ఎయిర్‌పోర్ట్ వరకు మెట్రో విస్తరణకు బ్రేక్- నిలిపేయాలని అధికారులకు రేవంత్‌రెడ్డి ఆదేశాలు
తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ విమానాశ్రయ మెట్రో అలైన్‌మెంట్ ప్లాన్ నిలిపివేయాలని అధికారులను ఆదేశించారు.
Telangana Government Stops Airport Metro Alignment Plan : తెలంగాణ ( Telangana )ముఖ్యమంత్రి ( Chief Minister ) రేవంత్‌రెడ్డి ( Revanth Reddy )వరుసబెట్టి సమీక్షా సమావేశాలు ( Review Meetings ) నిర్వహిస్తున్నారు. అంతేవేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. పాలనలో తన మార్కు చూపిస్తున్నారు. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ విమానాశ్రయ మెట్రో అలైన్‌మెంట్ ప్లాన్ ( Airport Metro Alignment Plan ) నిలిపివేయాలని అధికారులను ఆదేశించారు. టెండర్ ప్రక్రియను నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేశారు. 111 జీవో పరిధిలో మెట్రో అలైన్‌మెంట్ ఎలా చేశారని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. 111 జీవో పరిధిలో అభివృద్ధికి అవకాశం తక్కువగా ఉందన్నారు. హైదరాబాద్ మెట్రో రైలు అభివృద్ధి, ఇతర అంశాలపై అధికారులతో సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించారు. మంత్రులు భట్టి విక్రమార్క, పొంగులేటి, సీఎస్ శాంతి కుమారి, పురపాలక శాఖ, మెట్రో అధికారులు పాల్గొన్నారు.
ఔటర్ రింగ్ రోడ్డు ద్వారా విమానాశ్రయానికి మంచి రవాణా సదుపాయం ఉందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వెల్లడించారు. అవసరమైతే విమానాశ్రయ మెట్రోకు ప్రత్యామ్నాయ అలైన్‌మెంట్ తయారు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పాతబస్తీలో అధిక జనాభా దృష్ట్యా మెట్రో అలైన్‌మెంట్ ఉండాలని రేవంత్‌రెడ్డి సూచించారు. ఎంజీబీఎస్, ఫలక్‌నుమా, ఎల్బీనగర్, చాంద్రాయణగుట్ట నుంచి మెట్రో అలైన్‌మెంట్ ఉండాలన్నారు. పాతబస్తీ మెట్రో పనులు చేపట్టకపోవడంపై ఎల్ అండ్ టీపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఎల్ అండ్ టీ మెట్రో రైలు, జీఎంఆర్ ఎయిర్‌పోర్టు రాయితీ ఒప్పందాలను పరిశీలించాలని, మూసీ వెంట రోడ్‌కమ్ మెట్రో కనెక్టివిటీ ఉండేలా ప్రణాళిక రూపొందించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
మరోవైపు హైదరాబాద్‌కు మాస్టర్ ప్లాన్ రూపొందించాలని అధికారులకు ఆదేశాలిచ్చారు సీఎం రేవంత్‌రెడ్డి. కాలుష్యాన్ని వెదజల్లే ఫార్మాసిటీ హైదరాబాద్‌కు సమీపంలో ఉండకూడదన్న ముఖ్యమంత్రి.. ఆయా ఫార్మాసిటీ భూముల్లో టౌన్‌షిప్, కందుకూరు సమీపంలో మెగా టౌన్‌షిప్ కోసం ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. తెలంగాణకు డ్రై పోర్టు కోసం ప్రణాళికలు రూపొందించాలని.. పశ్చిమ, గల్ఫ్ దేశాలకు హైదరాబాద్‌ను లాజిస్టిక్ మెడికల్ హబ్‌గా తీర్చిదిద్దాలని అధికారులకు సూచించారు.
సచివాలయంలో ధరణిపై సీఎం సమీక్షించారు. నిషేధిత భూముల జాబితా, అసైన్డ్, పట్టా భూముల వివరాలు సహా మంత్రులు లేవనెత్తిన అన్ని అంశాలపై నివేదిక ఇవ్వాలని నవీన్ మిత్తల్‌ను సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. భూముల డిజిటలైజేషన్ కోసం గత ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్... సమస్యలకు నిలయంగా మారిందని సీఎం అభిప్రాయపడ్డారు. ధరణిని రద్దు చేసి ఆ స్థానంలో భూమాత పోర్టల్ తీసుకొస్తామని ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఆ దిశగా సీఎం రేవంత్‌రెడ్డి ధరణిపై దాదాపు 2గంటల పాటు సమీక్షించారు. తెలంగాణలో భూ వివాదాల పరిష్కారానికి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. వివాదాల పరిష్కారానికి ఈ ప్రత్యేక కమిటీ మార్గదర్శకాలు రూపొందించనున్నట్లు తెలిపారు. కోనేరు రంగారావు కమిటీ మాదిరిగానే ఈ కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు సీఎం వెల్లడించారు. మంత్రులు, రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు, రైతు ప్రతినిధులు, భూ సంబంధిత చట్టాల్లో నిష్ణాతులు ఈ ప్రత్యేక కమిటీలో ఉంటారని వెల్లడించారు. ధరణి పోర్టల్ ప్రారంభం నుంచి తీసుకున్న నిర్ణయాలపై పూర్తి నివేదిక ఇవ్వాలని సీఎస్ శాంతికుమారిని సీఎం ఆదేశించారు.