Nipah virus: కేరళలో మళ్లీ నిఫా పంజా.. వైరస్‌తో యువకుడి మృతి..151 మందికి ఐసోలేషన్:
Nipah virus: కేరళలో మళ్లీ నిఫా వైరస్ పంజా విసిరింది. మళప్పురం జిల్లాలో ఓ యువకుడ్ని బలితీసుకుంది. బాధిత యువకుడి వయస్సు 24 ఏళ్లు కాగా బెంగళూరులో చదువుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.
Kerala News: నిఫా వైరస్ కేరళలో మళ్లీ పంజా విసిరింది. ఓ యువకుడ్ని బలితీసుకుంది. బాధిత యువకుడి వయస్సు 24 ఏళ్లు కాగా బెంగళూరులో చదువుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు ప్రకటన చేసిన కేరళ వైద్య శాఖ మంత్రి వీణా జార్జ్.. మళప్పురం యువకుడి మృతికి నిఫా వైరస్సే కారణమని స్పష్టం చేశారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్న సదరు యువకుడు.. మళప్పురంలో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలాడు. ఆ యువకుడు ఎన్‌సెఫిలైటిస్‌తో బాధ పడుతూ ఆస్పత్రిలో చేరారన్న సమాచంతో వైద్యాధికారులు అక్కడకు వచ్చి నమూనాలు సేకరించారు. బాధిత యువకుడికి నిఫా లక్షణాలు ఉన్నట్లు గుర్తించి ఆ నమూనాలు ల్యాబ్‌కు పంపించగా.. నిఫా వైరస్‌తోనే సదరు యువకుడు మృత్యువాత పడినట్లు తేలింది. తదుపరి పూర్తి స్థాయి పరీక్షల కోసం పూణె ల్యాబ్‌కు శాంపిల్స్ పంపినట్లు ప్రభుత్వం తెలిపింది. యువకుడు సెప్టెంబర్ 4 నుంచి అనారోగ్యం పాలవగా ఐదు రోజుల తర్వాత చనిపోయినట్లు మళప్పురం టౌన్ వైద్యాధికారి రేణుక తెలిపారు.
Also Read: వన్ నేషన్- వన్ ఎలక్షన్ సహా జనగణనపై కీలక అప్‌డేట్ ఇచ్చిన కేంద్రం- కులగణన లేనట్టేనా!
ఐసోలేషన్‌లో 151 మంది.. ఐదుగురిలో నిఫా తరహా లక్షణాలు:
యువకుడు నిఫాతోనే చనిపోయాడని తేలిన వేళ.. కేరళ వైద్యశాఖ ఆదివారం రాత్రి అత్యవసర భేటీ ఏర్పాటు చేసింది. 16 కమిటీలను ఏర్పాటు చేసి వైరస్ కట్టడికి చర్యలకు ఉపక్రమించింది. ఈ యువకుడు ఆస్పత్రిలో చేరే ముందు తన స్నేహితులతో కలిసి వివిధ ప్రాంతాల్లో తిరిగినట్లు అధికారులు గుర్తించారు. మొత్తం 151 మందితో అతడు కాంటాక్ట్‌లో ఉన్నట్లు గుర్తించారు. యువకుడు దాదాపు 4 ఆస్పత్రులు తిరిగి వైద్యం చేయించుకున్నట్లు తేలింది. అక్కడ కూడా వైరస్ కట్టడి చర్యలు తీవ్రం చేశారు. యువకుడికి డైరెక్ట్ కాంటాక్ట్‌లో ఉన్న వారిలో ఎక్కువ మందిని గుర్తించి ఐసోలేషన్‌లో ఉంచగా.. ఐదుగురిలో కొద్ది పాటి నిఫా లక్షణాలు కనిపించడంతో వారి నమూనాలు కూడా సేకరించి టెస్టులకు పంపించారు. ప్రస్తుతానికి పరిస్థితి అదుపులోనే ఉందని.. ఎవరూ కంగారు పడాల్సిన పని లేదని మంత్రి తెలిపారు. కాంటాక్ట్‌లను గుర్తించి అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. గత జులైలో ఇదే మళప్పురం పరిధిలో 14 ఏళ్ల బాలుడు నిఫాతోనే మరణించగా.. యువకుడితో కలిపి ఈ ఏడాది ఇప్పటి వరకూ ఇద్దరు ఈ మహమ్మారికి బలయ్యారు. వ్యాక్సినేషన్‌లేని ఈ వైరస్ అత్యంత ప్రమాదకర వైరస్‌ల జాబితాలో చేర్చుతూ గతంలోనే ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటన కూడా చేసింది. కేరళలో ఇది వెలుగు చూసిన తర్వాత 2018లో డజను మందికి పైగా మృత్యువాత పడ్డారు.
2001 నుంచి 2024 వరకు దేశవ్యాప్తంగా ఇప్పటి వరకూ 100కి పైగా నిఫా కేసులు నమోదవగా.. అందులో 29 శాతం కేసులు కేరళలోనే నమోదయ్యాయి. ఈ మళప్పురం యువకుడితో కలిపి ఇప్పటి వరకు 22 మంది కేరళ వాసులను ఈ మహమ్మారి బలితీసుకుంది. మొదటి సారి ఈ మహమ్మారి కేరళలో వెలుగు చూసిన సమయంలో ఫాటలిటీ రేటు 89 శాతం ఉండగా 17 మంది వరకూ మృత్యువాత పడ్డారు. ఆ తర్వాత కట్టుదిట్టమైన చర్యలు, మెరుగైన ఆరోగ్య సదుపాయాల ద్వారా బాధితులను కాపాడుతూ వస్తుండగా ఈ ఏడాది ఇద్దరు మళ్లీ మృత్యువాత పడడం కలకలం రేపుతోంది.
Also Read: రాహుల్ గాంధీ నెంబర్ వన్ టెర్రరిస్ట్-సంచలన వ్యాఖ్యలు చేసిన కేంద్రమంత్రి, కాంగ్రెస్ సీరియస్