Confidence Vote Result: బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ సేఫ్, మరో ఏడాది పాటు ఏ ఇబ్బందీ లేనట్టే
బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ తనపై పెట్టిన అవిశ్వాస తీర్మానంలో నెగ్గారు. మరో ఏడాది పాటు ఆయన పదవికి ఎలాంటి ఇబ్బంది ఉండదు
![Confidence Vote Result: బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ సేఫ్, మరో ఏడాది పాటు ఏ ఇబ్బందీ లేనట్టే PM Boris Johnson wins confidence vote final result 359 votes cast For 211 against 148 Confidence Vote Result: బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ సేఫ్, మరో ఏడాది పాటు ఏ ఇబ్బందీ లేనట్టే](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/07/74c050112eb112b0c89791357bdd89de_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
అవిశ్వాస తీర్మానంలో నెగ్గిన బోరిస్ జాన్సన్
బ్రిటన్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్‌కు కాస్త ఊరట దొరికింది. పార్టీ గేట్ వ్యవహారంలో తనపై పెట్టిన అవిశ్వాస తీర్మానంలో నెగ్గారు బోరిస్. కన్జర్వేటివ్ పార్టీకి చెందిన 211 మంది బోరిస్‌కు మద్దతుగా ఓటు వేశారు. ఆయనే ప్రధానిగా ఉండాలని వీరంతా కోరుకున్నారు. అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా 148 మంది సభ్యులు ఓటు వేశారు. పదవి చిక్కులో పడిందనుకుంటున్న తరుణంలో ఈ ఓటింగ్‌తో మళ్లీ పుంజుకున్నారు బోరిస్. ఈ సానుకూల పరిణామం దేశానికెంతో మేలు చేస్తుందని వ్యాఖ్యానించారు బోరిస్ జాన్సన్. ఇకపై ప్రజల అవసరాలేంటో తెలుసుకుని వాటిపైనే దృష్టి సారిస్తానని వెల్లడించారు.
సొంతపార్టీ సభ్యుల నుంచే ఆరోపణలు
కరోనా సమయంలో ప్రపంచమంతా ఎక్కడికక్కడే ఆగిపోయింది. లాక్‌డౌన్‌లు విధించి ప్రజలెవరూ బయటకు రాకుండా చాలా కఠినమైన ఆంక్షలు తీసుకొచ్చాయి ప్రభుత్వాలు. నెలల పాటు దశలవారీగా లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ వెళ్లాయి. ఆ సమయంలో పౌరులెవరూ బహిరంగ ప్రదేశాల్లో గుమిగూడకూడదని హెచ్చరికలు చేశారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవనీ చెప్పారు. బ్రిటన్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ కూడా కొవిడ్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న సమయంలో అలాంటి రూల్సే పెట్టాడు. ఇంత చేసి తానే ఈ రూల్స్ పాటించలేదా..? విపక్షాలు ఇదే మాట చెబుతున్నాయి. డౌనింగ్ స్ట్రీట్‌లో జోరుగా పార్టీలు జరిగాయని..వాటికి ప్రధాని బోరిస్ జాన్సన్ హాజరయ్యారని ఆరోపణలు చేయటం అప్పట్లో సంచలనమైంది. అప్పటి నుంచే బోరిస్ ప్రధాని పదవి చిక్కుల్లో పడింది. విపక్ష నేతలతో పాటు సొంత పార్టీ సభ్యులు కూడా ఆయనపై అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టారు.
మరో ఏడాది పాటు బోరిస్ సేఫ్
బోరిస్ జాన్సన్ ప్రధాని పదవికి అర్హుడు కాదని అవిశ్వాస తీర్మానాన్ని తెలుపుతూ 1922 కమిటీకి కన్జర్వేటివ్ ఎంపీలు రహస్య లేఖలు రాశారు. పార్లమెంట్‌లో ఎవరిపైన అయినా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని ఎంపీలు విజ్ఞప్తి చేస్తే అందుకు తగ్గట్టుగా ఆ కమిటీ ఓటింగ్ నిర్వహిస్తుంది. ఇప్పుడు కూడా అదే చేసింది. అయితే ఈ ఓటింగ్ ప్రక్రియ రహస్యంగా జరగ్గా..చివరకు జాన్సన్ నెగ్గారు. మూడు దశాబ్దాల్లో అవిశ్వాస తీర్మానంలో ఈ స్థాయి మద్దతు కూడగట్టుకుంది జాన్సనే. ఇందుకు కారణం..ఆయన కొద్ది రోజులుగా ప్రజా సేవా కార్యక్రమాల గురించి మాట్లాడుతుండటమే. పార్టీగేట్ వ్యవహారం నుంచి అందరి దృష్టి మరల్చేందుకు కొవిడ్ కట్టడికి ప్రభుత్వం తీసుకున్న చర్యలను ప్రస్తావిస్తూ వచ్చారు బోరిస్. అందుకే విశ్వాసం నెగ్గిన వెంటనే ప్రజా సంక్షేమ కార్యక్రమాలపై మరింత శ్రద్ధ పెట్టాల్సిన అవసరముందని వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ మరో కీలక విషయం ఏంటంటే...బోరిస్ పదవికి మరో ఏడాది పాటు ఎలాంటి ఇబ్బందులూ ఉండవు. ఎందుకంటే పార్లమెంట్‌లో ఎవరిపైనా అయినా అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెడితే మరోసారి అలాంటి తీర్మానం తీసుకురావాలంటో కచ్చితంగా ఏడాది ఆగాల్సిందే. ఈ విధంగా తన పదవిని కాపాడుకున్నారు బోరిస్.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)