Perni Nani: ఏపీలో మరో కొత్త జిల్లా ఏర్పాటు? పేర్ని నాని కీలక వ్యాఖ్యలు, ఈ ప్రాంతాలతోనేనట!
మంత్రి పేర్ని నాని కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో మరో కొత్త జిల్లా ఏర్పాటయ్యే అవకాశముందని ఆయన అనడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 13 జిల్లాల ఏర్పాటు ప్రక్రియ పూర్తయింది. దీంతో మొత్తం 26 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌గా ఏపీ అవతరించింది. ఈ నెల 4న కొత్తగా ఏర్పడిన 13 జిల్లాలను ముఖ్యమంత్రి జగన్ వర్చువల్‌గా ప్రారంభించారు. కొత్త జిల్లాల నుంచి పాలన మొదలైనప్పటికీ కూడా ఈ జిల్లాల ఏర్పాటు విషయంలో ఇంకా అసంతృప్తులు, అసహనాలు అంతే ఉన్నాయి. తమ ప్రాంతానికి అన్యాయం జరిగిందంటే తమకు జరిగిందని, తమకు ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేయాలని వివిధ ప్రాంతాల వారు పట్టుబడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మంత్రి పేర్ని నాని కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో మరో కొత్త జిల్లా ఏర్పాటయ్యే అవకాశముందని ఆయన అనడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఆ కొత్త జిల్లా కూడా గిరిజన ప్రాంతాలతోనే ఏర్పాటు అవుతుందని తెలిపారు. ఇప్పటికే పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాలు పూర్తిగా గిరిజన ప్రాంతాలతోనే ఉన్నాయి. తాజాగా గిరిజన ప్రాంతాలతోనే మరో జిల్లా ఏర్పాటుకానుందని తెలుస్తోంది. దీంతో 26 జిల్లాలకు అదనంగా మరో జిల్లా వచ్చే అవకాశం ఉందని పేర్ని నాని చెప్పారు. దీంతో మంత్రి వ్యాఖ్యలను బట్టి రంపచోడవరం, చింతూరు ఏజెన్సీ ప్రాంతాలతో జిల్లాను ఏర్పాటు చేస్తారనే ఊహాగానాలు మొదలయ్యాయి. ప్రస్తుతం ఈ ప్రాంతాలు పాడేరు పరిధిలో ఉన్నాయి. జిల్లా కేంద్రానికి దాదాపు 300 కిలోమీటర్ల దూరంలో ఉండటంతో రంపచోడవరం కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
సీఎంను తిట్టుకున్నా..
మరోవైపు, ఏపీ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై కూడా మంత్రి పేర్ని నాని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 11 నుంచి కొత్త మంత్రులు వస్తున్నారని తెలిపారు. బస్ అండ్ కార్ ఆపరేటర్స్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, ఏపీ, తెలంగాణ బస్ ఆపరేటర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం ఆయన పాల్గొని, విజయవాడలో ‘వన్ ఇండియా.. వన్ బస్’ వెబ్‌సైట్‌ను మంత్రి ప్రారంభించారు. రవాణాశాఖ మంత్రిగా ఎవరు వచ్చినా తన అభిప్రాయాలను వారితో పంచుకుంటానని అన్నారు. మూడేళ్లపాటు మీతో కలిసి పనిచేశానని, ఇకపైనా ఏవైనా సమస్యలు ఉంటే కొత్త మంత్రి వద్దకు, అవసరమైతే సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. ఈ అసోసియేషన్‌తో బహుశా ఇదే తన చివరి సమావేశం కావొచ్చని అన్నారు.
తనకు రవాణాశాఖ కేటాయించినప్పుడు దేవుణ్ని, సీఎం జగన్‌ను తిట్టుకున్నట్లు పేర్ని నాని చెప్పారు. రవాణాశాఖ ముఖ్యకార్యదర్శిగా కృష్ణబాబు, కమిషనర్‌గా సీతారామాంజనేయులు, ఆర్టీసీ ఎండీగా సురేంద్రబాబు ఉన్నారని, వీరు ముగ్గురు ఎవరి మాటా వినరని తెలిసి అలా తిట్టుకున్నానని అన్నారు. అయితే, వీరు ఎప్పుడూ తనతో ఇబ్బందికరంగా వ్యవహరించలేదని ఎంతో పాజిటివ్‌గా ఉండేవారని అన్నారు.
బస్సు, లారీ ఆపరేటర్ల కష్టాలు తనకు కూడా తెలుసని, తాను కూడా ఓ సిటీ బస్సును నిర్వహించినవాడినేనని అన్నారు. ‘వన్ ఇండియా వన్ ట్యాక్స్’ విధానం ద్వారా ముందుకు వెళ్దామని ముఖ్యమంత్రికి చెప్పానని, అయితే ఇంకా ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని మంత్రి పేర్కొన్నారు. అలాగే, తెలంగాణలో ఏపీ బస్సులపై కేసులు రాస్తే, తాము కూడా ఇక్కడ ఆ బస్సులకు కేసులు రాస్తామన్నారు.
జనసేన 175 స్థానాల్లో పోటీ చేయాలి
జనసేన పార్టీ గురించి మాట్లాడుతూ.. పవన్‌కు ఏటపాక, కుకునూరు ఏ జిల్లాల్లో ఉన్నాయో కూడా తెలీదా అని మంత్రి పేర్ని నాని ఎద్దేవా చేశారు. జిల్లాల నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు పవన్ ఎందుకు మాట్లాడలేదని విమర్శించారు. తన అభిప్రాయం ప్రభుత్వానికి ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. షూటింగ్ లో ఉండి పట్టించుకునే సమయం లేదేమో అని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో 175 నియోజకవర్గాల్లో (175 Constituencies) జనసేన పోటీ చెయ్యాలని ఆ పార్టీ కార్యకర్తలు కోరుకుంటుంటే టీడీపీ (TDP)తో పొత్తుపెట్టుకోడానికి పవన్ తాపత్రయపడుతున్నారని మంత్రి విమర్శించారు. సొంత పార్టీ కార్యకర్తల డిమాండ్లు నెరవేర్చాలని పవన్ కు హితవు పలికారు. కార్యకర్తల కోరిక మేరకు 175 సీట్లలో పోటీ చేయాలని పవన్ కు సూచించారు.