Ukraine Russia War: యుద్ధం అయిపోయాక రష్యా పరిస్థితేంటి? పుతిన్ వ్యాఖ్యలకు అర్థమేంటి?
Ukraine Russia War: ఉక్రెయిన్ సైన్యాన్ని రూపుమాపేందుకే తాము యుద్ధం చేస్తున్నామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చేసిన వ్యాఖ్యలకు అంతరార్థం ఏంటి? ఈ యుద్ధాన్ని పుతిన్ ఎలా సమర్థించుకుంటున్నారు.
Ukraine Russia War: "ఉక్రెయిన్‌పై రష్యా సైనిక ఆపరేషన్ చేపడుతుంది" ఇది ఈరోజు ఉదయం యుద్ధం ప్రారంభించేముందు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చేసిన వ్యాఖ్యలు.
"ఉక్రెయిన్‌లోని కీలక నగరాలపై దాడులు చేస్తున్న వార్తలను ఖండిస్తున్నాం. ఉక్రెయిన్ సైనిక స్థావరాలు, వసతులు, ఎయిర్ డిఫెన్స్, వాయుసేనను లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తున్నాం." ఇది యుద్ధం మొదలయ్యాక రష్యా చేసిన ప్రకటన.
ఉక్రెయిన్‌పై రష్యా చేస్తోన్న యుద్ధంపై ప్రపంచానికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఓ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. మా దాడి ఉక్రెయిన్ సైన్యంపై మాత్రమేనని.. ప్రజలు, జనావాసాలపై కాదని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు పుతిన్. ఎప్పుడైన రెండు దేశాల మధ్య యుద్ధం జరిగితే అందులో సైనికులతో పాటు అమాయక పౌరులు కూడా ప్రాణాలు కోల్పోవడం ఎన్నోసార్లు చూశాం. అలాంటి రక్తపాతాన్ని ఐక్యారాజ్యసమితి సహా ప్రపంచ దేశాలు తీవ్రంగా ఖండిస్తాయి. కనుక అలాంటిదేం జరగడం లేదని పుతిన్ చెప్పుకొస్తున్నారు.
అసలేం జరుగుతోంది?
అత్యంత కచ్చితత్వంతో లక్ష్యాలను ఛేదించే ఆయుధాలను వినియోగిస్తున్నట్లు రష్యా సైన్యం ప్రకటించింది. కానీ ఎంత కచ్చితత్వం ఉన్నప్పటికీ సాధారణ పౌరులు కూడా ప్రాణాలు కోల్పోయే అవకాశం ఇలాంటి యుద్ధాల్లో ఎక్కువగానే ఉంది. ఉక్రెయిన్‌ను అన్ని వైపుల నుంచి ముప్పేట దాడి చేస్తోంది రష్యా. సరిహద్దుల నుంచి షెల్లింగ్, ఆకాశ మార్గం నుంచి మిస్సైల్ దాడులు సహా వివిధ రకాల అధునాత యుద్ధ సామగ్రిని వాడుతోంది. ఇప్పటికే రష్యా సైన్యం దాడిలో ఎంతో మంది ఉక్రెయిన్ పౌరులు మరణించినట్లు వార్తలు వస్తున్నాయి.
రష్యా ఏకాకి
ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం మొదలు పెట్టినప్పటి నుంచి అమెరికా, ఫ్రాన్స్, యూకే, కెనడా సహా పలు ఐరోపా దేశాలు వెంటనే స్పందించాయి. రష్యా వెంటనే యుద్ధాన్ని ఆపాలని కోరాయి. ఉక్రెయిన్ సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తేల్చి చెప్పాయి. రష్యా మాత్రం తమ దాడి ఉక్రెయిన్ సైన్యంపైనేనని చెప్పుకొస్తుంది. అయినప్పటికీ ఈ యుద్ధంలో కోల్పోయే ప్రాణాలకు, రక్తపాతానికి రష్యాదే బాధ్యతని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తేల్చిచెప్పారు.
రష్యాకు వ్యతిరేకంగా మాట్లాడుతోన్న ఈ దేశాలన్నీ యుద్ధంలో పాల్గొన్నా లేకపోయినా.. ఆ తర్వాత మాత్రం రష్యాను దౌత్యపరంగా, ఐరాస వేదికలో, అంతర్జాతీయ సమాజం ముందు ఏకాకిని చేసేందుకు మాత్రం సిద్ధమవుతున్నాయి. ఐరాస ప్రధాన కార్యదర్శి కూడా.. పుతిన్ యుద్ధాన్ని ఆపాలని కోరారు.
యుద్ధంలో ఏమైనా కానీ.. పుతిన్ మాత్రం.. అంతర్జాతీయ సమాజం ముందు ఏకాకిగా నిలిచే అవకాశం ఉంది. అప్పుడు తమ వాదనను బలంగా వినిపించేందుకు తమ యుద్ధం పౌరులపై కాదు సైన్యంపై మాత్రమేనని పుతిన్ బలంగా చెబుతున్నారు.
Also Read: Ukraine Russia War: రష్యా - ఉక్రెయిన్ యుద్ధం ఆనందకరం, పాక్ ప్రధాని ఇమ్రాన్ వ్యాఖ్యలు: వీడియో