సావర్కర్‌ను అవమానిస్తారా, మళ్లీ అలాంటి వ్యాఖ్యలు చేస్తే ఊరుకోం - రాహుల్‌పై ఠాక్రే ఆగ్రహం
Not Savarkar Remark: సావర్కర్‌పై రాహుల్ చేసిన వ్యాఖ్యల్ని ఉద్ధవ్ ఠాక్రే తీవ్రంగా ఖండించారు.
Not Savarkar Remark:
ఠాక్రే ఫైర్..
అనర్హతా వేటు పడిన తరవాత రాహుల్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అందులో ఓ కామెంట్ మాత్రం సంచలనమైంది. యూకేలో రాహుల్ స్పీచ్‌పై బీజేపీ తీవ్రంగా మండిపడింది. దేశానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. ఇదే అంశంపై ప్రెస్‌మీట్‌లో మాట్లాడిన రాహుల్..."సారీ చెప్పడానికి నేనేమీ సావర్కర్‌ను కాదు. ఎప్పటికీ క్షమాపణలు చెప్పను" అని కామెంట్ చేశారు. దీనిపై ఉద్దవ్ ఠాక్రే తీవ్రంగా స్పందించారు. తాము దైవసమానంగా భావించే సావర్కర్‌ను అలా కించపరిచి మాట్లాడడం మానుకోవాలని రాహుల్‌కు వార్నింగ్ ఇచ్చారు. లేదంటే...మహారాష్ట్ర ప్రతిపక్ష కూటమిలో చీలికలు తప్పవని తేల్చి చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు అన్ని విపక్షాలు ఒక్కటవుతున్నాయని,అలా అని ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే మాత్రం సహించేది లేదని తీవ్రంగానే హెచ్చరించారు.
"మన దేశ ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుకునేందుకు మనమందరం ఒక్కటయ్యాం. ఇది మంచి విషయమే. కానీ కూటమిలో చీలికలు వచ్చే స్థాయిలో వ్యాఖ్యలు చేయడం మాత్రం సరి కాదు. కావాలనే బీజేపీ మిమ్మల్ని (రాహుల్‌ను) రెచ్చ గొడుతోంది. బీజేపీపై పోరాటం చేయడానికి ఇదే మంచి సమయం. ఇందులో మనం విఫలమైతే దేశం నియంతృత్వ పాలనలోకి వెళ్లిపోతుంది"
- ఉద్ధవ్ ఠాక్రే
మహారాష్ట్రలో 2019లో ఎన్‌సీపీ, శివసేన, కాంగ్రెస్ కూటమి ప్రభుత్వం ఏర్పాటైంది. అప్పటి నుంచి ఈ మూడు పార్టీలు కలిసే ఉంటున్నాయి. మధ్యలో రాజకీయ పరిణామాలన్నీ మారిపోయి...ఠాక్రే అధికారం కోల్పోయారు. ఆ తరవాత కూడా ఈ కూటమి కొనసాగుతూనే ఉంది. గతంలోనూ రాహుల్ సావర్కర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. బ్రిటీష్ వాళ్లకు ఆయన సారీ చెప్పారంటూ చేసిన కామెంట్స్‌పై ఠాక్రే మండి పడ్డారు. ఇప్పుడు మరోసారి ఇదే విషయంలో రెండు పార్టీల మధ్య విభేదాలు వచ్చాయి. దాదాపు 14 ఏళ్ల పాటు సావర్కర్ జైలు శిక్ష అనుభవించారని, దేశం కోసం ఎంతో త్యాగం చేశారని అంటోంది ఠాక్రే వర్గం. మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఊరుకోం అని తేల్చి చెబుతోంది.
వాయిస్ పెంచిన ప్రియాంక..
రాహుల్‌తో పాటు ప్రియాంక గాంధీ కూడా గట్టిగానే మాట్లాడుతున్నారు. ప్రధాని మోదీపై విమర్శలు గుప్పించారు. రాహుల్‌పై అనర్హతా వేయడంపై కాంగ్రెస్ చేపట్టిన సత్యాగ్రహ దీక్షలో పాల్గొన్న ఆమె బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు తన కుటుంబం ఎన్నో త్యాగాలు చేసిందని తేల్చి చెప్పారు. పదేపదే బీజేపీ కుటుంబ రాజకీయాలు అంటూ ఎగతాళి చేయడంపైనా మండి పడ్డారు. రాజ్య ప్రజల సంక్షేమం కోసం పోరాటం చేసిన శ్రీరాముడు, పాండవులకూ పరివార వాదం అంటకడతారా అంటూ ప్రశ్నించారు.
"మొత్తం ప్రభుత్వం అంతా కలిసి అదానీని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నాయి. పదేపదే ప్రధాని పరివారవాదం గురించి మాట్లాడుతూ ఎగతాళి చేస్తుంటారు. నా ప్రశ్న ఒక్కటే. శ్రీరాముడు ఎవరు..? ఆయన కూడా కుటుంబ వాదేనా..? తమ కుటుంబం కోసం పోరాటం చేసిన పాండవులనూ పరివార వాదులు అందామా..? దేశం కోసం పోరాటం చేసిన కుటుంబ సభ్యులను చూసి మేం సిగ్గు పడాలంటారా..? ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని గెలిపించేందుకు మా కుటుంబం అంతా రక్తం ధార పోసింది"
- ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ నేత
Also Read: Congress Protest: విపక్షాల వ్యూహంపై కాంగ్రెస్ కీలక భేటీ, ఆసక్తికరంగా మారిన తృణమూల్ ఎంట్రీ