Modi Vs Modi : ప్రధాని సోదరుడి ఆవేశం వ్యాపార వర్గాల ఆగ్రహమా..? మోడీ సర్కార్ అభిప్రాయమేంటి..?
వ్యాపారుల సమస్యలు పరిష్కారమయ్యే వరకూ జీఎస్టీ కట్టవద్దని ప్రధాని మోడీ సోదరుడు ప్రహ్లాద్ పిలుపునివ్వడం సంచలనంగా మారింది.
ప్రధానమంత్రి నరేంద్రమోడీ సోదరుడు ప్రహ్లాద్ మోడీ జీఎస్టీ కట్టవద్దని మహారాష్ట్ర వ్యాపారులకు పిలుపునివ్వడం దేశవ్యాప్త సంచలనం అయింది. ఓ వైపు ప్రధానమంత్రి నరేంద్రమోడీ .. జీఎస్టీని అద్భుతమైన పన్ను సంస్కరణగా ప్రచారం చేస్తున్నారు. జీఎస్టీ వల్ల వ్యాపారులకు ప్రయోజనమే కానీ.. నష్టమే లేదని భారత ప్రభుత్వం చెబుతూ వస్తోంది. ఇలాంటి సమయంలో.. వ్యాపారులందరికీ అసలు జీఎస్టీ కట్టవద్దని సలహా ఇవ్వడం.. అదీ ప్రధానమంత్రి సోదరుడు కావడమే ఈ చర్చ మొత్తానికి కారణం.
ప్రధానమంత్రి నరేంద్రమోడీ సోదరుడు ప్రహ్లాద్ మోడీ వ్యాపారుల సంఘాల్లో కీలకంగా పని చేస్తున్నారు. ఆయన వ్యాపారవేత్త. అయితే ఆయన వ్యాపారంలో సాధించిన విజయాలు ఎక్కువగా ప్రచారంలోకి రాలేదు కానీ.. వ్యాపార వేత్తల ాజకీయాల్లో మాత్రం ఆయన పేరు ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. దాదాపుగా ఆయన అన్ని రాష్ట్రాలు తిరుగుతూ ఉంటారు. ఎక్కడకు వెళ్లినా ఆయనకు వ్యాపార సంఘాల నేతగా కన్నా ప్రధానమంత్రి నరేంద్రమోడీ సోదరుడిగానే ఎక్కువగా మంది సంబోధిస్తూంటారు. ఆ కోణంలోనే తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
మహారాష్ట్రలో జరిగిన వ్యాపారేత్తల సదస్సుకు వ్యాపార సంఘాల నేతగా హాజరైన.. ప్రహ్లాద్ మోడీ.. జీఎస్టీ సమస్యలపై ఆవేశంగా ప్రసంగించారు. " మోడీ కావొచ్చు.. మరొకరు కావొచ్చు. వారు మన సమస్యలు వినాలి..మనమేమీ బానిసలం కాదు" అని తీవ్రస్థాయిలో మాట్లాడారు. మనం అంటే ఆయన ఉద్దేశంలో వ్యాపారులన్నమాట. "జీఎస్టీ చెల్లించబోం" అని మహారాష్ట్ర ప్రభుత్వానికి ముందుగా లేఖ రాయాలని ఆయన వ్యాపారులకు సూచించారు. వ్యాపారులను కేంద్ర రాష్ట్రాలు పట్టించుకోవడం లేదనేది ప్రహ్లాద్ మోడీ అభిప్రాయం. జీఎస్టీ చెల్లింపులు సక్రమంగా చేయాలని.. ప్రధాని మోడీ సహా.. యంత్రాంగం అంతా ప్రచారం చేస్తూ ఉంటుంది. తాము ఎంతో సరళమైన పన్ను విధానాన్ని ప్రవేశ పెట్టామని చెబుతూంటారు. కానీ స్వయంగా వ్యాపారవేత్త అయిన ప్రధాని మోడీ సోదరుడికి మాత్రం.. ఈ జీఎస్టీ లెక్కలు అర్థం కాలేదు. అవి భారంగా ఉన్నాయని భావిస్తున్నారు.
ప్రహ్లాద్ మోడీ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. జీఎస్టీ కట్టకపోతే.. అధికారులు ఊరుకోరు. వెంటనే కేసు బుక్ చేస్తారు. కావాలంటే సీబీఐని రంగంలోకి దింపుతారు. తర్వాత వ్యాపార సంస్థల్ని మూసివేయిస్తారు. అయితే జీఎస్ట ీఅనేది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనిది కాదు.. కేంద్ర ప్రభుత్వ పరిధిలోనిది. మహారాష్ట్ర వ్యాపారులతో ఆయన.. మహారాష్ట్ర సర్కార్‌కు జీఎస్టీ కట్టబోమని చెప్పాలని వ్యాఖ్యానించారు. అంటే... కేంద్రంపై వివాదం రాకుండా ఆయన చూసుకున్నారన్న అభిప్రాయం కూడా వినపిస్తోంది. ఏదయితేనేం.. జీఎస్టీ విషయంలో వ్యాపారవర్గాలకు తీవ్ర అభ్యంతరాలున్నాయి. ఆ విషయం స్వయంగా వారి ప్రతినిధిగా ప్రధాని సోదరుడే వెల్లడించారు.