(Source: ECI/ABP News/ABP Majha)
Putin Praised Modi: మోదీ చేస్తున్నది కరెక్ట్, మేక్ ఇన్ ఇండియాపై పుతిన్ ప్రశంసలు
Putin Praised Modi: మోదీ చేస్తున్నది కరెక్ట్ అని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ మేక్ ఇన్ ఇండియా పాలసీని ఆయన ప్రశంసించారు.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత ప్రధాని నరేంద్ర మోదీ పాలసీలను ప్రశంసించారు. పీఎం మోదీ చేస్తన్నది కరెక్ట్ అని, మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాన్ని ప్రోత్సహించడం చాలా మంచి పాలసీ అని అన్నారు. మంగళవారం రష్యాలోని వ్లాదివోస్తోక్ పట్టణంలో ఈస్ట్రన్ ఎకనమిక్ ఫోరమ్ ఎనిమిదవ సమావేశంలో పుతిన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విలేకరులు రష్యాలో తయారయ్యే కార్ల గురించి ప్రశ్నించగా.. ఆయన మోదీ చేపడుతున్న మేక్ ఇన్ ఇండియా పాలసీని ఉదాహరణగా తీసుకొని మాట్లాడారు. దేశీయంగా తయారుచేసిన ఆటోమొబైల్స్ వాడడం చాలా అవసరమని అన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్ ఇప్పటికే ఈ విషయంలో ఉదాహరణగా నిలిచిందని పేర్కొన్నారు.
ఫోరమ్‌లో పుతిన్ ప్రసంగిస్తూ.. ' మీకు తెలుసా, ఇంతకుముందు దేశీయంగా తయారుచేసిన కార్లు లేవు. కానీ ఇప్పుడు ఉన్నాయి. ప్రముఖ బ్రాండ్లు మెర్సిడెజ్, ఆడి కార్ల కన్నా మోడ్రన్‌గా కనిపించే కార్లు ఇక్కడ ఉన్నాయి. అవి 1990 ల కాలంలో అధికంగా కొనేవాళ్లం. కానీ ఇప్పుడు సమస్య ఇది కాదు. మన భాగస్వాములలో చాలా మందిని అనుకరించాలని నేను భావిస్తున్నారు. ఉదాహరణకు భారతదేశం. వారు స్వదేశంలో తయారుచేసే వాహనాల వినియోగంపై దృష్టి పెట్టారు. ప్రధాని మోదీ చేసేది కరెక్ట్ అని నేను భావిస్తున్నాను. మేక్ ఇన్ ఇండియాను మంచిగా ప్రోత్సహిస్తున్నారు. ఆయన కరెక్ట్. మనం కూడా రష్యాలో తయారు చేసిన వాహనాలు ఉపయోగించడం మంచిది. మన దగ్గర కూడా ఆటోమొబైల్స్ ఉన్నాయి. మనం వాటిని వాడి తీరాలి. ఇది డబ్ల్యూటీఓ ఉల్లంఘనలకు దారి తీయదు. ఇది దేశ కొనుగోళ్లకు సంబంధించిన అంశం. దీనికి సంబంధించి వివిధ రకాల కార్లకు సంబంధించి విడదీసి, వివిధ స్థాయిల్లోని అధికారులు వాడేలా చేయాలి' అని అన్నారు.
రష్యాలో ఉత్పత్తి అయిన కార్లను కొనుగోలు చేయడం కొనసాగించాలని చేస్తున్న ప్రపోజల్స్ గురించి మీకు తెలిసే ఉంటుందని, లాజిస్టిక్స్ క్రమబద్ధీకరించినందున దీన్ని చేయడం చాలా సులభమని పుతిన్ మీడియాతో వెల్లడించారు. అలాగే భారత్-మిడిల్ ఈస్ట్ - యూరప్ కారిడార్‌పై పుతిన్ పాజిటివ్‌గా స్పందించారు. దాని వల్ల రష్యాకు వచ్చే నష్టమేమీ లేదని, ఇంకా లాభమే చేకూరుస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. కొత్త ఎకనామిక్ కారిడార్ ఏర్పాటుపై యూరోపియన్ యూనియన్, సౌదీ అరేబియా, భారత్‌లతో కలవడం పట్ల అమెరికాకు వచ్చేదేమీ లేదని, రష్యాకే ఉపయోగమని పేర్కొన్నారు.
ఇటీవల భారత్‌లో జరిగిన జీ20 సదస్సు సందర్భంగా భారత్, అమెరికా, యూఏఈ, సౌదీ అరేబియా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, యూరోపియన్ యూనియన్ కలిసి సెప్టెంబరు 9న ఇండియా-మిడిల్ ఈస్ట్-యూరప్ ఎకనమిక్ కారిడార్ ఏర్పాటుకు సంబంధించిన ఎంఓయూపై సంతకాలు చేశారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్ఠాత్మకంగా ఈ ప్రాజెక్టును ప్రకటించారు.
ఈ నేపథ్యంలో పుతిన్ పై విధంగా స్పందించారు. ఈ ప్రాజెక్టు తమకు ఉపయోజనం చేకూరుస్తుందని నమ్ముతున్నట్లు తెలిపారు. ఇది లాజిస్టిక్స్ అభివృద్ధికి సహకరిస్తుందని అన్నారు. అమెరికా చివరి నిమిషంలో ఇందులోకి వచ్చిందని, వారిది కేవలం బిజినెస్ ఇంట్రెస్ట్ మాత్రమే అని పెద్దగా ప్రయోజనం కనిపించడం లేదని అన్నారు.