ఉక్రెయిన్‌తో యుద్ధాన్ని ఆపేస్తే పుతిన్ హత్య ఖాయం, మస్క్ సంచలన వ్యాఖ్యలు
Elon Musk: ఉక్రెయిన్‌తో యుద్ధాన్ని ఆపేస్తే పుతిన్ హత్యకు గురవుతారంటూ ఎలన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Russia Ukriane War: టెస్లా అధినేత ఎలన్ మస్క్ రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్‌తో యుద్ధాన్ని ముగించలేని స్థితిలో పుతిన్ ఉన్నారని స్పష్టం చేశారు. ఉక్రెయిన్‌తో యుద్ధం ముగిస్తే పుతిన్ హత్యకు గురవుతారని మస్క్ చేసిన కామెంట్స్ దుమారం రేపుతున్నాయి. అమెరికా రిపబ్లికన్ సెనేటర్స్‌తో చర్చ జరిగిన సమయంలో ఎలన్ మస్క్ ఇలా మాట్లాడారు. ఉక్రెయిన్‌కి అమెరికా భారీ ఎత్తున సాయం అందించడాన్ని వ్యతిరేకించారు మస్క్. ఉక్రెయిన్‌పై జరుగుతున్న యుద్ధంలో పుతిన్ ఓడిపోయే అవకాశమే లేదని, అనవసరంగా అమెరికా ఉక్రెయిన్‌కి ఆ స్థాయిలో సాయం అందించడం వృథా అని తేల్చి చెప్పారు. ఉక్రెయిన్‌కి అమెరికా సాయం చేయడం వల్ల యుద్ధం పొడిగించినట్టే అవుతుందని స్పష్టం చేశారు. పుతిన్‌కి మద్దతునిస్తున్నారంటూ తనపై వచ్చిన ఆరోపణల్నీ కొట్టి పారేశారు మస్క్. మొదటి నుంచి తాను ఈ యుద్ధాన్ని వ్యతిరేకిస్తూనే ఉన్నానని స్పష్టం చేశారు.
"ప్రస్తుతం ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని ఆపలేని స్థితిలో పుతిన్ ఉండిపోయారు. ఆయన వెనకడుగు వేయలేకపోతున్నారు. అలా వెనక్కి తగ్గద్దని ఆయనపై తీవ్ర ఒత్తిడి పెరుగుతోంది. పొరపాటున యుద్ధం ఆపితే కచ్చితంగా ఆయన హత్యకు గురవుతారు"
- ఎలన్ మస్క్, టెస్లా అధినేత
గతేడాది సెప్టెంబర్‌లో ఉక్రెయిన్ ప్రభుత్వం ఎలన్ మస్క్‌కి ఓ రిక్వెస్ట్ పెట్టుకుంది. స్పేస్ ఎక్స్ తయారు చేసిన స్టార్ లింక్ శాటిలైట్‌ని యాక్టివేట్ చేయాలని విజ్ఞప్తి చేసింది. అయితే...దీని వల్ల యుద్ధం మరింత తీవ్రమవుతుందని మస్క్ తిరస్కరించారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మొదలైనప్పటి నుంచి ఉక్రెయిన్ సైన్యం Starlink శాటిలైట్‌పైనే ఆధార పడుతోంది. భద్రతా బలగాలు తమ కమాండర్స్‌తో సంప్రదింపులు జరిపేందుకు ఈ శాటిలైట్‌నే వినియోగించారు. అయితే...రష్యాలో అధికార మార్పిడిపైనా మస్క్ కీలక వ్యాఖ్యలు చేశారు. తరవాత వచ్చే అధ్యక్షుడు పుతిన్ కన్నా క్రూరంగా ప్రవర్తించే అవకాశముందని జోస్యం చెప్పారు.
టెస్లా అధినేత ఎలన్ మస్క్ (Elon Musk Drug Addiction) గురించి ఓ రిపోర్ట్ సంచలన విషయం బయట పెట్టింది. డిప్రెషన్‌ని పోగొట్టుకునేందుకు మస్క్ గతేడాది డ్రగ్స్ తీసుకున్నట్టు వెల్లడించింది. ఈ మధ్య కాలంలో టెస్లా, స్పేసెక్స్ బోర్డ్ సభ్యులు చాలా సందర్భాల్లో దీని గురించి ప్రస్తావించారు. పరిమితికి మించి డ్రగ్స్ తీసుకోడం వల్ల ఆయన ఆరోగ్యంపై ప్రభావం చూపించే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. అంతే కాదు. ఈ వ్యసనం వల్ల ఆయన వ్యాపార సామ్రాజ్యానికీ నష్టం తప్పదని తేల్చి చెప్పారు. ప్రాథమిక సమాచారం ప్రకారం...ఎలన్ మస్క్ LSDతో పాటు కొకైన్ కూడా తీసుకున్నాడు. ప్రైవేట్ పార్టీల్లో ఈ డ్రగ్స్ వినియోగించినట్టు తెలుస్తోంది. ఈ పార్టీలకు బడాషాట్స్‌ని పిలిచే వాడు మస్క్. అయితే..వాళ్లకో కండీషన్ పెట్టేవాడట. మొబైల్స్ లోపలికి తీసుకురాకూడదని ముందే తేల్చి చెప్పేవాడట. ఈ పార్టీల్లోనే డ్రగ్స్ మస్క్ డ్రగ్స్ తీసుకుంటాడని ఓ రిపోర్ట్ చెప్పింది. ఇక్కడే మరో వాదన కూడా ఉంది. డిప్రెషన్‌ని అధిగమించేందుకు మస్క్ డాక్టర్ల సిఫార్సుతోనే వీటిని తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.
Also Read: అయోధ్య రామ మందిరానికి అబుదాబిలోని ఆలయానికి ఓ పోలిక ఉంది, అదేంటంటే?