NTR University Rename: ఎన్టీఆర్ వర్సిటీ పేరు మార్పుపై గవర్నర్ కు చంద్రబాబు ఫిర్యాదు!
NTR University Rename: ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పుపై టీడీపీ అధినేత చంద్రబాబు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు ఫిర్యాదు చేశారు. పార్టీ నేతలతో కలిసి రాజ్ భవన్ కు వెళ్లి మరీ ఫిర్యాదు అందజేశారు.
NTR University Rename: ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై టీడీపీ అధినేత చంద్రబాబు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు ఫిర్యాదు చేశారు. పార్టీ నేతలతో కలిసి రాజ్ భవన్ కు వెళ్లిన చంద్రబాబు.. ముందుగా గవర్నర్ ను కలిసి కాసేపు ముచ్చటించారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. ఫిర్యాదు అందేశారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును వైఎస్ఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయంగా మార్పు చేస్తూ... రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అందరికీ తెలిసిందే. పేరు మార్పుకు సంబంధించిన బిల్లును ఏపీ శాసన సభలో ప్రవేశ పెట్టి ఆమోదించారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు గవర్నర్ ను కలిసి ఫిర్యాదు చేశారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. "హెల్త్ యూనివర్సిటీకి మళ్లీ ఎన్టీఆర్ పేరు పెట్టే వరకు ఊరుకునేది లేదు. పేరు మార్చి జగన్ నీచ బుద్ధిని బయట పెట్టుకున్నారు. నేను తలుచుకుంటే కడపకు వైఎస్సార్ పేరు ఉండేదా.. పేర్లు మార్చడం నాకు చేతకాదా.. కడపలో స్టీల్ ప్లాంట్ పెట్టి.. వైఎస్సార్ పేరు పెట్టుకోవచ్చు.. ఓ ఇరిగేషన్ ప్రాజెక్టు కట్టి వైఎస్సార్ పేరు పెట్టుకో" అంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు.
ఉన్న పేరు తీసేసి తండ్రి పేరెలా పెట్టుకుంటారు..
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి వైఎస్ఆర్ పేరు పెట్టడంపై టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు స్పందించారు. దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 1986లో ఏర్పాటైన ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి వైఎస్ఆర్‌కు ఏం సంబంధమని నిలదీశారు. ఎన్టీఆర్ నిర్మించిన విశ్వవిద్యాలయానికి తండ్రి పేరు ఎలా పెట్టుకుంటాడని నిలదీశారు. హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు కొనసాగించాల్సిందే అని స్పష్టం చేశారు. ఉన్న సంస్థలకు పేర్లు మార్చితే పేరు రాదని, కొత్తగా నిర్మిస్తే పేరు వస్తుందని హితవు పలికారు. తెలుగు దేశం పార్టీ దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తుందని చంద్రబాబు అన్నారు.
ట్వీట్ల వర్షం కురింపించిన చంద్రబాబు..
‘‘హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు తొలగింపు జగన్ ప్రభుత్వ దివాళాకోరుతనానికి నిదర్శనం. తెలుగుదేశం పార్టీ దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తోంది. వైద్య విద్యకు ప్రత్యేక విశ్వవిద్యాలయం ఉండాలనే సంకల్పంతో నాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 1986లో ఈ హెల్త్ యూనివర్సిటీని ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీకి చెందిన రూ.450 కోట్ల నిధులను సైతం బలవంతంగా కాజేసిన జగన్ ప్రభుత్వం.. ఏ హక్కుతో వర్సిటీ పేరు మార్చుతుంది? కనీసం స్నాతకోత్సవం నిర్వహణకు కూడా నిధులు లేకుండా చేసిన వీళ్ళు ఇప్పుడు పేరు మార్చుతారా? అసలు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి వైఎస్ఆర్ కు ఏం సంబంధం ఉంది?
దశాబ్దాల నాటి సంస్థలకు ఉన్న పేర్లు మార్చి కొత్తగా మీ పేర్లు పెట్టుకుంటే మీకు పేరు రాదు సరికదా... ప్రజలు మీ దిగజారుడుతనాన్నిఛీ కొడతారు. చేతనైతే కొత్తగా సంస్థలను నిర్మించండి. ఇకనైనా ప్రభుత్వం పిచ్చి ఆలోచనలు మానుకుని హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరును యధావిధిగా కొనసాగించాలి.’’ అని చంద్రబాబు వరుస ట్వీట్లు చేశారు.
Also Read : Name Politics : ఊహించని వేగంతో ఎన్టీఆర్ పేరు తీసేసి వైఎస్ఆర్ పేరు పెట్టారెందుకు ? అసలు రాజకీయం వేరే !