Operation Amritpal Singh: మీడియా ఎదుట లొంగిపోనున్న అమృత్ పాల్? నిఘా వర్గాల సమాచారంతో పోలీసుల హై అలెర్ట్!
Operation Amritpal Singh: పరారీలో ఉన్న అమృత్ పాల్ సింగ్ లొంగిపోయే అవకాశాలున్నాయని నిఘా వర్గాలు చెబుతున్నాయి.
Operation Amritpal Singh:
నిఘా వర్గాల సమాచారం..
పరారీలో ఉన్న ఖలిస్థాన్ వేర్పాటువాది అమృత్ పాల్ సింగ్...త్వరలోనే లొంగిపోయే అవకాశాలున్నాయని నిఘా వర్గాలు చెబుతున్నాయి. పంజాబ్ పోలీసులతో పాటు, సెంట్రల్ సెక్యూరిటీ ఏజెన్సీలు ఇప్పటికే అప్రమత్తమయ్యాయి. అమృత్ సర్‌లోని గోల్డెన్ టెంపుల్ వద్ద అమృత్ పాల్ లొంగిపోయే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. ఈ ఆలయంలోని దర్బార్ సాహిబ్‌లోకి ప్రవేశించి...అకల్ తక్త్ సాహిబ్‌తో మాట్లాడి ఆ తరవాత మీడియా ముందుకొచ్చి లొంగిపోతాడని నిఘా వర్గాల సమాచారం. ఈ సమాచారం ఆధారంగా...గోల్డెన్ టెంపుల్ వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు. పంజాబ్ పోలీసులు ఇప్పటికే రాష్ట్రమంతా జల్లెడ పడుతున్నారు. హోషియార్‌పూర్‌లో తన అనుచరులతో కలిసి ఓ ఇంట్లో దాక్కున్నట్టు సమాచారం అందింది. ఈ మేరకు పోలీసులు ఆ గ్రామంలోని ప్రతి ఇంట్లోనూ గాలిస్తున్నారు. అంతకు ముందు మర్నియన్ గ్రామంలోనూ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఫగ్వారా వద్ద అమృత్ పాల్ కార్‌ను వెంబడించినప్పటికీ తప్పించుకుని పారిపోయినట్టు పోలీసులు వెల్లడించారు. ఈ క్రమంలోనే పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. మార్చి 18 నుంచి అరెస్ట్ ఆపరేషన్ మొదలు పెట్టారు పోలీసులు. ఇప్పటికే అమృత్ అనుచరులను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం వీరిని విచారిస్తున్నారు.
నేపాల్‌లోనూ గాలింపు..
నేపాల్ లోని పాక్ రాయబార కార్యాలయం సహాయంతో అమృత్ పాల్ నకిలీ పాస్ పోర్టు సహాయంతో తప్పించుకోవడానికి ప్రయత్నిస్తాడని భారత ఇంటెలిజెన్స్ విభాగానికి చెందిన ఏజెన్సీలు ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. భారత ప్రభుత్వం అధికారిక సమాచారం ఇచ్చిన తర్వాత, నేపాల్ మొత్తం హై అలర్ట్ ప్రకటించారు. అదే సమయంలో, అన్ని స్టేషన్ల దర్యాప్తు ప్రక్రియను కఠినతరం చేసింది. నేపాల్ ప్రభుత్వం అనుమానాస్పద వ్యక్తులపై నిఘా ఉంచింది. భారతదేశం నుంచి వచ్చే వ్యక్తుల గుర్తింపు కార్డులను తనిఖీ చేస్తోంది. అనుమానాల ఆధారంగా నేపాల్ పోలీసులు పలు చోట్ల నిరంతరం దాడులు నిర్వహిస్తున్నారు. నేపాల్ లోని రెండు అంతర్జాతీయ విమానాశ్రయాలు హై అలర్డ్ లో ఉన్నాయి. ఖాట్మండులోని అంతర్జాతీయ విమానాశ్రయం, భైరహవాలోని గౌతమ బుద్ధ అంతర్జాతీయ విమానాశ్రయంలో కూడా హై అలర్ట్ ప్రకటించారు. పరారీలో ఉన్న అమృత్ పాల్ ఫోటో నేపాల్ లోని అన్ని హోటళ్లు, గెస్ట్ హౌజ్ లు, లాడ్జీలలో ప్రచారం చేస్తున్నారు. చాలా కాలం దుబాయ్ లో ఉన్న అమృత్‌పాల్ కు అక్కడే పాకిస్థానీ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఐఎస్ఐతో పరిచయాలు ఏర్పడ్డట్లు అధికారులు గుర్తించారు. అతడిని పాక్ ఐఎస్ఐ పావుగా వాడుకుంటోందని, పంజాబ్‌లో కల్లోలం సృష్టించడానికి అమృత్‌పాల్ ను వాడుకున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. అమృత్‌పాల్ 2012లో ట్రక్ డ్రైవర్ గా పని చేసేందుకు దుబాయ్ కు వెళ్లాడు. అక్కడే ఖలిస్థానీ నాయకుడు లఖ్బీర్ సింగ్ రోడే సోదరుడు జశ్వంత్ తో, ఉగ్రవాది పరమ్‌జీత్ సింగ్ పమ్మాతో పరిచయం ఏర్పడింది. వారు అమృత్ పాల్ కు బ్రెయిన్ వాష్ చేశారు. ఆ తర్వాత అమృత్‌పాల్‌ను జార్జియా పంపించారు. అక్కడే అతడికి ఐఎస్ఐ ఆధ్వర్యంలో శిక్షణ ఇచ్చారని ఇంటెలిజెన్స్ అధికారులు అనుమానిస్తున్నారు.
Also Read: Wayanad By-Election: అంత తొందరెందుకు, ఇంకా చాలా టైమ్ ఉంది - వాయనాడ్ ఉప ఎన్నికపై సీఈసీ క్లారిటీ