Warangal News: చదివింది ఏంబీఏ - పారిశుద్ధ్య కార్మికురాలిగా భార్య, ఆటో డ్రైవర్ గా భర్త, ఆ కష్టం వెనుక కథ ఇదే!
MBA Graduate Couple: హన్మకొండ జిల్లాకు చెందిన ఆ దంపతులు చదివింది ఎంబీఏ. అయితే, ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా భార్య పారిశుద్ధ్య కార్మికురాలిగా చేస్తుండగా, భర్త ఆటో డ్రైవర్ గా కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు.
MBA Graduate Couple Doing Sanitation and Auto Driver Work in Warangal: ఆ దంపతులు ఉన్నత చదువులు చదివారు. అందరిలా మంచి ఉద్యోగాల్లో స్థిరపడి, సమాజంలో గొప్ప పేరు తెచ్చుకోవాలని భావించారు. అయితే, ఆర్థిక ఇబ్బందులు, చదువుకు తగ్గ ఉపాధి అవకాశాలు దొరక్క వారి ఆశలు అడియాశలయ్యాయి. కుటుంబ పోషణ కోసం భార్య పారిశుద్ధ్య కార్మికురాలిగా మారగా, భర్త ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. హన్మకొండ (Hanmakonda) జిల్లాకు చెందిన ఈ దంపతుల కష్టం వెనుక కథ అందరినీ ఆవేదనకు గురి చేస్తోంది.
హన్మకొండ జిల్లా వెంకటాపూర్ (Venkatapur) గ్రామానికి చెందిన మానస (Manasa), దిలీప్ కుమార్ (Dileepkumar) దంపతులు. ఒకే గ్రామానికి చెందిన వీరు పెద్దలను ఒప్పించి మరీ ప్రేమ వివాహం చేసుకున్నారు. మానస ఎంబీఏ ఫైనాన్స్ చేయగా, దిలీప్ కుమార్ ఎంబీఏ మార్కెటింగ్ పూర్తి చేశారు. ఉన్నత విద్య పూర్తి చేశాం. ఇక జీవితం సాఫీగా సాగిపోతుందనుకున్న తరుణంలో ఆర్థిక ఇబ్బందులు, పరిస్థితులు వారిని ఎదుగుదలకు అడ్డంకిగా మారాయి. చదువుకు తగ్గ ఉపాధి అవకాశాలు లేక, కుటుంబ భారం పెరగడంతో మానస వెంకటాపూర్ పంచాయతీలోనే పారిశుద్ధ్య కార్మికురాలిగా మారారు. భర్త దిలీప్ కుమార్ ఆటో డ్రైవర్ గా మారి కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు.
ఆ విధుల్లో ఎలా చేరారంటే.?
ఎంబీఏ అర్హతతో ప్రైవేట్ ఉద్యోగంలో చేరితే రూ.7 వేలకు మించి రాకపోవడంతో మానస పారిశుద్ధ్య కార్మికురాలిగా చేరారు. ఇందులో నెలకు రూ.9 వేల వరకూ వస్తుందని, అందుకే పారిశుద్ధ్య కార్మికురాలిగా కొనసాగుతున్నట్లు ఆమె వెల్లడించారు. అయితే, పారిశుద్ధ్య కార్మికురాలిగా కూడా విచిత్రంగా ఆమె విధుల్లోకి వచ్చారు. మానస అత్తమ్మ కనికర వెంకటాపూర్ గ్రామ పంచాయతీలో పారిశుద్ధ్య కార్మికులిగా పనిచేసేది. ఆమెకు పక్షవాతం రావడంతో, ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా మానస గత రెండేళ్లుగా ఇలా విధులు నిర్వహిస్తున్నారు. మానస విద్యార్హతలు తమకు తెలియవని, ఆమె అత్తమ్మకు పక్షవాతం రాగా ఆ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్నారని, దీంతో పంచాయతీలో తీర్మానించి పారిశుద్ధ్య కార్మికురాలిగా నియమించామని పంచాయతీ సర్పంచ్ వెల్లడించారు.
కొద్దిలో చేజారిన ప్రభుత్వ ఉద్యోగం
తనకు ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు కొద్దిలోనే మిస్ అయ్యాయని మానస తెలిపారు. పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం 2 మార్కులతో మిస్ అయ్యిందని చెప్పారు. ఇతర ఉద్యోగ నోటిఫికేషన్లలో పరీక్షలు రాసిన తర్వాత రద్దు కావడంతో ఏమీ చేయలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, ఉన్నత చదువులు చదివి ఈ ఉద్యోగం చేయడం పట్ల తోటి కార్మికులు ఆశ్చర్యానికి గురవుతున్నారని, అయినా పరిస్థితుల వల్ల తప్పడం లేదని మానస వాపోయారు. ప్రభుత్వం దృష్టి సారించి తన చదువుకు తగ్గ ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇంత చదువుకుని కూడా తమతో పాటు కలిసి పారిశుద్ధ్య కార్మికురాలిగా మానస పని చేయడం బాధ కలిగిస్తుందని తోటి కార్మికులు అన్నారు.
భర్త ఆటో డ్రైవర్ గా
అటు, ఎంబీఏ చదివిన మానస భర్త దిలీప్ కుమార్ సైతం ఆటో డ్రైవర్ గా మారి జీవనం సాగిస్తున్నారు. ప్రైవేట్ ఉద్యోగాలు చేసినా తనకు సంతృప్తి ఇవ్వలేదని, ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిద్దామంటే నోటిఫికేషన్లు లేక డ్రైవర్ గా కొనసాగుతున్నట్లు వెల్లడించారు. తన లాంటి వారు చాలా మంది ఉపాధి అవకాశాలు లేక చదువుకొని కూడా ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు.
ఏది ఏమైనా ఉన్నత విద్యను అభ్యసించిన దంపతులు ఇలా పారిశుద్ధ్య కార్మికురాలిగా, ఆటో డ్రైవర్ గా కుటుంబాన్ని పోషించుకోవాల్సి రావడం బాధాకరమనే చెప్పాలి. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ పరిస్థితులు ఇలా కారణాలేవైనా వారు ఇలా ఉపాధి పొందడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.