MMS Leak Row: చండీగఢ్ ఘటనపై జాతీయ మహిళా సంఘం ఆందోళన, కేసు నమోదు చేయాలని డిమాండ్
MMS Leak Row: చండీగఢ్ యూనివర్సిటీ ఘటనపై జాతీయ మహిళా సంఘం స్పందించింది.
MMS Leak Row:
FIR నమోదు చేయాలి..
నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ (NCW)చండీగఢ్ యూనివర్సిటీ ఘటనపై స్పందించింది. వెంటనే FIR నమోదు చేయాలని డిమాండ్ చేసింది. కొందరు విద్యార్థినులు ఆత్మహత్యకు యత్నించారన్న అంశాన్ని FIRలో చేర్చాలని చెప్పింది. మీడియా కథనాల ఆధారంగా ఈ వివరాలు తెలిశాయని, ఈ మేరకు కేసు నమోదు చేయాలని అడిగింది. NCW ఛైర్‌పర్సన్ రేఖాశర్మ డీజీపీకి ఇదే విషయమై లేఖరాశారు. నిందితులపై తక్షణమే FIR నమోదు చేయాలని అందులో పేర్కొన్నారు. ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకోవాలని కోరారు. బాధితులకు సరైన కౌన్సిలింగ్ ఇవ్వడమే కాకుండా వారి భద్రతకు హామీ ఇవ్వాలని అన్నారు. యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్‌కి కూడా లేఖ రాశారు. నిందితుల పట్ల కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పారదర్శకంగా విచారణ జరపాలని కోరారు. పంజాబ్ స్టేట్ కమిషన్ ఫర్ విమెన్‌తోనూ సంప్రదింపులు జరిపారు. పోలీసులు సరైన విధంగా విచారణ చేపడుతున్నారా లేదా అని దగ్గరుండి గమనించాలని చెప్పారు. అయితే...అటు పోలీసులు మాత్రం కేవలం ఓ అమ్మాయి వీడియో మాత్రమే అందుబాటులో ఉందని, మిగతా వీడియోలు లేవని వెల్లడించారు. ప్రస్తుత విచారణలో
ఇదే తేలిందని చెప్పారు. నిందితురాలు ఇంకెవరి వీడియో తీయలేదని, ఆమెకు సంబంధించిన ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్‌ను కస్టడీలోకి తీసుకున్నామని వివరించారు.
ఉన్నత స్థాయి విచారణకు ఆదేశాలు..
పంజాబ్ మొహాలీలోని చండీగఢ్ యూనివర్సిటీ ఘటన దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. క్యాంపస్‌లోని హాస్టల్‌లో విద్యార్థినుల అభ్యంత రకర వీడియోలు ఆన్‌లైన్‌లో లీక్ కావడం అలజడికి కారణమైంది. అయితే...ఇదంతా అవాస్తవమని యూనివర్సిటీ చెబుతోంది. విద్యార్థినులు మాత్రం దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో నిజానిజాలు తేల్చేందుకు...పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ రంగంలోకి దిగారు. వదంతులు వ్యాప్తి చేయొద్దని అందరికీ విజ్ఞప్తి చేశారు. ఈ ఘటనపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు. అంతకు ముందే ఆప్ సీనియర్ నేతలంతా స్పందించారు. ఈ ఘటనకు బాధ్యులెవరైనా వారిని కఠినంగా శిక్షిస్తామని స్పష్టం చేశారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ట్విటర్ వేదికగా స్పందించారు. "ఇది ఎంతో సిగ్గుచేటు. అమ్మాయిలందరూ మానసికంగా దృఢంగా ఉండాలి" అని ట్వీట్ చేశారు. నిందితులను కచ్చితంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు. బాధితులకు అండగా నిలబడతామని చెప్పారు. అందరూ సహనంగా ఉండాలని సూచించారు. అటు పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కూడా ట్వీట్ చేశారు. "దీనిపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించాను. బాధ్యులైన వారిని కఠినంగా శిక్షిస్తాం. అందరితోనూ నేనూ సంప్రదింపులు జరుపుతున్నాను. అప్పటి వరకూ రూమర్స్ వ్యాప్తి చేయకూడదని విజ్ఞప్తి చేస్తున్నాను" అని అన్నారు. ఇది చాలా సున్నతమైన అంశమని, వదంతులు వ్యాప్తి చేయొద్దని పంజాబ్ ఉన్నత విద్యాశాఖ మంత్రి గురుమీత్ సింగ్...ట్వీట్ చేశారు.
Also Read: Viral Video: ఏనుగును చూసి పిల్లిలా పారిపోయిన మృగరాజు..
Also Read: J&K: జమ్ముకశ్మీర్ భూభాగంలోకి డ్రోన్‌ను పంపిన పాక్? నిఘా పెంచిన భద్రతా దళాలు