Shiv Sena Party: ఈ ఫిరాయింపుల కష్టాలు శివసేనకు కొత్తేం కాదు, ఈ సారి కోలుకోవటం కష్టమే!
ఇప్పటికే శివసేన పార్టీలో మూడు సార్లు చీలికలు వచ్చాయి. ఏక్‌నాథ్ షిండే తిరుగుబాటుతో మరోసారి పార్టీలోని లుకలుకలు బయటపడ్డాయి.
శివసేనలో లుకలుకలు కొత్తేం కాదు..
మహారాష్ట్రలో శివసేన పార్టీకి గడ్డుకాలం మొదలైంది. థాక్రే ప్రభుత్వం కూలిపోయేందుకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే ఆ పార్టీ రెండుగా చీలిపోయింది. తమ పార్టీలో ఎలాంటి చీలికలు లేవని శివసేన నేతలు చెబుతున్నా, అందులో వాస్తవం లేదని ప్రస్తుత పరిస్థితులే స్ఫష్టం చేస్తున్నాయి. అయితే ఈ సారి ఏక్‌నాథ్ షిండే చేసిన తిరుగుబాటుతో మరోసారి ఆ పార్టీలోని లుకలుకలు బయట పడ్డాయని అంటున్నారు విశ్లేషకులు. నిజానికి శివసేనలో ఇలాంటి విభేదాలు రావటం ఇదే తొలిసారి కాదు. గతంలో దాదాపు మూడు సార్లు శివసేన నేతలు, వేరే పార్టీలోకి ఫిరాయించారు. సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయటం వల్ల వచ్చిన కష్టాలివి. ఇప్పుడు మరోసారి అవే కష్టాలు మొదలయ్యాయి.
ఇప్పటికే నాలుగు సార్లు ఫిరాయింపులు
ఏక్‌నాథ్ షిండే ఫిరాయింపుతో శివసేనలో నాలుగుసార్లు చీలికలు వచ్చినట్టైంది. అంతకు ముందు ముగ్గురు నేతలు ఇదే తరహాలో తిరుగుబాటు చేసి వేరే పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ జాబితాలో మొదట వినిపించే పేరు చాగన్ భుజ్‌బల్. శివసేనతో రాజకీయ ప్రస్థానాన్ని మొదలు పెట్టిన భుజ్‌బల్ 1991లో పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరారు. అదే సమయంలో శరద్ పవార్ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి నేషనల్ కాంగ్రెస్ పార్టీ-NCPని స్థాపించారు. శరద్ పవార్ బాటలోనే భుజ్‌బల్ వెళ్లిపోయారు.
భుజ్‌బల్ బాటలోనే మరో ఇద్దరు..
ఇక చాన్నాళ్ల పాటు శివసేనతోనే అంటకాగిన నారాయణ్ రానే కూడా పార్టీ వీడాల్సి వచ్చింది. ఆయన పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ బాల్ థాక్రే ఆయనపై తీవ్ర స్థాయిలో ఆగ్రహించారు. 2005లో పార్టీ సభ్యత్వాన్ని రద్దు చేశారు. వెంటనే కాంగ్రెస్‌లో చేరారు నారాయణ్. దాదాపు 2017 వరకూ ఆ పార్టీలోనే ఉన్నారు. అయితే కేవలం సీఎం పదవిని ఆశించి మాత్రమే కాంగ్రెస్‌లో చేరారు నారయణ్. ఆర్నెల్లలో ఆ పదవి తనకు వచ్చేలా చూస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని, దాన్ని నిలబెట్టుకోలేకపోయిందన్న అసంతృప్తితో 2017లో కాంగ్రెస్‌ను వీడారు. ఆ ఏడాదే మహారాష్ట్ర స్వాభిమాన్ పక్షా అనే కొత్త పార్టీని స్థాపించారు. 2019లో భాజపాతో చేతులు కలిపారు.
వీళ్లిద్దరి తరవాత శివసేన పార్టీని వీడిన నేత రాజ్ థాక్రే. ఈయన బాల్ థాక్రే మేనల్లుడు. రాజకీయాల్లో ఎదగాలని కలలు కన్నారు రాజ్ థాక్రే. అయితే బాల్ థాక్రే మాత్రం తన కొడుకు ఉద్ధవ్ థాక్రే భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని రాజ్ థాక్రేని పెద్దగా పట్టించుకునే వారు కాదట. శివసేననేతలందరూ కలిసి తనను పక్కన పెట్టటం తట్టుకోలేకపోయారు రాజ్ థాక్రే. అందుకే 2005లో పార్టీకి రాజీనామా చేశారు. సొంత పార్టీ పెడుతున్నట్టు ప్రకటించారు. ఆయన స్థాపించిన మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన పార్టీ...ఇప్పుడు రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. వీరందరి తరవాత ఇప్పుడు ఏక్‌నాథ్ షిండే కూడా అలకబూని పార్టీ వీడారు. ఇలా మొత్తంగా నాలుగు సార్లు కీలక నేతలు..కాదని వెళ్లిపోవటం వల్ల పార్టీకి మచ్చ తెచ్చి పెట్టింది.