SBI Pregnant Women : మహిళా లోకం కన్నెర్ర చేస్తే ఎస్‌బీఐ అయినా వణికిపోవాల్సిందే ! అసలేం జరిగిందంటే ?
గర్భంతో ఉన్న మహిళలను ఉద్యోగ నియామకాల్లో పరిగణనలోకి తీసుకోవద్దని ఎస్‌బీఐ ఓ సర్క్యూలర్ జారీ చేసింది. వివాదం కావడంతో వెంటనే ఆ నిబంధన తొలగించింది.
" బ్యాంక్ బ్రాంచీల్లో రూపాయి పెన్నుకు ఎవరూ తీసుకోని విధంగా దారి కట్టి ఫామ్స్ నింపుకునేందుకు అందుబాటులో ఉంచుతారు .. కానీ వేల కోట్లు రుణాలుగా తీసుకుని ఎగ్గొట్టే వారి విషయంలో కనీస జాగ్రత్తలు కూడా తీసుకోరు" అని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాపై ఓ జోక్ సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతూ ఉంటుంది. అది జోక్ కాదు నిజమే.. అలాంటి తెలివి తేటలు ఉన్న ఎస్బీఐకి అలాంటి ఆలోచనలే వస్తాయని మరోసారి రుజువైంది. ఆ బ్యాంక్ జారీ చేసిన ఉత్తర్వులు చూసి దేశమంతా ఆశ్చర్యపోయింది. ఎస్బీఐ అంటే ఆ టైపా అనుకునేలోపు ఆ బ్యాంక్ ఉన్నతాదికారులుక ఏదో తేడా జరుగుతోందని తెలిసిపోయింది. వెంటనే "తూచ్" అంటూ ఓ ప్రకటన ఇచ్చేశారు. సారీ చెప్పేశారు. అసలేం జరిగిందంటే..
Press release relating to news items about required fitness standards for recruitment in Bank. Revised instructions about recruitment of Pregnant Women candidates stands withdrawn.@DFS_India pic.twitter.com/QXqn3XSzKF
— State Bank of India (@TheOfficialSBI) January 29, 2022
దేశంలో అతి పెద్ద బ్యాంక్ అయిన ఎస్బీఐలో ఎప్పుడూ నియామకాలు జరుగుతూనే ఉంటాయి. నోటిఫికేషన్లు ఇస్తూనే ఉంటారు. ఒక్కో ఉద్యోగానికి దరఖాస్తు కింద రూ. ఆరేడు వందలు వసూలు చేసి.. యాభై, వంద పోస్టులకు లక్షల దరఖాస్తులు తీసుకుంటూనే ఉంటారు. ఈ నోటిఫికేషన్ల లో అభ్యర్థుల కామన్ క్వాలిటీస్ అంటూ ఓ నోట్ రెడీ చేసింది. అందులో గర్భంతో ఉన్న మహిళలకు ఉద్యోగం ఇవ్వరాదు.. వారు పని చేయలేరు అని చెప్పుకుంది. మహిళలను అంత మాటన్న తరవాత ఊరుకుంటారా..? . మహిళా లోకం గొంతెత్తింది.
విషయం అర్థమయ్యే సరికి ఆ రూల్స్ తయారు చేసిన ఎస్బీఐ ఉన్నతాధికారులకు కళ్లు తెరుచుకున్నాయి. వెంటనే మరో ప్రకటన విడుదల చేశారు. గర్భిణీలకు ఉద్యోగం ఇవ్వరాదనే తమ సర్క్యూలర్‌ను వెంటనే ఉపసంహరించుకుంటున్నామని ప్రకటించారు. తమ బ్యాంక్‌లో పాతిక శాతం మహిళా ఉద్యోగులే ఉంటారని.. మహిళా సాధికారతను తాము నమ్ముతామని కవర్ చేసుకునే ప్రయత్నం చేశారు.
ప్రెగ్నెన్సీతో ఉన్న మహిళలు పని చేయలేరని ఎస్బీఐ ఉన్నతాధికారులకు ఎందుకు అనిపించిందో.. ఒక వేళ ఇంటర్యూ దాకా వచ్చిన పెగ్నెంట్ మహిళలు ఎల్ల కాలం అలాగే ఉంటారని ఎందుకనుకున్నారో కానీ ఒక్క సారిగా తీవ్ర వివాదానికి కారణం అయ్యారు. అయితే వేగంగా స్పందించి ఆ నిబంధనను తొలగించారు. కానీ మహిళా లోకం మనోభావాలు మాత్రం దెబ్బతిన్నాయి. అయినా ఇలాంటివి ఎస్‌బీఐ పట్టించుకోదు.. ఎందుకంటే అది గవర్నమెంట్ బ్యాంక్ మరి !