Polavaram Project: పోలవరం ప్రాజెక్టు - డిజైన్ల బాధ్యత కేంద్రానిది, నిర్మాణ పనుల బాధ్యత ఏపీ సర్కారుది!
Polavaram Project: జాతీయ ప్రాజెక్టు పోలవరం డిజైన్ల బాధ్యత కేంద్ర జల సంఘానిది అని, అలాగే నిర్మాణ బాధ్యత ఏపీ సర్కారుది అని కేంద్ర జల్ శక్తి శాఖ స్పష్టం చేసింది.
Polavaram Project: జాతీయ ప్రాజెక్టు పోలవరం నిర్మాణ విషయంలో ఎవరి బాధ్యతలు ఏంటన్న దానిపై కేంద్ర జల్ శక్తి శాఖ స్పందించింది. ప్రాజెక్టు డిజైన్ల బాధ్యత పూర్తిగా కేంద్ర జల సంఘానిది అని వెల్లడించింది. అలాగే ఆ డిజైన్లకు అనుగుణంగా పక్కాగా నిర్మాణలు చేపట్టాల్సిన బాధ్యత ఏపీ సర్కారుది అని స్పష్టం చేసింది. ఒకవేళ ఏమైనా సందేహాలు, భిన్నాభిప్రాయలు ఉంటే ముందే వాటిని పరిష్కరించుకోవాలని... ఆ తర్వాత నిర్మాణ పనులు చేపట్టాలని పేర్కొంది. పోలవరంలో గైడ్ బండ్ ధ్వంసం అయిన విషయం అందిరీక తెలిసిందే. అయితే దానికి బాధ్యులు ఎవరనేది తేల్చే పని ఇంకా పూర్తి కాలేదు. నిజనిర్ధారణ కమిటీ ఇప్పటికే నివేదిక సమర్పించలేదు. ఈ విషయంలో కాంట్రాక్టు సంస్థలు, జనవరుల శాఖ ఒకరినొకరు నిందించుకుంటున్నాయి. ఈక్రమంలోనే సోమవారం ఢిల్లీలో కేంద్ర శృజల్ శక్తి శాఖ ఓ సమావేశం నిర్వహించి స్పష్టత ఇచ్చింది.
కేంద్ర జల్ శక్తి శాఖ ప్రత్యేక కార్యదర్శి అధ్యక్షతన సమావేశం
పోలవరంలో కొత్త డయాఫ్రం వాల్ పూర్తి స్థాయిలో మళ్లీ నిర్మించాలా లేక పాక్షికంగా నిర్మించి పాత డయాఫ్రం వాల్ కు దాన్ని జత చేయాలా అన్న అంశంపై వచ్చిన ప్రతిపాదనలు చర్చించి నిర్ణయం తీసుకోవాలని సమావేశం నిర్వహించారు. కేంద్ర జల్ శక్తి శాఖ ప్రత్యేక కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. కేంద్ర జలసంఘం ఛైర్మన్ కె.వోహ్రా, కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి ప్రధాన సలహాదారు వెదిరె శ్రీరాం ఈ భేటీ నిర్వహణలో కీలకపాత్ర పోషించారు. అందరినీ సమనవ్వయ పరుస్తూ.. దేబశ్రీ ముఖర్జీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జలవనరుల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ సి.నారాయణ రెడ్డి, పోలవరం చీఫ్ ఇంజినీర్ సుధాకర్ బాబు, ఆకృతుల విభాగం చీఫ్ ఇంజినీర్ శ్రీనివాస్ యాదవ్ లు పాల్గొన్నారు అలాగే పోలవరం ప్రాజెక్టు అథారిటీ సీఈఓ శివనందన్ కుమార్, సభ్య కార్యదర్శి ఎం రఘురామ్ తదితరులు హాజరయ్యారు.
ఏపీ జలవనరుల శాఖ ఏం చేయాలంటే?
ఈక్రమంలోనే డయాఫ్రం వాల్ పై జాతీయ జల విద్యుత్తు పరిశోధన కేంద్రం సమర్పించిన నివేదిక ఆధారంగా డ్యాం డిజైన్ రివ్యూ ప్యానెల్ ఏయే ప్రతిపాదనలు చేసిందో వాటిని తీసుకోవాలని ఏపీ జలవనరుల శాఖకు సూచించారు. అలాగే ఈ ప్రతిపాదనలపై ఏపీ జలవనరుల శాఖ తన అభిప్రాయాలు, అభ్యంతరాలు తెలియజేయాలని సూచించారు. ఎక్కడెక్కడ ఏ ఇబ్బంది ఉందని భావిస్తున్నారో వివరించాలన్నారు. ఎలాంటి ప్రత్యామ్నాయం సూచిస్తున్నారో కూడా తెలియజేస్తూ వారం రోజుల్లోగా నివేదిక పంపాలన్నారు.
కేంద్ర జలసంఘం చేయాల్సిందిదే..!
అలాగే డయాఫ్రం వాల్ నిర్మాణం, ఎన్ హెచ్పీపీ నివేదిక తదితర అంశాలపై ఏపీ అభిప్రాయాలను కేంద్రం జలసంఘం నిశితంగా పరిశీలించాలని సూచించారు. ఆ అభిప్రాయాలపై వారి పరిశీలన, నిర్ణయాలను స్పష్టంగా లిఖిత పూర్వకంగా ఆ తర్వాత వారంలోపు సమర్పించాలని వెల్లడించారు. ఈ రెండింటినీ పరిగణలోకి తీసుకొని రెండు వారా తర్వాత కొత్త డయాఫ్రం వాల్ నిర్మించాలా లేదా పాక్షిక నిర్మాణం చేపట్టాలా అన్నది కేంద్రం చెబుతుందని అన్నారు.