Medchal News: బ్యూటీ పార్లర్ బిజినెస్‌తో భారీ మోసం! అక్క, బావ, మరదలు కలిసి 3 కోట్లతో ఎస్కేప్!
Hyderabad News: ఒక్కో బ్యూటీ పార్లర్ ఫ్రాంచైజీ కోసం రూ.3.2 లక్షలు వసూలు చేసినట్లు తెలిసింది. వసూలైన మొత్తంతో ఉడాయించారు.
Beauty Parlour Franchise in Hyderabad: మేడ్చల్ జిల్లాలో భార్యాభర్తలు, వారి బంధువైన ఓ యువతి చేసిన మోసం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. "రోజ్ గోల్డ్ బ్యూటీ పార్లర్" పేరుతో ఏకంగా రూ.3 కోట్ల వసూళ్లకు పాల్పడి కిలాడి దంపతులు మాయమైయ్యారు. వీరికి భార్య సోదరి కూడా సహకరించింది. నిందితులను భార్య సమీనా, భర్త ఇస్మాయిల్, మరదలు జెస్సికా అని పోలీసులు గుర్తించారు. గతంలోను చిట్ ఫండ్ పేరుతో కోట్ల రూపాయలు మోసం చేసినట్టు వీరిపై ఆరోపణలు ఉన్నాయి. మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, కామారెడ్డి జిల్లాల్లో వందల సంఖ్యలో బాధితులు వీరి మోసానికి బలయ్యారని తెలిసింది.
వీరు ఒక్కో బ్యూటీ పార్లర్ ఫ్రాంచైజీ కోసం రూ.3.2 లక్షలు వసూలు చేసినట్లు తెలిసింది. వసూలైన మొత్తంతో ఉడాయించారు. ఫ్రాంచైజీ తీసుకుంటే నెలకి రూ.35 వేలు జీతం ఇస్తామని నమ్మించి దంపతులు సమీనా, ఇస్మాయిల్ కస్టమర్లను ఆకర్షించేవారు. వారి మాయమాటలు నమ్మి మంగళ సూత్రాలు అమ్మి, అప్పు చేసి ఫ్రాంచైజీ తీసుకున్న బాధితులకు రెండు మూడు నెలల పాటు జీతం ఇచ్చి ఆ తర్వాత రేపు మాపు అంటూ నిందితులు కాలం వెళ్లదీశారు. వీరు జీతాల కోసం కాల్ చేయగా ఫోన్లు స్విచ్ఛాఫ్ చేసుకున్నారు.
దీంతో అనుమానం వచ్చి బాధితులు హైదరాబాద్ లోని ప్రగతి నగర్ హెడ్ ఆఫీస్ కి వెళ్లగా తాళం వేసి ఉంది. దీంతో మోసపోయామని గ్రహించిన బాధితులు బావురుమంటున్నారు. ఆరు నెలల నుంచి ప్రగతినగర్ బ్రాంచ్ మూసివేసి ఉందని స్థానికులు తెలిపారు. భాదితులు బాచుపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు.