Chandrababu Yagam: చంద్రబాబు నివాసంలో ముగిసిన రాజశ్యామల యాగం, విజయం తథ్యమన్న పండితులు
Chandrababu Raja Symala Yaagam: చంద్రబాబు నివాసంలో మూడురోజులుగా సాగుతున్న రాజశ్యామల యాగం పూర్ణాహుతి కార్యక్రమంతో ముగిసింది. విజయలక్ష్మీ వరించేందుకే యాగం నిర్వహించారు.
Chandrababu NEWS: తెలుగుదేశం అధినేత చంద్రబాబు నివాసంలో మూడురోజులుగా సాగుతున్న రాజశ్యామల(Raja Symala Yagam) యాగం దిగ్విజయంగా ముగిసింది. శుక్రవారం నుంచి నిర్విరామంగా యాగం జరుగుతోంది. గుంటూరుకు చెందిన వేదపండితులు శ్రీనివాసాచార్యుల ఆధ్వర్యంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 50 మంది రుత్వికుల సమక్షంలో యాగం నిర్వహించారు. చంద్రబాబు దంపతులతో వివిధ పూజా క్రతువులు నిర్వహించారు. మూడోరోజు పూర్ణాహుతి కార్యక్రంతో యాగం పరిసమాప్తమైంది. ఈయాగంలో తెలుగుదేశం(TDP) నేతలతోపాటు చంద్రబాబు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
ప్రజల క్షేమం కోసమే
చంద్రబాబు(Chandrababu) నివాసంలో మూడురోజులపాటు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించిన రాజశ్యామల యాగం ముగిసింది. శుక్రవారం తొలిరోజు చంద్రబాబు దంపతులు యాగక్రతవులో పాల్గొన్నారు. ప్రజలందరికీ మేలు జరగాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఈ సంద ర్భంగా చంద్రబాబు-భువనేశ్వరి హోమాలు నిర్వహించారు. రెండు, మూడురోజుల్లోనూ వివిధ క్రతువులు నిర్వహించారు, గతేడాది డిసెంబర్ లోనూ చంద్రబాబు నివాసంలో చండీయాగం, సుదర్శన నారిసింహా హోమం నిర్వహించారు. ప్రజాక్షేమం కోసమే యాగాలు నిర్వహిస్తున్నట్లు రాజకీయ నేతలు చెబుతున్నా పురాణాల ప్రకారం చూస్తే రాజ్యలక్ష్మీ వరించడంతోపాటు శత్రువులు క్షీణించి సార్వభౌమాధికారం శాశ్వతంగా ఉండేందుకు రాజులు ఇలాంటి యాగాలు నిర్వహించేవారు. శ్రీకృష్ణుడు కూడా ధర్మరాజుతో రాజసూయ యాగం చేయిస్తాడని పురాణా గాథలు చెబుతున్నాయి.అయితే రాజసూయ యాగం చేయడం చాలా పెద్ద క్రతువు కాబట్టి..దానికి ప్రతీగా రాజశ్యామల(Rajasyamala Yagam) యాగం నిర్వహిస్తున్నారు.
చంద్రబాబు నివాసంలో యాగ నిర్వహణలో దాదాపు 50 మంది రుత్వికులు పాల్గొన్నారు. రాజశ్యామల యాగంలో భాగంగా మూడు రోజుల పాటు పలు రకాల పూజలు, క్రతువులు నిర్వహించారు. ఈ రాజ శ్యామల యాగాన్ని విజయాన్ని అందుకోవాలని, శత్రువులు క్షీణించాలని, రాజ్యలక్ష్మి శాశ్వతంగా ఉండాలని నిర్వహిస్తారు. విజయం సిద్ధించేలా చేయమని శ్యామలాదేవిని అంటే అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికి యాగాన్ని నిర్వహించారు. ముఖ్యంగా ఎన్నికల ముందు ఈ యాగం నిర్వహించడం ప్రత్యర్థులను బలహీనపరిచేందుకేనని పండితులు తెలుపుతున్నారు. అత్యంత భక్తి శ్రద్ధలతో, నిష్ట నియమాలతో నిర్వహించిన ఈయాగం పూర్ణాహుతి కార్యక్రమంతో దిగ్విజయంగా ముగిసింది. చంద్రబాబు అనుకున్నది అనుకున్నట్లు సాధిస్తారని...విజయలక్ష్మీ ఆయన్ను వరించడం ఖాయమని అన్నారు. యాగ ప్రభావం కొన్ని నెలలపాటు ఆయనపై ఉంటుందని పండితులు వెల్లడించారు.
రాజకీయ యాగాలు
ఇలాంటి యాగాలు నిర్వహించడలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్(KCR) ముందుంటారు. కేసీఆర్ ఎన్నికలతో పాటు ఏ ముఖ్యమైన పని చేయాలనుకున్నా యాగం నిర్వహిస్తారు. గతంలో భారీగా యాగశాల నిర్మించి పెద్దఎత్తున రాజశ్యామల యాగం నిర్వహించారు. ఇటీవల ఎన్నికల ముందు కూడా ఆయన ఫాంహౌస్ లో శారదాపీఠాధిపతి స్వరూపానంద సమక్షంలో రాజశ్యామల యాగం నిర్వహించారు. కానీ ఆయన యాగం ఫలితాన్నివ్వలేదు.అసెంబ్లీ ఎన్నికల ముందు సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) సైతం కొడంగల్ లో రాజశ్యామల యాగం నిర్వహించారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఆయన విజయం సాధించడం విశేషం. ఇక ఏపీలో సీఎం జగన్(Jagan) సైతం హోమాలు నిర్వహించారు. 2019 ఎన్నికలకు ముందు జగన్ కోసం స్వరూపానంద దాదాపుగా ఏడాది పాటు ఓ ప్రదేశంలో యాగం చేశారు. జగన్ కూడా ఆ యాగానికి వెళ్లారు.