Bomb Threats: ఢిల్లీలో మ్యూజియంలకు బాంబు బెదిరింపు మెయిల్స్, పోలీసులు అలెర్ట్
Bomb Threats in Delhi: ఢిల్లీలో 10-15 మ్యూజియంలకు బాంబు బెదిరింపు మెయిల్స్ రావడం కలకలం సృష్టించింది.
Delhi Museums Gets Bomb Threats: ఢిల్లీలోని పలు మ్యూజియంలకు బాంబు బెదిరింపులు రావడం కలకలం సృష్టించింది. ఒక్కసారిగా పోలీసులు అలెర్ట్ అయ్యారు. అన్ని చోట్లకూ పరుగులు పెట్టారు. బాంబ్ స్క్వాడ్‌లతో తనిఖీలు నిర్వహించారు. చివరకు అలాంటిదేమీ లేదని తేల్చి చెప్పారు. ఎవరో కావాలనే చేసి ఉంటారని వెల్లడించారు. ఢిల్లీలోని మ్యూజియంలకు ఈ బాంబు బెదిరింపుల మెయిల్స్ వచ్చాయి. మొత్తం 10 నుంచి 15 మ్యూజియం లకు కొందరు వ్యక్తులు బాంబు బెదిరింపు మెయిల్స్ పంపారు. వీటిలో రైల్వే మ్యూజియం కూడా ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ మొదలు పెట్టారు. ఆ వెంటనే ఇదంతా వదంతి అని స్పష్టం చేశారు.
10-15 museums including the Railway Museum in Delhi received a hoax bomb threat yesterday. A case has been registered and an investigation is underway: Delhi Police
— ANI (@ANI) June 12, 2024
ఇప్పటికే ఢిల్లీలో పలు స్కూల్స్, హాస్పిటల్స్‌కి బాంబు బెదిరింపులు వచ్చాయి. అప్పుడు కూడా ఎక్కడా ఎలాంటి అనుమానాస్పద వస్తువులు కనిపించలేదు. కొంత మంది ఆగంతకులు కేవలం అలజడి సృష్టించేందుకే ఇలాంటి మెయిల్స్ పంపుతున్నారని గుర్తించారు పోలీసులు. ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో బాంబు పెట్టామంటూ ఓ 13 ఏళ్ల బాలుడు బెదిరింపు మెయిల్స్ పంపాడు. వెంటనే గుర్తించిన పోలీసులు ఆ బాలుడిని అరెస్ట్ చేశారు. టోర్నటోకి వెళ్లాల్సిన Air Canada ఫ్లైట్‌లో బాంబు ఉందని బెదిరించాడు. జూన్ 4వ తేదీన అర్ధరాత్రి 11.25 నిముషాలకు ఈ మెయిల్ వచ్చింది. పోలీసులు విచారించగా "ఊరికే సరదాకి చేశాను. నన్ను ట్రాక్ చేస్తారా లేదా అని టెస్ట్ చేశాను" అని ఆ బాలుడు సమాధానమిచ్చాడు. ఆ తరవాత ఆ బాలుడిని జువైనెల్ జస్టిస్ బోర్డ్‌కి తరలించారు. రెండు మొబైల్ ఫోన్స్‌ని స్వాధీనం చేసుకున్నారు.