Vice Presidential Election: తెలుగు పార్టీలన్నీ సుదర్శన్ రెడ్డికే మద్దతివ్వాలన్న రేవంత్ - అలాంటి డిమాండే తమిళనాడులో వస్తే ?
CM Revanth: ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో తెలుగు అభ్యర్థికి మద్దతివ్వాలని పార్టీలను రేవంత్ కోరారు. కానీ ఇదే సెంటిమెంట్ తెలంగాణ పార్టీలు పాటిస్తే.. రావాల్సిన ఓట్లు కూడా రాకుండా పోయే అవకాశం ఉంది.

Vice Presidential Election Revanth urges: ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఇండీ కూటమి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డిని బలపరచాలని తెలుగు రాజకీయ పార్టీలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా తెలుగు వ్యక్తికి అవకాశం కల్పించడం గర్వకారణమని.. సుప్రీంకోర్టు జడ్జిగా పనిచేసిన జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి రాజ్యాంగాన్ని పరిరక్షకుడే కాకుండా.. రాజ్యాంగ నిపుణుడు అని రేవంత్ రెడ్డి తెలిపారు.
తెలుగు సెంటిమెంట్‌తో రేవంత్ ప్రయత్నాలు
తెలుగు సెంటిమెంట్ తో రేవంత్ ప్రయత్నాలుచేస్తున్నారు. చంద్రబాబు నాయుడు, కేసీఆర్, జగన్ మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్ లకు రేవంత్ రెడ్డి ప్రత్యేకమైన విజ్ఞప్తి చేశారు. తెలుగు వ్యక్తిని గెలిపించుకుని ఉపరాష్ట్రపతిని చేయాలన్నారు. పీవీ నరసింహారావు తర్వాత జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డికి ఇలాంటి అత్యున్నత గౌరవం దక్కిందని సీఎ చెప్పుకొన్నారు. రాజ్యాంగాన్ని మార్చేందుకు కుట్ర జరుగుతోందని ఓట్లను చోరీ చేసి.. దేశాన్ని పరిపాలించాలని చూస్తున్నారని ఆరోపించారు. రాజ్యాంగాన్ని రక్షించడం అనేది మనందరి బాధ్యత అని.. ఇప్పుడు రాజ్యాంగ సంస్థలను రక్షించుకోవడం అవసరమని తెలిపారు. రాజ్యాంగాన్ని రద్దు చేసేందుకు ప్రయత్నిస్తున్న వారిని ఓడించాలన్నారు. రైతు కుటుంబంలో పుట్టిన జస్టిస్ సుదర్శన్ రెడ్డిని గెలిపించాలని కోరారు. సుదర్శన్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేదన్నారు. ఆయన బీసీ రిజర్వేషన్ల కోసం గట్టిగా కృషి చేసిన వ్యక్తి అని చెప్పుకొచ్చారు.
మరి తమిళం వాళ్లకు తమిళ్ సెంటిమెంట్ ఉండదా ?
రేవంత్ తెలుగు సెంటిమెంట్ ను గట్టిగానే వినిపించారు. మరి ఇదే సెంటిమెంట్ తమిళనాడులో అక్కడి పార్టీలు కూడా పాటిస్తే.. మొదటికే మోసం వస్తుందన్న సెటైర్లు వినిపిస్తున్నాయి. బీజేపీ అభ్యర్థికే మొత్తం తమిళనాడు రాజ్యసభ, లోక్ సభ ఎంపీలు మద్దతుగా నిలుస్తారు. అప్పుడు ఎవరికి నష్టం జరుగుతుందన్న ప్రశ్నలు వస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కన్నా.. తమిళనాడులోనే భాషాభిమానం, ప్రాంతీయాభిమానం ఎక్కువగా ఉంటుంది. తెలంగాణ సీఎం ఉపరాష్ట్రపతి విషయంలో ఇలా తెలుగు సెంటిమెంట్ ను ప్రయోగించారన్న ప్రచారం జరిగితే.. అక్కడ తమిళ పార్టీలు.. ముఖ్యంగా బీజేపీ కూటమి పార్టీలు అదే ప్రచారం చేస్తాయి.
గతంలో వెంకయ్యనాయుడిపై పోటీ పెట్టిన కాంగ్రెస్
రేవంత్ రెడ్డి తెలుగు సెంటిమెంట్ గురించి చెబుతున్నారు కానీ..కాంగ్రెస్ పార్టీ గతంలో వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతి పదవికి పోటీ పడినప్పుడు పోటీ పెట్టింది. కాంగ్రెస్ పార్టీ తరపున గోపాలకృష్ణ గాంధీ అభ్యర్థిగా నిలిచారు. 2017 ఆగస్టు 5న జరిగిన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో, వెంకయ్య నాయుడు (ఎన్డీఏ అభ్యర్థి) గోపాలకృష్ణ గాంధీ (యూపీఏ మరియు ఇతర ప్రతిపక్ష పార్టీల అభ్యర్థి) మధ్య పోటీ జరిగింది. వెంకయ్య నాయుడు 516 ఓట్లతో విజయం సాధించగా, గోపాలకృష్ణ గాంధీకి 244 ఓట్లు వచ్చాయి. మొత్తం 771 ఓట్లలో వెంకయ్య నాయుడు స్పష్టమైన మెజారిటీతో గెలిచారు. అప్పట్లో మా తెలుగు వ్యక్తి అని ఏ కాంగ్రెస్ ఎంపీ కూడా.. వెంకయ్యనాయుడుకు ఓటు వేయలేదు.





















