించి మున్ముందు మరింత పరిశోధనలు చేయనున్నట్లు తెలిపారు. ఈ అధ్యయనంలో పరిశోధకులు కాంటినెంటల్ ఫ్లడ్-బసాల్ట్ విస్ఫోటనం గురించి రాశారు. ఇది భూమిపై లావాను విపరీతంగా విస్తరింపజేసిన అతి పెద్ద అగ్నిపర్వత విస్ఫోటనం. ఈ విస్ఫోటనం వల్ల దాదాపు 25లక్షల చదరపు కిలోమీటర్ల మేర లావా విస్తరించినట్లు తెలిపారు. అలాగే వారి పరిశోధనలో ఓషియన్ అనాక్సిక్ ఈవెంట్స్ గురించి, సముద్రాలలో ఆక్సిజన్ క్షీణత, జలాలు విషపూరితమవ్వడం గురించి, హైపర్ థర్మల్ క్లైమేట్ పల్సెస్ గురించి వివరించారు. వీటన్నింటి కారణంగా చివరికి సముద్ర, భూసంబంధమైన జీవుల వినాశనం గురించి తెలిపారు.