Russia Ukraine War: పుతిన్ అణు హెచ్చరికలు అంతా ట్రాష్, ప్రపంచం అందుకు అంగీకరించదు - జెలెన్‌స్కీ
Russia Ukraine War: రష్యా ప్రెసిడెంట్ పుతిన్ అణుహెచ్చరికలపై ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్‌స్కీ స్పందించారు.
Russia Ukraine War:
లొంగిపోయే ప్రసక్తే లేదు: జెలెన్‌స్కీ
రష్యా అధ్యక్షుడు పుతిన్ పదేపదే అణుయుద్ధ హెచ్చరికలు చేయటంపై అన్ని దేశాలూ అసహనం వ్యక్తం చేస్తున్నాయి. దీనిపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కూడా స్పందించారు. పుతిన్..అణుబాంబులతో యుద్ధానికి దిగుతారని తాను అనుకోవడం లేదని స్పష్టం చేశారు. ఇటీవలే పుతిన్...తమ దేశాన్ని రక్షించుకునేందుకు అణుయుద్ధానికైనా సిద్ధమేనంటూ సంచనల ప్రకటన చేశారు. ఈ ప్రకటనను ప్రస్తావిస్తూ...జెలెన్‌స్కీ ఇలా కామెంట్స్ చేశారు. జర్మనీకి చెందిన బిల్డ్ న్యూస్‌పేపర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ అభిప్రాయం వ్యక్తం చేశారు. "రష్యా అణుబాంబులు ప్రయోగించటాన్ని ఈ ప్రపంచం అనుమతిస్తుందని అనుకోవడం లేదు" అని అన్నారు. ఇలాంటి హెచ్చరికలు మానుకోవాలని పుతిన్‌ను వారించారు జెలెన్‌స్కీ. "పుతిన్ రోపోమాపో ఉక్రెయిన్‌తో పాటు పోలాండ్ కూడా కావాలని అడుగుతారేమో. లేకపోతే అణుబాంబులు ప్రయోగిస్తామని హెచ్చరిస్తుండొచ్చు. మేం ఇలాంటి వాటికి లొంగిపోయే ప్రసక్తే లేదు" అని చాలా కచ్చితంగా చెప్పారు. తన సైన్యం పట్ల నమ్మకం లేకపోవటం వల్లే...రిజర్వ్ ఫోర్స్‌లను పుతిన్ రంగంలోకి దింపుతున్నారని అన్నారు. "పుతిన్‌కు లక్షలాది మంది సైన్యం కావాలి. కానీ...మాపైకి దాడికి వచ్చిన రష్యా సైన్యం మా ఎదురుదాడిని తట్టుకోలేక వెనక్కి వెళ్లిపోతోంది" అని వెల్లడించారు జెలెన్‌స్కీ. ఉక్రెయిన్‌తో పాటు తన దేశ సైన్యాన్నీ పుతిన్ రక్తసిక్తం చేయాలనుకుంటున్నారని మండిపడ్డారు.
జో బైడెన్ అసహనం
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కూడా రష్యాపై విరుచుకుపడ్డారు. "నిబంధనలు ఉల్లంఘించి మరీ రష్యా యుద్ధానికి దిగటం సిగ్గుచేటు" అని తీవ్రంగా వ్యాఖ్యానించారు బైడెన్. ఇదే సమయంలో అణుయుద్ధాల గురించి ప్రస్తావించారు. ఈ యుద్ధాన్ని రష్యా గెలవలేదని, సైనిక చర్యని నియంత్రించేందుకు అమెరికా సిద్ధంగా ఉందని వెల్లడించారు. ఐరాస భద్రతా మండలి (UN Security Council)తో మాట్లాడిన సందర్భంలో మరి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు బైడెన్. "అణుయుద్ధాలు గెలవలేం. అసలు అలాంటి యుద్ధాలకు దిగటమే సరికాదు" అని అన్నారు. "బాధ్యతా రాహిత్యంగా అణుయుద్ధాల గురించి ప్రకటనలు చేస్తున్నారు" అంటూ రష్యాను విమర్శించారు. ఉక్రెయిన్‌లోని కొన్ని ప్రాంతాలను రష్యాలో కలుపుకునేందుకు "Sham referenda"ను ఈ వారం రోజుల్లో ప్రవేశపెట్టాలని చూస్తున్నారు పుతిన్. దీనిపైనే జో బైడెన్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఐరాస భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం ఉన్న రష్యా..నిబంధనలు ఉల్లంఘించి ఉక్రెయిన్ సార్వభౌమాత్వాన్ని చెరిపే సేందుకు చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. యూఎన్ చార్టర్‌లోని నిబంధనలనూ ఖాతరు చేయటం లేదని అన్నారు. అలాంటి పరిస్థితులే వస్తే అమెరికా సైనిక చర్యలకైనా దిగేందుకు సిద్ధంగా ఉంటుందని హెచ్చరించారు.
Also Read: Iran Hijab Row: ఇరాన్ హిజాబ్ ఆందోళనల్లో 31 మంది మృతి! విచారణపై ప్రెసిడెంట్ హామీ