Stampede Incidents: ఇది తొక్కిసలాట నామ సంవత్సరమా! దేశంలో పెరుగుతున్న ఘటనలు! నివారణకు చర్యలేంటీ? నిపుణులు ఏం చెబుతున్నారు?
Stampede Incidents: ఒక ప్రాంతంలో సామర్థ్యానికి మించిన ప్రజలు గుమిగూడటం తొక్కిసలాటకు ప్రధాన కారణం. చదరపు మీటరుకు ఏడుగురు కన్నా ఎక్కువ మంది ఉంటే పరిస్థితి ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు.

Stampede Incidents: ప్రపంచంలోనే జనాభాలో మన దేశం నంబర్ వన్ స్థానంలో ఉంది. ఏదైనా పండుగ, జాతర, ఉత్సవాలు, వేడుకలు ఏది జరిగినా పెద్ద ఎత్తున జనం తరలివస్తుంటారు. అది రైల్వే స్టేషన్ అయినా, బస్ స్టేషన్ అయినా, సినిమా థియేటర్ అయినా పెద్ద ఎత్తున జనం కనిపిస్తుంటారు. ప్రత్యేక ఉత్సవాలు, సభలు జరిగినప్పుడు ఇక వేరే చెప్పనక్కర్లేదు. పెద్ద ఎత్తున జన సమీకరణ జరిగే ప్రాంతాల్లో జనాలను నియంత్రించడం పోలీసులకు ఒక సవాలు లాంటిది. ఈ క్రమంలో తరచు చోటు చేసుకుంటున్న తొక్కిసలాటలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఆనందంతో చేరిన ప్రజలకు ఈ తొక్కిసలాటలు విషాదాన్ని నింపుతున్నాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు పద్దెనిమిదేళ్ల తర్వాత ఐపీఎల్ కప్ గెల్చుకోవడంతో అభిమానులు పెద్ద ఎత్తున బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో సంబరాలకు హాజరయ్యారు. ఈ ఆనందోత్సవం కాస్త తొక్కిసలాటతో విషాదంగా మారింది. పెద్ద ఎత్తున క్రికెట్ ప్రేమికులు చేరుకోవడంతో జరిగిన తొక్కిసలాటలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద సంఘటనలకు కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో తెలుసుకుందాం.
ఈ ఏడాదిలో మృత్యుభేరి మోగించిన తొక్కిసలాటలు ఇవే...
- 2025వ సంవత్సరంప్రారంభం నుంచే వరుసగా ఈ సంఘటనలు దేశంలో జరుగుతున్నాయి. జనవరి 8వ తేదీన ఆంధ్రప్రదేశ్‌లోని పుణ్యక్షేత్రం తిరుపతిలో వైకుంఠద్వార దర్శనం కోసం టోకెన్ల పంపిణీ సందర్భంగా పెద్ద ఎత్తున తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు.
- జనవరి 29నఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మరో పుణ్యక్షేత్రం ప్రయాగరాజ్‌లో జరిగిన మహా కుంభమేళా ఉత్సవంలో చోటు చేసుకున్న తొక్కిసలాటలో 30 మంది మృతి చెందారు.
- ఫిబ్రవరి 15న న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో: మహా కుంభమేళాకు వెళ్లే రైళ్ల కోసం ఎదురుచూస్తోన్న ప్రయాణికుల మధ్య జరిగిన తొక్కిసలాటలో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇందులో 11 మంది మహిళలు కాగా, ఐదుగురు చిన్నారులు కూడా చనిపోయారు.
- ఇక తాజాగా జూన్ 4, 2025నబెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ కప్ గెలిచిన సందర్భంగా జరిగిన విజయోత్సవ కార్యక్రమంలో అభిమానుల మధ్య తొక్కిసలాట జరిగింది. ఇందులో 11 మంది ప్రాణాలు కోల్పోయారు.
- వీటితో పాటు 2024 డిసెంబర్ 4వ తేదీన'పుష్ప' సినిమా ప్రీమియర్ షో సందర్భంగా సినీ నటుడు అల్లు అర్జున్ హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్‌కు రావడంతో జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ చనిపోగా, ఆమె కుమారుడు గాయపడి చికిత్స పొందుతున్నారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ అరెస్ట్ జరిగింది. ఈ విషయం కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా యావత్ దేశంలో సంచలనం సృష్టించింది.
ఇలా జనాలు పోగయ్యే చోటు మృత్యుకుహరంగా మారుతుండటం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఇలాంటి ఘటనలతో ఈ ఏడాది దాదాపు 71 మంది దేశ వ్యాప్తంగా ప్రాణాలు కోల్పోయినట్లు రికార్డులు చెబుతున్నాయి.
తొక్కిసలాటకు కారణాలు ఏంటంటే…?
అధిక జన సాంద్రత: ఏదైనా ఒక ప్రాంతంలో సామర్థ్యానికి మించిన ప్రజలు గుమిగూడటం ప్రధాన కారణంగా చెప్పవచ్చు. ఒక చదరపు మీటరుకు ఏడుగురు కన్నా ఎక్కువ మంది జనం ఉంటే పరిస్థితి ప్రమాదకరమని క్రౌడ్ డైనమిక్స్ నిపుణులు చెబుతున్నారు. క్రౌడ్ డైనమిక్స్, పెడెస్ట్రియన్ ఎవల్యూషన్ పై విస్తృతమైన అధ్యయనం చేసిన జార్జ్ బెనెడెట్, జాన్ ఫ్రుహిన్, డీర్క్ హెల్బింగ్ వంటి వారు క్రౌడ్ డైనమిక్స్‌పై పలు సూచనలు చేశారు. వారు చెప్పిందేమిటంటే సాధారణంగా ఒక చదరపు మీటరుకు నలుగురైదుగురు వ్యక్తులు అంటే కదలడం సులువుగా ఉంటుంది. ఆరుగురు ఉంటే ఒత్తిడి మొదలవుతుందని, అదే చదరపు మీటరుకు ఏడు లేక ఎనిమిది మంది ఉంటే వ్యక్తిగత నియంత్రణ కోల్పోయి తొక్కిసలాట జరుగుతుందని, ఊపిరి ఆడక ప్రాణాలు కోల్పోవచ్చని సూచన చేశారు. ఇలా ఇరుకైన ప్రదేశాలు, జనాలు ప్రవేశించే లేక నిష్క్రమించే ద్వారాల వద్ద ఎక్కువగా ఈ తొక్కిసలాటలు జరుగుతాయి. కొన్నిసార్లు బ్రిడ్జిలు వంటివి కూడా ప్రజలు ఎక్కువగా చేరితే తొక్కిసలాటలకు కారణం అవుతాయని చెబుతున్నారు.
కార్యక్రమాల నిర్వహణ లోపం: ఏదైనా ఒక కార్యక్రమానికి ప్రజలు ఎంత మంది హాజరవుతారన్న అంచనా లేకపోవడం, దానికి తగ్గట్టు నిర్వాహకులు లేదా అధికారులు ఏర్పాట్లు చేయకపోవడం ఈ తొక్కిసలాట మరణాలకు కారణం అవుతున్నాయి. అంచనాకు మించి జనాలు వస్తే వారు రావడానికి, వెళ్లడానికి తగిన ద్వారాలు ఏర్పాటు చేయలేకపోవడం, క్యూ పద్ధతిని అమలు చేయడంలో విఫలం కావడం, పోలీసుల నియంత్రణా లోపాల వల్ల ప్రమాదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
వదంతులు - భయాలు: ఏదైనా ఒక ఉత్సవం లేదా సభ జరిగినప్పుడు టపాసులు పేలడం దగ్గర నుంచి ఏదైనా పెద్ద శబ్దాలు వస్తే అక్కడ గుమికూడిన ప్రజల్లో భయాందోళనలు కలుగుతుంటాయి. అదే సమయంలో ఏదైనా వదంతి వ్యాప్తి చెందితే ప్రజలు ఒక్కసారిగా భయంతో పరుగులు తీయడం జరుగుతుంది. అలాంటి అవాంఛనీయ కదలికలు తొక్కిసలాటకు కారణమవుతున్నాయి. చాలా సందర్భాల్లో ఈ వదంతుల కారణంగా భయపడి పరుగులు తీయడం ద్వారా ప్రాణాలు కోల్పోయిన ఘటనలు నమోదు అవుతున్నాయి.
మౌలిక సదుపాయాల కల్పనలో లోపాలు: ఏదైనా సభకు లేదా ఉత్సవాలు, జాతరలకు లక్షలాదిగా తరలి వచ్చే ప్రజలకు అవసరమైన సదుపాయాలు కల్పించడంలో నిర్వాహకులు తప్పులు చేస్తుంటారు. బలహీనమైన బారికేడ్లు ఏర్పాటు చేయడం, సరైన లైటింగ్ సదుపాయాలు కల్పించకపోవడం, నాణ్యత లేని తాత్కాలిక నిర్మాణాలు చేయడం వల్ల అవి కూలడం వంటి ఘటనల వల్ల కూడా తొక్కిసలాటలు జరుగుతున్నాయి.
పటిష్టమైన ప్రణాళికలతో తొక్కిసలాటలను నియంత్రించవచ్చు.
ఏదైనా ఒక కార్యక్రమాన్ని నిర్వహించేటప్పుడు ఎంత మంది హాజరవుతారన్న అంచనా లెక్కలు తప్పకుండా వేయాలి. దానికి మించి వస్తే ఎలా భద్రతతో నిర్వహించాలన్న ప్లానింగ్ ఉండాలి. అంతకు మించి ప్రజలు రాకుండా అవసరం అయితే నిరోధించాలి. క్యూ పద్ధతిలో ప్రజలు ఆ కార్యక్రమానికి వచ్చేలా జాగ్రత్త వహించాలి. టికెట్ల వంటివి ఇచ్చేవి ఉంటే పారదర్శకంగా ప్రజలకు ఇబ్బంది లేకుండా ఇచ్చేలా ప్రణాళికలు రూపొందించాలి. ప్రజల కదలికలను నిరంతరం సీసీ కెమెరాల ద్వారా, అక్కడి సిబ్బంది ద్వారా పర్యవేక్షిస్తూ ఉండాలి.
తొక్కిసలాటలను నివారించే మార్గాలివే
- జనసాంద్రత నియంత్రణ: ఈవెంట్ల సామర్థ్యాన్ని ముందుగానే అంచనా వేసి, దానికి మించి ప్రజలను అనుమతించకుండా చూడాలి. టికెట్ల పంపిణీలో పారదర్శకత, పరిమిత సంఖ్యలో అనుమతించడం ముఖ్యం.
- మెరుగైన ప్రణాళిక, నిర్వహణ: కార్యక్రమానికి ముందుగానే వివరణాత్మక భద్రతా ప్రణాళికను రూపొందించాలి. అత్యవసర నిష్క్రమణ మార్గాలను స్పష్టంగా గుర్తించి, వాటిని ఎప్పుడూ అందుబాటులో ఉంచాలి.
- సమర్థవంతమైన క్యూ నిర్వహణ: క్యూలను సరైన పద్ధతిలో ఏర్పాటు చేసి, వాటి కదలికలను నిరంతరం పర్యవేక్షించాలి. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, వైద్య సిబ్బందిని తప్పనిసరిగా ఈ జనాలు గుమికూడే ప్రాంతాల్లో ఉంచాలి. పోలీసులకు, వాలంటీర్లకు జనసందోహాన్ని ఎలా నియంత్రించాలి, అత్యవసర పరిస్థితుల్లో ఎలా స్పందించాలి, అత్యవసర వైద్యం ఎలా అందించాలన్నదానిపై శిక్షణ ఇవ్వాలి.






















