Soul Of Our Society: భారత సంస్కృతి భూమితోనే ముడిపడి ఉంది, సద్గురు ప్రయత్నం భేష్-రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రశంసలు
సేవ్ ది సాయిల్ ఉద్యమంపై రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రశంసల జల్లు కురిపించారు. మట్టిని, భారత సంస్కృతిని వేరు చేసి చూడలేమని వ్యాఖ్యానించారు.
ఎయిర్‌ఫోర్స్ బేస్ వద్ద సేవ్ ది సాయిల్ ఈవెంట్
భూమిని రక్షించుకుందాం అంటూ సద్గురు దాదాపు మూడు నెలలుగా పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేశారు. బైక్ రైడ్ చేస్తూ దేశ, విదేశాలుతిరిగారు. "సేవ్ ది సాయిల్" అనే నినాదంతో చాలా చోట్ల అవగాహనా కార్యక్రమాలూ నిర్వహించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా 100 రోజులు పూర్తి చేసుకుంది ఈ క్యాంపెయిన్. కొయంబత్తూర్‌లోని సులూర్ ఎయిర్‌ఫోర్స్ బేస్ వద్ద ప్రత్యేక ఈవెంట్ నిర్వహించారు సద్గురు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హాజరయ్యారు. భూమిని రక్షించుకునేందుకు ఇప్పుడు మనమంతా చేయి కలిపితే వచ్చే 10-15 ఏళ్లలో అనూహ్యమైన మార్పులు వస్తాయని వ్యాఖ్యానించారు సద్గురు. ఇప్పటికీ ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టకపోతే పాతికేళ్లలో చాలా నష్టం వాటిల్లుతుందని హెచ్చరించారు. ఇప్పటికే జీవవైవిధ్యం ప్రమాదంలో పడిపోయిందని అన్నారు.
సద్గురు ప్రయత్నం అభినందనీయం: రాజ్‌నాథ్ సింగ్
విధానపరమైన మార్పులతో పాటు, ప్రజలూ వాతావరణ పరిరక్షణకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ విషయంలో ప్రభుత్వాలన్నీ ప్రజలకు భరోసానివ్వాలని సూచించారు. ఏ మాత్రం కాలం వృథా చేసినా నష్టపోక తప్పదని అన్నారు. ఇదే కార్యక్రమంలో రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రసంగించారు. భూమి పరిరక్షణకు సద్గురు చేస్తున్న ప్రయత్నాన్ని అభినందించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజల్ని ఏకం చేసి, ఓ పర్యావరణ ఉద్యమాన్ని ప్రారంభించారంటూ ప్రశంసించారు. భారత సంస్కృతికి, మట్టికి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేశారు. భారత సంస్కృతి, సమాజానికి భూమి జీవనాడి అని వ్యాఖ్యానించారు రాజ్‌నాథ్ సింగ్. భూమిని కాపాడుకోవటం అంటే సంస్కృతిని రక్షించుకోవటమేనన్నారు. 60 ఏళ్లుగా సారవమంతమైన నేల శాతం తగ్గిపోతుండటంపై ఆందోళన వ్యక్తం చేసిన ఆయన, సేవ్ ది సాయిల్ ఉద్యమంతో సమస్యకు పరిష్కారం దొరుకుతుందని అభిప్రాయపడ్డారు.
27 దేశాల్లో సింగిల్‌గా బైక్ రైడ్ చేసిన సద్గురు
సేవ్ ది సాయిల్ ఉద్యమంలో భాగంగా సద్గురు 193 దేశాలకు సంబంధించిన విధానాలను అధ్యయనం చేశారు. ఆయా దేశాల్లోని నేల స్వభావాన్ని పరిశోధించారు. అందుకు అనుగుణంగా విధానాల్లో మార్పులు తీసుకురావాలని సూచించారు. 100రోజుల పాటు 27 దేశాల్లో బైక్‌పై పర్యటించిన సద్గురు, మంగళవారం తమిళనాడుకు చేరుకున్నారు. మార్చ్‌లో బైక్ యాత్రను ప్రారంభించారు సద్గురు. దాదాపు 28వేల కిలోమీటర్లు ఒక్కరే పర్యటించారు. ఇప్పటికే 50%నేలలో సారం క్షీణించిందని, భూమిని కాపాడుకోవటానికి అందరూ ముందుకు రావాలని ఆయా దేశాల్లో క్యాంపెయిన్‌లు నిర్వహించారు. ఇప్పటి వరకూ 74 దేశాలు తమ భూ పరిరక్షణకు సంబంధించి తమ విధానాల్లో సంస్కరణలు తీసుకొస్తామని ప్రకటించాయి. భారత్ కూడా అందుకు సిద్ధంగా ఉన్నట్టు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది.