Celebrities Moral policing: శివాజీనే కాదు ఎంతో మంది సెలబ్రిటీ మోరల్ పోలీసులు - మారాల్సింది ఎవరు?
Moral policing: శివాజీనే కాదు ఎంతో మంది సెలబ్రిటీ మోరల్ పోలీసులు చాలా మంది ఉన్నారు. వీరంతా మహిళలు మారాలని అంటున్నారు.కానీ మారాల్సింది ఎవరు అన్న ప్రశ్న ఎక్కువగా వినిపిస్తోంది.

Celebrities Moral policing who should change : కోర్ట్ సినిమా మంగపతి లాంటి పాత్రలో నటించిన నటుడు శివాజీ, ఇప్పటికీ ఆ క్యారెక్టర్ మైకంలోనే ఉండిపోయినట్లు కనిపిస్తోంది. ఆయన మహిళల అందం ఎక్కడ ఉంటుంది, వారు ఎలాంటి దుస్తులు వేసుకోవాలి అనే అంశాలపై చేసిన విశ్లేషణ తీవ్ర దుమారం రేపింది. చివరికి ఆయన తన అభిప్రాయం కరెక్టే కానీ వాడిన పదాలు మాత్రం కరెక్ట్ కాదని క్షమాపణలు చెప్పారు.అయితే కేవలం శివాజీ ఒక్కరే కాదు, నేటి సమాజంలో ఇలాంటి మోరల్ పోలీసింగ్ చేసే శివాజీలు చాలా మంది ఉన్నారు. ఏ తప్పు జరిగినా దానికి మహిళల డ్రెస్సింగే కారణమని డిక్లేర్ చేసే ఇలాంటి వ్యక్తులు, మారుతున్న కాలాన్ని గమనించలేకపోతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
హీరోయిన్ల దుస్తులే కారణమా?
లూలు మాల్‌లో నిధి అగర్వాల్, ఒక వస్త్ర దుకాణ ప్రారంభోత్సవంలో సమంత వంటి హీరోయిన్లకు ఎదురైన చేదు అనుభవాలను ప్రస్తావిస్తూ, వారి దుస్తులే అల్లరి మూకలను ప్రేరేపించాయని శివాజీ అభిప్రాయపడ్డారు. అయితే ఇక్కడ అసలు ప్రశ్న ఏమిటంటే.. ఒకవేళ ఆ తారలు శివాజీ కోరుకున్నట్లుగా నిండుగా చీర కప్పుకుని వచ్చినా, అదుపు తప్పిన అభిమానులు దూరంగా ఉండి నమస్కారం పెట్టి వెళ్తారా అంటే ఖచ్చితంగా లేదు. హీరోయిన్ ఏదైనా కమర్షియల్ ఈవెంట్‌కు వెళ్లినప్పుడు ఆకర్షణీయంగా కనిపించడం వృత్తిలో భాగం. అక్కడ జనం ఎగబడటానికి కారణం వారి వికృత చేష్టలే తప్ప, మహిళల వస్త్రధారణ కాదు అన్నది ఎక్కువ మంది సోషల్ మీడియాలో వినిపిస్తున్న అభిప్రాయం.
జీన్స్ ప్యాంట్ నుంచి ఆధునికత వరకు..!
ఒకప్పుడు అమ్మాయిలు జీన్స్ ప్యాంట్ వేసుకుంటేనే దారి తప్పారని ముద్ర వేసే సమాజం మనది. కానీ నేడు ప్రతి ఇంట్లోనూ జీన్స్ ఒక సాధారణ వస్త్రధారణగా మారిపోయింది. కేవలం కాలం మారింది, కాలంతో పాటు మనుషుల అభిప్రాయాలు మారాయి. నేటి యువత హైక్లాస్ మాల్స్‌కు వెళ్లినా, పద్ధతిగానే కనిపిస్తున్నారు. ఎవరైనా కాస్త ఆధునిక దుస్తుల్లో ఉన్నా, ఇతరులు వారిని వింతగా చూడటం లేదు. ప్రపంచం ఎంతో ముందుకు సాగిపోయింది, కానీ శివాజీల వంటి వ్యక్తుల ఆలోచనలు మాత్రం పాత కాలంలోనే ఆగిపోయాయన్న అసంతృప్తి మహిళా వాదుల్లో కనిపిస్తోంది.
అధికారం ఎవరిచ్చారు?
ఎలాంటి బట్టలు ధరించాలి, ఎలా కనిపించాలి అనేది పూర్తిగా ఒక వ్యక్తిగత ఇష్టం . నటి అనసూయ తరచుగా చెప్పినట్లుగా ‘వారి శరీరం వారి ఇష్టం’. దీని వల్ల విమర్శలు వచ్చినా, సమస్యలు ఎదురైనా అది వారి వ్యక్తిగత విషయం. కానీ సమాజానికి తాతలు, తండ్రుల లాగా హితబోధ చేస్తూ, అందరూ తాము చెప్పినట్లే ఉండాలని డిక్టేట్ చేసే అధికారం ఎవరికీ లేదు. శివాజీ తన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పినప్పటికీ, సమాజంలో ఇంకా మిగిలి ఉన్న ‘శివాజీ’ మనస్తత్వాలు కళ్లు తెరవాల్సిన అవసరం ఉందని ఎక్కువ మంది భావిస్తున్నారు.
తాము పాటించేదే పద్ధతి అని ఇతరులపై రుద్దాలని చూస్తే, వారు సమాజం దృష్టిలో నాయకులుగా కాదు, ప్రతినాయకులుగానే మిగిలిపోతారు. మహిళల భద్రతకు కావాల్సింది వారి దుస్తుల్లో మార్పు కాదు, పురుషుల ఆలోచనా విధానంలో మార్పు. దుస్తులను బట్టి క్యారెక్టర్‌ను జడ్జ్ చేసే సంస్కృతి నుంచి బయటకు వచ్చినప్పుడే నిజమైన సామాజిక వికాసం సాధ్యమవుతుందని అనుకోవచ్చు.





















