PM Free Ration Scheme: ఈ పథకంతో కోట్లాది మందికి లబ్ధి.. దీపావళి వరకు ఉచిత రేషన్: మోదీ
ప్రధాన మంత్రి కల్యాణ్ యోజనా లబ్ధిదారులతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ లో సమావేశమయ్యారు. ఈ పథకంలో వీలైనంత ఎక్కువ మంది భాగం కావాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.
గుజరాత్ లోని ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ అన్నా యోజనా లబ్ధిదారులతో వీడియో కాన్ఫరెన్స్ లో భేటీ అయ్యారు ప్రధాని నరేంద్ర మోదీ. దేశ పౌరులు అందరికీ లబ్ధి చేకూరేలా ఈ పథకాన్ని రూపొందించినట్లు తెలిపారు. ఈ పథకంలో వీలైనంత ఎక్కువ మంది భాగం కావాలని మోదీ పిలుపునిచ్చారు.
ఎన్నో కోట్ల మంది ఈ పథకం ద్వారా లబ్ధి పొందొచ్చని మోదీ అన్నారు. ప్రతి భారతీయుడికి ఆహారం అందించడమే లక్ష్యమన్నారు. దీపావళి వరకు ఈ పథకం ద్వారా ప్రజలందరికీ ఉచితంగా రేషన్ అందించనున్నట్లు వెల్లడించారు.
ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో భారత్ చేపట్టే చర్యలను యావత్ ప్రపంచం స్వాగతిస్తుందని ప్రధాని అన్నారు. 'ఒన్ నేషన్, ఒన్ రేషన్ కార్డ్' ఆలోచనను ఆయన ప్రశంసించారు. ఈ పథకాన్ని వీలైనంతగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు.
ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన అనేది ఆహార భద్రతకు సంబంధించిన పథకం. గత ఏడాది కరోనా సమయంలో పేదలకు ఉచిత రేషన్ అందిచేందుకు ఈ పథకాన్ని ప్రారంభించారు. ప్రజాపంపిణీ డిపార్ట్ మెంట్ ఈ పథకాన్ని నడిపిస్తోంది. ఈ పథకం ద్వారా ఒక్కో లబ్ధిదారునికి 5 కేజీల చొప్పున ఆహార ధాన్యాలు అందిస్తోంది కేంద్ర ప్రభుత్వం.