J&K Election: జమ్ముకశ్మీర్ ఎన్నికలకు సిద్ధమవుతున్న కాంగ్రెస్, బీజేపీకి పోటాపోటీగా రాహుల్ ప్రచారం
Rahul Gandhi: జమ్ముకశ్మీర్ ఎన్నికలకు కాంగ్రెస్ సిద్ధమవుతోంది. బీజేపీకి పోటాపోటీ రాహుల్ గాంధీ అక్కడ ఎన్నికల ప్రచారం మొదలు పెట్టనున్నారు.
J&K Election 2024: త్వరలోనే జమ్ముకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే అక్కడ ఎలక్షన్ హీట్ మొదలైంది. కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీలు కలిసి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలోనే రాహుల్ గాంధీ జమ్ముకశ్మీర్‌లో ఎన్నికల ప్రచారం చేసేందుకు అంతా సిద్ధం చేసుకుంటున్నారు. ఇవాళ్టి నుంచే (సెప్టెంబర్ 4) క్యాంపెయిన్ మొదలు పెట్టనున్నారు. రంబన్, అనంత్ నాగ్ జిల్లాల్లో భారీ ఎత్తున ర్యాలీలు చేయనున్నారు. సెప్టెంబర్ 18 వ తేదీన ఇక్కడ తొలి విడత ఎన్నికలు జరగనున్నాయి. జమ్ముకశ్మీర్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ తారిక్ హమీద్ కర్రా వెల్లడించిన వివరాల ప్రకారం రాహుల్ గాంధీ ఇక్కడి ఎన్నికల ప్రచారంపై ఎక్కువగా ఫోకస్ పెట్టారు. ఒకే రోజులో రెండు ర్యాలీల్లో పాల్గొంటారు. రాహుల్ రాకతో పార్టీకి కొత్త జోష్ వస్తుందని కార్యకర్తలు భావిస్తున్నారు. నిజానికి కాంగ్రెస్ పార్టీ పూర్తిగా రాహుల్ గాంధీపైనే ఆధారపడింది. జమ్ముపై బీజేపీ ప్రాబల్యం పెరగడం వల్ల కాంగ్రెస్‌కి అక్కడ ఇబ్బందులు తప్పేలా లేవు. అందుకే రాహుల్‌ని ప్రచార బరిలోకి దింపి ఓటర్లను ఆకట్టుకోవాలని చూస్తున్నారు.
ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో జమ్ములోని రెండు స్థానాల్లోనూ బీజేపీ విజయం సాధించింది. ఇది ఒకంత కాంగ్రెస్‌కి సవాల్‌గా మారింది. అందుకే రాహుల్ రంగంలోకి దిగుతున్నారు. రాహుల్‌తో పాటు ప్రియాంక గాంధీ కూడా ప్రచారంలో పాల్గొననున్నారు. మొత్తం 90 అసెంబ్లీ నియోజకవర్గాలున్న జమ్ముకశ్మీర్‌లో మొత్తం మూడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. మొదటి విడత సెప్టెంబర్ 18న, సెప్టెంబర్ 25న రెండో విడత, మూడో విడత అక్టోబర్ 1న జరగనున్నాయి. ఎన్నికల ముందే కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి కట్టాయి. ఆర్టికల్ 370 రద్దు తరవాత తొలిసారి జమ్ముకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండడం వల్ల ఆసక్తి అంతకంతకూ పెరుగుతోంది. నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ 51 సీట్లలో పోటీ చేస్తుండగా...కాంగ్రెస్ పార్టీ 32 స్థానాల్లో పోటీ చేయనుంది.