Meta Layoffs: మెటాలో మళ్లీ లేఆఫ్‌లు ఉంటాయా? వేలాది మందికి బ్యాడ్ రేటింగ్ - ఉద్యోగుల టెన్షన్
Meta Layoffs: మెటాలో మరోసారి లేఆఫ్‌లు మొదలవుతాయన్న వార్తలు వినిపిస్తున్నాయి.
Meta Layoffs:
7 వేల మందికి బ్యాడ్ రేటింగ్..
ఇటీవలే లేఆఫ్‌లు ప్రకటించింది మెటా. ఇప్పుడు మరోసారి కోతలు మొదలు పెడుతుందన్న వార్తలు వస్తున్నాయి. ఉద్యోగులందరి పర్‌ఫార్మెన్స్‌పై రివ్యూ చేసిన కంపెనీ...కొందరికి చాలా తక్కువ రేటింగ్ ఇచ్చినట్టు సమాచారం. వేలాది మంది ఉద్యోగులు ఇప్పుడు టెన్షన్ పడుతున్నారు. Below Average అంటూ 7 వేల మందికి రేటింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. వాల్‌స్ట్రీట్ జనరల్ వెల్లడించిన వివరాలివి.
ఇదే కాదు. రివ్యూ తరవాత బోనస్‌లు ఇవ్వడమూ ఆపేసింది. ఈ కారణంగానే...మళ్లీ భారీ లేఆఫ్‌లు ఉంటాయని అంచనా వేస్తున్నారు. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్‌లలో కలిపి వేలాది మందిని తొలగిస్తారని తెలుస్తోంది. బ్యాడ్ రేటింగ్ వచ్చిన ఉద్యోగులందరూ ఇప్పుడు కంటి మీద కునుకు లేకుండా ఉన్నారు. ఇప్పటికే మెటా సీఈవో మార్క్ జుకర్ బర్గ్ ఓ విషయం స్పష్టం చేశారు. 2023లో మెటాలో చాలా మార్పులు తీసుకొస్తామని చెప్పారు. లేఆఫ్‌లు కూడా ఇందులో భాగమే. ఇప్పటికే ఈ ప్రక్రియ మొదలైంది. 11 వేల మందిని తొలగించింది.
బడ్జెట్ లేదు..
Financial Times రిపోర్ట్ ప్రకారం ఫేస్‌బుక్ పేరెంట్ కంపెనీ మెటా పలు టీమ్‌లకు అవసరమైన బడ్జెట్‌ను రిలీజ్ చేయలేదు. అంటే...ఇన్‌డైరెక్ట్‌గా లేఆఫ్‌లు ప్రకటిస్తున్నట్టు సంకేతాలిచ్చింది. ఉద్యోగులను తొలగించిన తరవాతే బడ్డెట్‌లు విడుదల చేయాలని భావిస్తోంది యాజమాన్యం. ఇప్పటికే ఉద్యోగుల్లో లేఆఫ్‌ల భయం మొదలైంది. ఎప్పుడు ఎవరికి పింక్ స్లిప్ ఇస్తారో అని కంగారు పడిపోతున్నారు. గతేడాది నవంబర్‌లో ఒకేసారి 11 వేల మందిని తొలగిస్తున్నట్టు ప్రకటించడం సంచలనమైంది. ఆ కంపెనీలోని మొత్తం ఉద్యోగుల్లో ఇది 13%. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్‌లలో మొత్తంగా కలిపి 11 వేల మందిని ఇంటికి పంపింది మెటా. ఇటీవలే జుకర్ బర్గ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది తమకు ఎంతో కీలకమని చెప్పారు. మార్కెట్‌కు అనుగుణంగా నడుచుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయని అన్నారు. అప్పుడే మళ్లీ లేఆఫ్‌లు ఉంటాయా అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఇప్పుడు మరోసారి ఆ వార్తలు రావడం వల్ల దాదాపు ఖరారైనట్టే చెబుతున్నాయి కొన్ని రిపోర్ట్‌లు.
హై సెక్యూరిటీ..
జుకర్‌బర్గ్‌కు సెక్యూరిటీ అలవెన్స్‌లు పెంచుతూ నిర్ణయం తీసుకుంది కంపెనీ. ప్రస్తుతం ఆయనకు, ఆయన కుటుంబానికి కలిపి ఈ అలెవన్స్ 4 మిలియన్ డాలర్లుగా ఉండగా...ఇప్పుడు ఒకేసారి 14 మిలియన్ డాలర్లకు పెంచింది. "ప్రస్తుతం జుకర్‌బర్గ్ వ్యక్తిగత భద్రత కోసం వెచ్చిస్తున్న మొత్తాన్ని పెంచుతున్నాం. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది అవసరం అనిపిస్తోంది"అని తేల్చి చెప్పింది మెటా కంపెనీ. ఉన్నట్టుండి ఇంత భారీ స్థాయిలో ఆయనకు భద్రత ఎందుకు పెంచాల్సి వచ్చిందన్నదే ప్రధానంగా వినిపిస్తున్న ప్రశ్న. అయితే...ఈ మధ్య కాలంలో ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో వేలాది మంది ఉద్యోగులను తొలగించింది మెటా. "తప్పనిసరి పరిస్థితుల్లో తొలగించాల్సి వస్తోంది" అని జుకర్‌బర్గ్ ప్రకటించారు కూడా. కారణమేదైనా ఒకేసారి ఇంత మందిని తీసేయడం ఏంటి అంటూ జుకర్‌పై మండి పడుతున్నారు ఉద్యోగులు. విమర్శలు కూడా కాస్త గట్టిగానే వినిపిస్తున్నాయి. ఈ పరిణామాలతో జుకర్‌పై ఎవరైనా దాడి చేస్తారేమో అని ముందుగానే జాగ్రత్త పడింది మెటా యాజమాన్యం. ఆయనకు, ఆయన కుటుంబానికి భద్రత పెంచాలని నిర్ణయించుకుంది.
Also Read: Manish Sisodia: బడ్జెట్ తయారు చేయాలి, నాక్కొంచెం టైమ్ కావాలి ఇప్పుడు రాలేను - CBIతో సిసోడియా