Palnadu News: నరసారావుపేటలో వేర్వేరు చోట్ల రెండు మృతదేహాల కలకలం - హత్యచేసి పడేశారంటున్న పోలీసులు
Palnadu News: పల్నాడు జిల్లా కేంద్రంలో రెండు వేర్వేరు చోట్ల ఇద్దరి మృతదేహాలు లభ్యం అయ్యాయి. అయితే ఎవరో కావాలనే వారిని చంపేసి పడేసినట్లు పోలీసులు చెబుతున్నారు.
Palnadu News: పల్నాడు జిల్లా నరసారావుపేట పట్టణంలో వేర్వేరు చోట్ల రెండు మృతదేహాలు లభ్యం అయ్యాయి. మృతదేహాలను ముందుగా గుర్తించిన స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. నర్సారావుపేట గాంధీ పార్కు సమీపంలో గుర్తు తెలియంని వ్యక్తి మృత దేహం దొరకగా... స్టేషన్ రోడ్ లో వరంగల్ కు చెందిన మరో వ్యక్తి మృతదేహాం ఉన్నట్లు స్థానికులు గుర్తించారు. మృతి చెందిన ఇద్దరూ అనుమానాస్పద రీతిలో చనిపోయినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఇరువురి దేహాలపై తీవ్రమైన రక్త గాయాలు ఉన్నాయి. విచక్షణా రహితంగా తలపై బండ రాయితో దాడి చేసి చంపేసినట్లుగా ఆనవాళ్లు ఉన్నాయి. ఈ క్రమంలోనే పోలీసులు.. మృతదేహాలను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి విచారణ చేపట్టారు. స్టేషన్ రోడ్ లో మృతి చెందిన వ్యక్తి వరంగల్ జిల్లాకు చెందిన కరివిదుల సంపత్ రెడ్డిగా గుర్తించారు. గాంధీ పార్క్ వద్ద మృతి చెందిన వ్యక్తి వివరాలు సేకరిస్తున్నారు.
గతంలో గుంటూరులో కూడా ఇలాంటి ఘటనే..!
అయితే రెండు నెలల క్రితం కూడా ఇదే విధమైన దాడి గుంటూరు లో జరిగింది. అరండాలపేట లిక్కర్ మాల్ వద్ద, ఇన్నర్ రింగ్ రోడ్డులోని భైక్ షోరూం వద్ద నైట్ వాచ్ మెన్లపై దాడి చేశారు. ఆ దాడిలో ఇద్దరు వాచ్ మెన్లు మృతి చెందారు. అదే తరహాలో ఇక్కడ కూడా దాడి జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఆ దాడిని బేస్ చేసుకొని గంజాయి బ్యాచ్ లు ఈ విధంగా హత్య చేశరా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఏది ఏమైనా ఈ మధ్య ఆంధ్ర ప్రదేశ్ లో ఇలాంటి ఘటనలు తరచుగా వెలుగులోకి వస్తున్నాయి. మరి ఈ ఘటనతోనైనా పోలీసులు గట్టి చర్యలు తీసుకుంటారో లేదో చూడాలి.
గంజాయి మత్తులో బాలికను చంపిన వ్యక్తి
గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఓ బాలిక దారుణ హత్యకు గురి కావడం కలకలం రేపుతోంది. ఎన్టీఆర్ కట్ట ప్రాంతంలో బాలికను ఓ దుండగుడు హత్య చేశాడు. ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఈ ఘటన జరిగింది. హత్యకు గురైన బాలిక అంధురాలు. స్థానికంగా నివసించే ఓ యువకుడు ఓ కత్తితో బాలికపై విచక్షణా రహితంగా దాడి చేసి చంపాడు. తీవ్రంగా గాయపడ్డ ఆమెను విజయవాడలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించేలోపే ప్రాణాలు కోల్పోయింది. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. దాడి చేసిన వ్యక్తిని రాజు అని గుర్తించారు. గంజాయి మత్తులో అతడు ఈ దాడి చేసినట్లు సమాచారం. నిన్న (ఫిబ్రవరి 12) రాజు యువతితో అసభ్యంగా ప్రవర్తించాడని బాలిక తల్లి చెప్పింది. బాలిక ఈ విషయాన్ని తనకు చెప్పినట్లుగా ఆమె తెలిపింది. దీంతో తాము అతడిని మందలించామని చెప్పారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఇంట్లో ఎవరూ లేని సమయంలో బాలికపై దుండగుడు కత్తితో దాడి చేశాడు. దుండగుడు డీఎస్పీ ఎదుట లొంగిపోయినట్లు తెలుస్తోంది. సీఎం నివాసానికి సమీపంలోనే ఈ ఘటన చోటుచేసుకోవడం గమనించ దగ్గ విషయం.