Prajwal Revanna: బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌లో ప్రజ్వల్ రేవణ్ణ అరెస్ట్, అర్ధరాత్రి అదుపులోకి తీసుకున్న సిట్
Prajwal Revanna Case: లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రజ్వల్ రేవణ్ణని సిట్ పోలీసులు అరెస్ట్ చేశారు.
Prajwal Revanna Arrested: లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొన్న ప్రజ్వల్ రేవణ్ణని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆరోపణలు వచ్చిన తరవాత విదేశాలకు పరారైన ఆయన వరుస నోటీసులతో బెంగళూరుకు వచ్చారు. కెంపెగౌడ ఎయిర్‌పోర్ట్‌లోనే ఆయనను అదుపులోకి తీసుకున్నారు. కొంత మంది మహిళలు ప్రజ్వల్ రేవణ్ణ తమను లైంగికంగా వేధించాడని ఫిర్యాదు చేశారు. ఆయన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయాల్లో ఇది అలజడి సృష్టించింది. వందలాది మంది మహిళల్ని ఇలాగే లైంగికంగా వేధించినట్టు తేలింది. ఇప్పటికే మూడు కేసులు కూడా నమోదయ్యాయి. ఈ ఫిర్యాదులపై ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఈ కేసు విచారణకు ప్రత్యేకంగా సిట్‌ని నియమించింది. ఇప్పటికే ఇంటర్‌పోల్ బ్లూ కార్నర్ నోటీసులూ జారీ అయ్యాయి. ఆరోపణలు వచ్చిన వెంటనే జర్మనీకి పారిపోయారు ప్రజ్వల్. వరుస నోటీసులతో పాటు తాత హెచ్‌డీ దేవెగౌడ కూడా వార్నింగ్ ఇవ్వడం వల్ల ఆయన బెంగళూరుకి బయల్దేరారు. ఎయిర్‌పోర్ట్ వద్దే నిఘా పెట్టిన సిట్ పోలీసులు ఆయన వచ్చీ రాగానే అదుపులోకి తీసుకున్నారు.
Karnataka | Suspended JD(S) leader Prajwal Revanna, who is facing sexual abuse charges was arrested by SIT at Bengaluru's Kempegowda International Airport.
— ANI (@ANI) May 30, 2024
(Screengrabs from a viral video) pic.twitter.com/A8KcRjtoLu
అంతకు ముందు ప్రజ్వల్ రేవణ్ణ X వేదికగా ఓ వీడియో విడుదల చేశారు. తల్లిదండ్రులకు క్షమాపణలు చెప్పారు. తాను డిప్రెషన్‌లో ఉన్నానని పోలీసుల ఎదుట త్వరలోనే లొంగిపోతానని వెల్లడించారు. విచారణకు పూర్తి స్థాయిలో సహకరిస్తానని తెలిపారు.
"అమ్మ నాన్నకి మనస్పూర్తిగా క్షమాపణలు చెబుతున్నాను. నాపై వచ్చిన ఆరోపణలతో నేను తీవ్ర ఒత్తిడికి లోనయ్యాను. మే 31వ తేదీన నేను పోలీసుల ఎదుట హాజరవుతాను. విచారణకు పూర్తి స్థాయిలో సహకరిస్తాను. ఆ దేవుడి ఆశీర్వాదాలు నాకున్నాయి"
- ప్రజ్వల్ రేవణ్ణ
ఇక ప్రజ్వల్ రేవణ్ణ తరపున అడ్వకేట్ అరుణ్ వాదిస్తున్నారు. విచారణకు సహకరించేందుకు ఆయన పోలీసుల ముందుకు వచ్చారని స్పష్టం చేశారు.
ఏప్రిల్ 27వ తేదీన ప్రజ్వల్ రేవణ్ణపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. అదే రోజున ప్రజ్వల్ ఓ ట్వీట్ పెట్టారు. నిజమే తప్పకుండా గెలిచి తీరుతుందని తేల్చి చెప్పారు. ఆ తరవాత రాష్ట్ర మహిళా కమిషన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వీడియోలు బయటకు వచ్చిన వారం రోజులకు ప్రజ్వల్ రేవణ్ణ భారత్ నుంచి పారిపోయారు. అప్పటి నుంచి రాజకీయంగా దుమారం రేగింది. తప్పు చేయనప్పుడు పారిపోవాల్సిన అవసరమేంటని ప్రతిపక్షాలు ప్రశ్నించాయి. ఆ తరవాత పని మనిషి కిడ్నాప్ కేసులో ప్రజ్వల్ రేవణ్ణ తండ్రి హెచ్‌డీ రేవణ్ణ కూడా అరెస్ట్ అయ్యారు. ఆ తరవాత బెయిల్‌పై విడుదలయ్యారు. ముఖ్యమంత్రి సిద్దరామయ్య ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ప్రజ్వల్ రేవణ్ణ డిప్లొమాటిక్ పాస్‌పోర్ట్ రద్దు చేయాలని కోరారు. ఆ తరవాత సిట్ కూడా విదేశాంగ శాఖకు ఇదే రిక్వెస్ట్ పెట్టింది.