Road Accidents In India: ఆ మూడు గంటల్లోనే ఎక్కువగా యాక్సిడెంట్‌లు, రోడ్డు ప్రమాదాల్లో ఇండియా టాప్
Road Accidents In India: రోడ్డు ప్రమాదాల్లో ప్రపంచంలోనే భారత్ టాప్‌లో ఉంది.
Road Accidents In India:
భారీ ప్రాణనష్టం..
దేశంలో రోడ్డు ప్రమాదాలు ఏటా పెరుగుతూనే ఉన్నాయి. ప్రాణనష్టమూ భారీగానే ఉంటోంది. బిహార్‌లోని సుల్తాన్ పూర్ గ్రామంలో ఆదివారం రాత్రి ఓ ట్రక్కు డ్రైవర్ బీభత్సం సృష్టించాడు. ఈ ఘోర ప్రమాదంలో 15 మంది మరణించారు. చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు.
బిహార్ రాజధాని పాట్నాకు 30 కిలోమీటర్ల దూరంలోని వైశాలి జిల్లాలో రాత్రి 9 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ సంఘటన జరిగిన సమయంలో ప్రజలు రోడ్డు పక్కన ఉన్న రావిచెట్టు ముందు స్థానిక దేవత 'భూమియా బాబా' పూజల కోసం గుమిగూడారు. ఆ టైంలో ట్రక్ వాళ్లపైకి దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో స్పాట్‌లోనే 9 మంది మరణించారు. ఇదీ ఈ మధ్య జరిగిన దుర్ఘటన. ఇలాంటివి నిత్యం ఎక్కడో అక్కడ వెలుగు చూస్తూనే ఉన్నాయి. రోడ్డు ప్రమాదాల్లో ప్రపంచంలోనే టాప్‌లో ఉంది భారత్. ఇండియాలో ఎందుకు ప్రమాదాలు అరికట్టలేక పోతున్నారు..? ఈ స్థాయిలో ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి..? ఈ ప్రశ్నలు ప్రశ్నలుగానే మిగిలిపోతున్నాయి. అప్పుడప్పుడు కొన్ని నివేదికలు హెచ్చరికలు చేస్తున్నప్పటికీ...ప్రస్తుతానికి తీసుకుంటున్న చర్యలు ఏ మాత్రమూ చాలడం లేదు.
ఏటా ఎన్ని..?
భారత్‌లో ఏటా జరిగే రోడ్డు ప్రమాదాల సంఖ్య అక్షరాలా 5 లక్షలు. ఇది అధికారికంగా ప్రభుత్వాలు చెబుతున్న మాటే. ప్రపంచ దేశాలతో పోల్చుకుంటే...రోడ్డు ప్రమాదాలు 11% భారత్‌లోనే జరుగుతున్నాయి. పైగా...ఈ విషయంలో భారత్ అన్ని దేశాల కన్నా ముందంజలో ఉంది.
అంకెల పరంగా చూస్తే...2017లో భారత్‌లో 4,64,910 రోడ్డు ప్రమాదాలు సంభవించాయి. 2018లో 4,67,044,2019లో 4,49,002,2020లో 3,66,138 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. అత్యధికంగా మధ్యప్రదేశ్, కర్ణాటక, యూపీలో జరుగుతున్నాయి. 70% రోడ్డు ప్రమాదాలకు కారణం అతివేగమే.
ఎంత మంది చనిపోయారు..?
ఏటా 5 లక్షల ప్రమాదాలు జరుగుతుండగా...కనీస లక్షన్నర మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. 3 లక్షల మంది తీవ్రంగా గాయ పడుతున్నారు. Ministry of Road Transport and Highways ఇచ్చిన లెక్కల ప్రకారం..2020లో 1,31,714 మంది మృతి చెందగా..2019లో 1,51,113మంది, 2018లో 1,51,417, 2017లో 1,47,913మంది ప్రాణాలు కోల్పోయారు. అత్యధికంగా...యూపీలోనే ఎక్కువ మంది రోడ్డు ప్రమాదాలకు బలి అవుతున్నారు. ఆ తరవాత మహారాష్ట్ర, తమిళనాడు, మధ్యప్రదేశ్, కర్ణాటక ఉన్నాయి.
ఏ టైమ్‌లో ఎక్కువ..?
సాధారణంగా రోడ్డు ప్రమాదాలు అనగానే రాత్రి పూటే ఎక్కువ అవుతాయని అనుకుంటాం. కానీ...నివేదికల ఆధారంగా చూస్తే..పగటి పూటే ఎక్కువగా ప్రమాదాలు సంభవిస్తున్నాయి. దేశంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో 60% మేర ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల లోపే ఎక్కువగా నమోదవుతున్నాయి. రాత్రి 12 గంటల నుంచి తెల్లవారి 6 గంటల వరకూ 10% ప్రమాదాలు జరుగుతున్నాయి. సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకూ ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయని కొన్ని నివేదికలు తేల్చి చెబుతున్నాయి.