Super Stalin : స్టాలిన్ సూపర్..! ఆ బ్యాగుల వల్ల తమిళనాడు సీఎంకు ఎన్ని ప్రశంసలంటే..?
ప్రతిపక్ష నేతల బొమ్మలు ఉన్నప్పటికీ ప్రజాధనం వృధా కాకుండా బ్యాగుల్ని పంపిణీ చేయాలని స్టాలిన్ నిర్ణయించారు. దీనిపై ఆయనకు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
ఒకరు ముఖ్యమంత్రి అయితే అప్పటి వరకూ ముఖ్యమంత్రిగా చేసిన నేత గుర్తులు కనిపించకుండా చేయడానికి వేల కోట్లు వృధా చేయడానికి కూడా వెనుకాడని పాలకుల్ని ఇప్పటి వరకూ చూశాం. వారి బొమ్మలు కనిపించే ఏ పథకం అయినా .. ప్రజలకు ఉపయోగపడేదైనా సరే.. నిర్మోహమాటంగా పక్కన పడేసిన వైనం చూశాం. ఇలా చూసి ప్రజాధనం వృధా పోకూడదని ప్రతిపక్ష నేతల బొమ్మలు ఉన్న వస్తువుల్ని పంపిణీ చేసే ప్రభుత్వాలను చూస్తే ఆశ్చర్యపోతాం. అలాంటి ముఖ్యమంత్రిని మహానుభావుడంటాం. ఇప్పుడు స్టాలిన్‌ను చూసి దేశం అంతే అనుకుంటోంది. ఎందుకంటే ఆయన జయలలిత, మాజీ సీఎం పళనిస్వామి బొమ్మలు ఉన్న స్కూల్ బ్యాగుల్ని పంపిణీ చేస్తున్నారు.
తమిళనాడులో నిన్నామొన్నటిదాకా అన్నాడీఎంకే నేత పళని స్వామి సీఎంగా ఉన్నారు. ఆయన స్కూల్ పిల్లలకు బ్యాగులు సరఫరా చేయాలని నిర్ణయించారు. ఆ మేరకు డిజైన్లు ఖరారు చేసి కాంట్రాక్టుకు ఇచ్చారు. ఆ బ్యాగులు తమ పార్టీ గుర్తు రంగుతో .. బ్యాగులపై జయలలితతో పాటు తన సీఎం పళని స్వామి బొమ్మను ఉండేలా రూపొందించారు. ఈ లోపు ఎన్నికలొచ్చాయి. ఆయన మాజీ అయ్యారు. స్టాలిన్ సీఎం అయ్యారు. ఆ బ్యాగులు తయారయి వచ్చాయి. వీటిని చూసి సీఎం తీసి పక్కన పడేయమంటారేమోనని అధికారులు అనుకున్నారు. కానీ మరో మాట లేకుండా వృధా చేయకుండా విద్యార్థులందరికీ పంపిణీ చేయాలని స్టాలిన్ ఆదేశించేశారు. ఇది అధికారుల్నే కాదు ప్రజల్ని కూడా ఆశ్చర్య పరిచింది.
నిజానికి ఆ బ్యాగుల్ని పంపిణీ చేయవద్దని విద్యా మంత్రిపై డీఎంకే పార్టీ నేతలు ఒత్తిడి తెచ్చారు. కానీ రూ.13 కోట్ల ప్రజాధనం వృధా పోవడం ఇష్టం లేక స్టాలిన్ మాత్రం పంపిణీ చేయాలని ఆదేశించారు. స్టాలిన్ ఇలా చేయడం ఇదే మొదటి సారి కాదు. సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత జయలలిత హయాంలో ప్రారంభమైన అమ్మ క్యాంటీన్లను ఆమె పేరుతోనే కొనసాగించాలని నిర్ణయించారు. అక్కడ ఆమె ఫోటోలు కూడా తీయబోవడం లేదని స్పష్టం చేశారు. అలాగే గత ప్రభుత్వం చేపట్టిందని ప్రతీ నిర్ణయాన్ని సమీక్షించలేదు. ప్రజలకు ఉపయోగపడేవాటిని కొనసాగిస్తున్నారు. జయలలిత స్మారకం నిర్మాణానికి కూడా అంగీకరించారు.
తమిళనాడు అంటే మొన్నటి వరకూ కక్ష పూరిత రాజకీయాలకు ప్రసిద్ధి. కానీ ఇప్పుడు అక్కడి రాజకీయాలంటే రాజకీయాలే అన్న వాతావరణం ఏర్పడుతోంది. వ్యక్తిగత శత్రుత్వాలను పక్కన పెట్టి ప్రజాధనం పట్ల గౌరవంగా వ్యవహరిస్తున్నారు. ఇది ఇతర రాష్ట్రాల ప్రజల్ని సైతం ఆకర్షిస్తోంది.